Share News

స్థానిక సమరానికి సిద్ధం

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:45 PM

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు ఎన్డీఏ కూటమి శ్రేణులు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

స్థానిక సమరానికి సిద్ధం
మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు, పాల్గొన్న ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సన్నద్ధంగా ఉండాలి

పార్టీల బలాన్ని మరింత పటిష్ఠం చేయాలి

కూటమి శ్రేణులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు

శ్రీకాకుళం పార్లమెంటరీ ఎన్డీఏ సమన్వయ కమిటీ భేటీ

శ్రీకాకుళం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు ఎన్డీఏ కూటమి శ్రేణులు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. స్థానిక పోరులోనూ సత్తా చాటేలా మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా సోమవారం శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన జిల్లా పార్లమెంటరీ టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఎన్నికల సన్నద్ధత, కూటమి పార్టీల మధ్య సమన్వయం, నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, గ్రామస్థాయిలో పార్టీల పరిస్థితులు తదితర అంశాలపై చర్చించారు.

ఉమ్మడి కార్యాచరణతో ముందుకు..

మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పరస్పర అవగాహన, సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. స్థానిక రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. కూటమి పార్టీల సమన్వయ కమిటీలు మరింత చురుగ్గా పనిచేయాలన్నారు. కూటమి పార్టీల నాయకత్వం, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, సమన్వయ కమిటీ సభ్యులు, క్షేత్రస్థాయి క్యాడర్‌ మధ్య నిరంతర సమాచార మార్పిడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

ప్రజల్లోకి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి..

ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలు, అవసరాలు, స్థానిక పరిస్థితులపై నాయకులు అవగాహన కలిగి ఉండాలని మంత్రి సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పార్టీ కార్యక్రమాలను విస్త్రృతంగా నిర్వహించాలన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

సమావేశంలో కూటమి పక్షాలకు చెందిన శాసనసభ్యులు, ముఖ్య నాయకులు గొండు శంకర్‌, బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్‌, గౌతు శిరీష, లోకం మాధవి, ఎన్‌.ఈశ్వరరావుతో పాటు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.రమేష్‌, పీరికట్ల విఠల్‌, పీఎంజే బాబు, పైడి వేణుగోపాల్‌, పేడాడ రామమోహన్‌రావు, దాసరి రాజు, గేదెల చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 11:45 PM