Share News

సేవలకు గుర్తింపు

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:20 AM

Selection of Best Teachers at the State Level జిల్లాకు చెందిన పలువురు అధ్యాపకుల సేవలకు గుర్తింపుగా రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికయ్యారు. వీరు శనివారం అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారాలు అందుకోనున్నారు.

సేవలకు గుర్తింపు
అధ్యాపకులు ఏడుకొండలు, వెంకటరత్నం, జయసుధాకర్‌

  • రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుల ఎంపిక

  • నేడు పురస్కారం అందుకోనున్న జిల్లావాసులు

  • ఎచ్చెర్ల/ఆమదాలవలస, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాకు చెందిన పలువురు అధ్యాపకుల సేవలకు గుర్తింపుగా రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికయ్యారు. వీరు శనివారం అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారాలు అందుకోనున్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్‌ విభాగంలో 10 మందికి మాత్రమే అవార్డులకు ఎంపిక చేసింది. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల (శ్రీకాకుళం)లో మెకానికల్‌ విభాగం సీనియర్‌ లెక్చరర్‌ జి.ఏడుకొండలు ఉత్తమ అధ్యాపక పురస్కారానికి ఎంపికయ్యారు. గుంటూరుకు చెందిన ఏడుకొండలు తొలుత ఒంగోలు మున్సిపాల్టీలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ)గా మూడున్నరేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. అయితే భావి భారత ఇంజనీర్లను తీర్చిదిద్దాలన్న తపనతో, విద్యా బోధనపై ఉన్న అపారమైన మక్కువతో ఇంజనీర్‌ హోదాను సైతం పక్కనపెట్టి అధ్యాపక వృత్తిని ఎంచుకున్నారు. 2012లో నర్సీపట్నం పాలిటెక్నిక్‌ కళాశాలలో లెక్చరర్‌గా ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఆ తర్వాత విశాఖపట్నం, 2022 నుంచి శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో సీనియర్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. మారుతున్న సాంకేతిక విజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఏడుకొండలు ముందుంటారు. విద్యార్థులకు భవిష్యత్‌ అవసరాలైన ఎలక్ట్రిక్‌ వాహనాలు (ఈవీ), 3 డీ ప్రింటింగ్‌ టెక్నాలజీ, సోలార్‌ ప్యానల్స్‌, అత్యాధునిక బ్యాటరీ వ్యవస్థలపై విస్తృత స్థాయిలో వర్క్‌షాపులు, రాష్ట్ర స్థాయి సెమినార్‌లు నిర్వహించి ప్రత్యేక గుర్తింపు పొందారు. తరగది గది బోధనకే పరిమితం కాకుండా, విద్యార్థులకు సులువుగా అర్ధమయ్యేలా మెకానికల్‌ ఇంజనీరింగ్‌, డ్రాయింగ్‌ సబ్జెక్ట్‌లపై ప్రామాణిక పుస్తకాలను రచించారు. ఏడుకొండలు ప్రతిష్ఠాత్మక రాష్ట్ర స్థాయి పురస్కారానికి ఎంపక కావడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.నారాయణరావు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు హర్షం వ్యక్తంచేశారు.

  • ఆమదాలవలస ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఈసీఈ విభాగం లెక్చరర్‌ వై.వెంకటరత్నం కూడా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ బి.జానకిరామ్‌, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఆమెను అభినందించారు. విద్యార్థుల పట్ల అంకితభావంతో పాటు సాంకేతిక విద్యాభివృద్ధికి ఆమె చేసిన కృషి కళాశాల, ఈ ప్రాంతానికి గర్వకారణమని ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు. కాగా వై.వెంకటరత్నం ఎలక్ర్టానిక్స్‌, కమ్యూనికేషన్‌ విభాగం విద్యార్థులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

  • తొగరాం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వృక్షశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఎస్‌.జయసుధాకర్‌ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్‌ వర్మతో పాటు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఆయనకు అభినందనలు తెలిపారు. జయసుధాకర్‌ విశాఖపట్నం ఆంధ్రాయూనివర్శిటీ ఎమ్మెస్సీ చదువుతూ టాపర్‌గా నిలిచారు. తొగరాం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బోటనీ అధ్యాపకుడిగా చేరిన నాటి నుంచి ఎన్నో సైన్స్‌ ఎగ్జిబిషన్లు విద్యార్థులచే తయారు చేయించారు. బహుమతులు కూడా సాధించారు. పాలకొండలో నిర్వహించిన సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో జయ సుధాకర్‌ ఉత్తమ ప్రతిభ కనబరిచారు.

Updated Date - Sep 05 , 2026 | 12:20 AM