Share News

చక్రతీర్థ స్నానాలకు సిద్ధం

ABN , Publish Date - Feb 17 , 2026 | 11:34 PM

Today Sri Mukhalingeshwara festival శ్రీముఖలింగేశ్వరస్వామి చక్రతీర్థ స్నానాలకు దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను నందివాహనంపై ఊరేగించి.. మేళతాళాలు.. మంగళవాయిద్యాల నడుమ మిరియాపల్లి రేవులో(వంశధార నది) చక్రతీర్థ స్నానాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు.

చక్రతీర్థ స్నానాలకు సిద్ధం
చక్రతీర్థ స్నానాలకు వెళ్లే మార్గాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఫృథ్వీరాజ్‌

  • నేడు శ్రీముఖలింగేశ్వరుడి ఉత్సవం

  • భక్తులకు ఇబ్బందులు లేకుండా భారీ బందోబస్తు

  • ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

  • మిరియాపల్లి రేవులో ఏర్పాట్లు పరిశీలన

  • జలుమూరు, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): శ్రీముఖలింగేశ్వరస్వామి చక్రతీర్థ స్నానాలకు దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను నందివాహనంపై ఊరేగించి.. మేళతాళాలు.. మంగళవాయిద్యాల నడుమ మిరియాపల్లి రేవులో(వంశధార నది) చక్రతీర్థ స్నానాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీసు సిబ్బందిని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. మంగళవారం మిరియాపల్లిలో రేవులో చక్రతీర్థ స్నానాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ‘చక్రతీర్థ స్నానాలు వద్ద పోలీసులు విధిగా విజిల్‌, హెల్మెట్‌, లాఠీ, రోప్‌ తప్పనిసరిగా ధరించాలి. వంశధారనదికి వచ్చినపుడు స్వామిని భక్తులు తాకకుండా ఉండేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. నాలుగులైన్ల బారికేడ్లు ఏర్పాటు చేసి మెస్‌లు బిగించాలి. మిరియాపల్లి రేవులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్‌రూమ్‌కి అనుసంధానం చేయాల’ని ఎస్పీ ఆదేశించారు. స్వామిని తీసుకొచ్చే మార్గాన.. వంశధార కరకట్ట వద్ద ఎత్తు తగ్గించాలని పంచాయతీరాజ్‌ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ పృధ్వీరాజ్‌ కుమార్‌, ఆర్డీవో కె.సాయిప్రత్యూష, ఏఎస్పీలు కె.వి.రమణ, పి.శ్రీనివాసరావు, డీఎస్పీలు వివేకానంద, షేక్‌ షాహబాజ్‌ అహ్మద్‌, లక్ష్మణరావు, గోవిందరావు, తహసీల్దారు జె.రామారావు పాల్గొన్నారు.

  • 882 మందితో భారీ బందోబస్తు

  • శ్రీముఖలింగేశ్వరుడి చక్రతీర్థ స్నానాలకు 882 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి తెలిపారు. ఇద్దరు ఏఎస్పీలను, 5 మంది డీఎస్పీలను, 20 మంది సీఐలను, 48 మంది ఎస్‌ఐలను, 139 మంది ఏఎస్‌ఐ, హెచ్‌సీలను, 283 మంది పోలీసులను, 58 మంది మహిళా పోలీసులను, 220 మంది హోంగార్డులను, 10 రోప్‌ పార్టీలను(105 మందిని) నియమించామన్నారు.

  • ప్రైవేటు డ్రోన్ల వినియోగం నిషేధం

  • శ్రీముఖలింగంలో స్వామి చక్రతీర్థ స్నానాలు వద్ద ప్రైవేటు డ్రోన్ల వినియోగం నిషేధమని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆలయ పరిసరాలు, వంశధార నది పరివాహక ప్రాంతాల్లో ప్రైవేటు డోన్లు ఎగురవేయరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్‌శాఖ మార్గదర్శకాలను పాటించి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భక్తులు, ప్రజలు సహకరించాలని కోరారు.

Updated Date - Feb 17 , 2026 | 11:34 PM