పల్లెల్లోనూ రియల్ దందా
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:38 AM
Illegal layouts at srikakulam జిల్లాలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. గతంలో పట్టణానికి 10 కిలోమీటర్లు దూరం వరకు వెలసిన అక్రమ లేఅవుట్లు.. నేడు మారుమూల పల్లెల్లో, గిరిజన ప్రాంతాల్లో వేస్తున్నారు. కొంతమంది రాజకీయ నేతల అండతో డీపట్టా భూముల్లో వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు.
పుట్టగొడుగుల్లా అక్రమ లేఅవుట్లు
అనుమతుల్లేకుండానే విస్తరణ
డీపట్టా భూములనూ వదలని వైనం
చోద్యం చూస్తున్న అధికారులు
హరిపురం, జూన్ 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. గతంలో పట్టణానికి 10 కిలోమీటర్లు దూరం వరకు వెలసిన అక్రమ లేఅవుట్లు.. నేడు మారుమూల పల్లెల్లో, గిరిజన ప్రాంతాల్లో వేస్తున్నారు. కొంతమంది రాజకీయ నేతల అండతో డీపట్టా భూముల్లో వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. అధికారులకు తెలిసినా.. చూసీచూడనట్టు వదిలేస్తున్నారు.
నిబంధనలకు నీళ్లు..
జిల్లాలోని పంచాయతీల ఆధ్వర్యంలో అధికారికంగా గుర్తించిన వెంచర్లు 162 మాత్రమే. కాగా అనుమతి లేని లేఅవుట్లు వందల సంఖ్యలో ఉన్నాయి. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించాలంటే భూమికి ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న విలువలో 10 శాతం రెవెన్యూ శాఖకు చెల్లించాలి. కానీ లేఅవుట్లు రెవెన్యూ శాఖ అనుమతితో భూమార్పిడి చేయకుండానే వెంచర్లు వేస్తున్నారు. ‘సుడా’ అనుమతి తీసుకుని ప్రభుత్వానికి రూ.లక్షల్లో సొమ్ము చెల్లించాల్సి రావడంతో కిందిస్థాయి సిబ్బందికి ఎంతోకొంత ముట్టజెప్పి పని కానిచ్చేస్తున్నారు. స్థానిక సంస్థల అనుమతి పొందడానికి భూమి విలువలో ఒక శాతం మొత్తాన్ని చెల్లించాలి. లేఅవుట్లుగా వేస్తున్న భూమిలో 10శాతం సామాజిక అవసరాలకు స్థానిక సంస్థలకు అప్పగించాలి. అంతర్గత రహదారులు, ఓవర్‌హెడ్ ట్యాంకు, ఆట స్థలాలు, ప్రార్థనాలయాలు, విద్యాలయాలు నిర్మించాల్సి ఉంది. కాగా ఈ నిబంధనలు ఎక్కడా పాటించడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు డబ్బే పరమావధిగా నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా విక్రయాలు చేస్తున్నారు.
అక్రమాలే అధికం
మందస, హరిపురం ప్రాంతాల్లో సుమారు 220 ఎకరాల పచ్చని పంట పొలాల్లో సైతం అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. మందస మండలం సాబకోట, కిల్లోయి, సాపరాయి, కొండలోగాం, మందస రోడ్ వంటి అనేక ప్రాంతాల్లో డీపట్టా భూముల్లో అక్రమ లేఅవుట్లను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. మందస ప్రాంతంలో మారుమూల ప్రాంతాలైన పొత్తంగి, సిరిపురంతోపాటు ఏజెన్సీ గ్రామాల్లో సైతం సుడా అనుమతి లేకుండా పంట పొలాలు వెంచర్లుగా మారుతున్నాయి. హరిపురం, పూండి వంటి పలు ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను కూడా భూబకాసురులు విడిచిపెట్టడం లేదు. ఆ భూముల్లో అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. పలాస నియోజకవర్గం విద్యా, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందుతుండడంతో ఇక్కడ ప్లాట్లు కొనుగోలుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో పలాస చుట్టూ ప్రాంతాల్లో, హరిపురం వెళ్లే జాతీయ రహదారి వెంబడి వందల ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి.
ప్రభుత్వానికి నివేదించాం
జిల్లాలో వెలసిన లేఅవుట్లలో కనీసం 10శాతం కూడా అనుమతులు తీసుకోలేదు. అక్రమ లేఅవుట్లపై ప్రభుత్వానికి, ముఖ్య కార్యదర్శికి నివేదించాం. పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అక్రమార్కులపై కఠినచర్యలు తీసుకుంటాం.
స్వరూపరాణి, జిల్లా పంచాయతీ అధికారి, శ్రీకాకుళం
పరిశీలించి చర్యలు
డీపట్టా భూములు, అసైన్డ్ భూముల్లో వెలసిన లే అవుట్లు విషయమై నా పరిశీలనకు రాలేదు. మండలంలోని అన్ని లేఅవుట్లను పరిశీలిస్తాం. అనుమతులు లేనివాటిపై చర్యలు తీసుకుంటాం. పంట పొల్లాల్లో, ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఅవుట్లు వేస్తే క్రిమినల్ చర్యలకు సిఫారసు చేస్తాం.
కె.రామకృష్ణ, ఇన్‌చార్జి తహసీల్దార్, మందస