Share News

ప్రధాన పార్టీలకు రెబల్‌ టెన్షన్‌!

ABN , Publish Date - Oct 19 , 2026 | 12:20 AM

TDP leaders file nominations in wards allocated to Jana Sena జిల్లాలో మునిసిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన, వైసీపీకి రెబెల్స్‌ బెడద మొదలైంది. సీట్ల కేటాయింపుపై అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా నామినేషన్లు వేయడంతో పలు చోట్ల పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.

ప్రధాన పార్టీలకు రెబల్‌ టెన్షన్‌!

పలాస-కాశీబుగ్గలో జనసేన వార్డుల్లో టీడీపీ నేతల నామినేషన్లు

టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థికి పోటీగా సొంత పార్టీ నేత కుమార్తె

ఇచ్ఛాపురం 25వ వార్డులో ఒకే కుటుంబం నుంచి వైసీపీ అభ్యర్థులు

నేడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌

శ్రీకాకుళం, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మునిసిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన, వైసీపీకి రెబెల్స్‌ బెడద మొదలైంది. సీట్ల కేటాయింపుపై అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా నామినేషన్లు వేయడంతో పలు చోట్ల పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరోవైపు జిల్లాలో మండల పరిషత్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

జనసేనకు కేటాయించిన చోట్ల టీడీపీ పోటీ

కూటమి పొత్తులో భాగంగా పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో జనసేనకు 5 వార్డులు కేటాయించారు. 1, 2, 10, 12, 20 వార్డులను ఆ పార్టీకి కేటాయించగా.. ఆయా స్థానాల్లో గతంలో కీలకంగా వ్యవహరించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా నామినేషన్లు వేశారు. మరోవైపు జనసేనకు కేటాయించిన వార్డుల సంఖ్యపై ఆ పార్టీ నాయకుల మధ్య కూడా అంతర్గతంగా విభేదాలు చోటుచేసుకున్నాయి. 9వ వార్డును బీజేపీకి కేటాయించగా, అక్కడ కూడా టీడీపీ అభ్యర్థులు పోటీకి ఆసక్తి చూపడం గమనార్హం.

చైర్‌పర్సన్‌ అభ్యర్థిపైనా తిరుగుబాటు

పలాస-కాశీబుగ్గ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానానికి టీడీపీ అధిష్ఠానం ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు సతీమణి గంగాభవాని పేరును ఖరారు చేసింది. అయితే, వైసీపీ హయాంలో అప్పటి మంత్రి సీదిరి అప్పలరాజుతో విభేదించి టీడీపీలో చేరిన దువ్వాడ శ్రీకాంత్‌.. తన కుమార్తె శ్రీజను రెబల్‌ అభ్యర్థిగా బరిలోకి దించారు. ఆమెతో చైర్‌పర్సన్‌ స్థానానికి నామినేషన్‌ వేయించారు. దీంతో సొంత పార్టీ నుంచే గంగాభవానికి పోటీ ఎదురైంది. కొన్నిచోట్ల టీడీపీ అభ్యర్థులకు ఏకగ్రీవ అవకాశాలున్నప్పటికీ, ఆ దిశగా పార్టీ ప్రయత్నాలు చేయకపోవడంతో అక్కడా పోటీ అనివార్యమయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఇచ్ఛాపురంలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు

ఇచ్ఛాపురం మునిసిపాలిటీలోనూ జనసేనకు కేటాయించిన కొన్ని వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 25వ వార్డులో వైసీపీ పరిస్థితి ఆసక్తికరంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన ఉణాల భారతీదివ్య, ఉణాల జ్యోతి నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో భారతీదివ్య మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్‌పర్సన్‌. ఈ ఇద్దరి భర్తలు శేషుయాదవ్‌, కోదండరాం అన్నదమ్ములు. ఇద్దరూ వృత్తిరీత్యా వైద్యులు కావడం విశేషం. ఒకే వార్డులో ఒకే పార్టీ నుంచి ఈ కుటుంబానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.

నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక అభ్యర్థుల పత్రాల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ మిగిలి ఉంది. ఈ దశలో రెబల్స్‌ పోటీలో కొనసాగుతారా? లేదా? అన్నది పార్టీలకు కీలకంగా మారింది.

నేడు పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌

జిల్లాలో మండల పరిషత్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. జిల్లాలోని 30 మండలాల్లో 30 ఎంపీపీ, 30 జడ్పీటీసీలు, 542 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 3న పోలింగ్‌ నిర్వహించనుండగా, నవంబరు 5న ఫలితాలు ప్రకటించనున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లను ప్రకటించారు.

Updated Date - Oct 19 , 2026 | 12:20 AM