రీడింగ్ పరుగో పరుగు
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:32 AM
Electricity consumption at record level in the srikakulam సిక్కోలును ఎండలు మాడ్చేశాయి. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మే నెలలో భానుడు నిప్పులు చెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉదయం 8కే ఎండల తీవ్రత మొదలవడంతో బయటకు రావాలంటేనే హడలిపోయారు. వాతావరణం నిప్పుల కొలిమిని తలపించడం, ఉక్కపోత తీవ్రంగా ఉండటంతో ఉపశమనం కోసం ప్రజలు ఏసీలు, కూలర్లను ఆశ్రయించక తప్పలేదు. నిత్యం ఫ్యాన్లు తిరుగుతూనే ఉండేవి. ఫలితంగా మీటర్ల రీడింగ్ పెరిగి.. జిల్లాలో విద్యుత్ వినియోగం ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరింది.
మండుటెండల్లో.. గిర్రున తిరుగుతున్న మీటర్లు
జిల్లాలో రికార్డుస్థాయిలో విద్యుత్ వినియోగం
గత ఏడాదితో పోలిస్తే మే నెలలో అదనంగా 28.902 మిలియన్ యూనిట్ల ఖర్చు
అత్యధికంగా శ్రీకాకుళం డివిజన్‌లోనే 16 ఎంయూల వాడకం
ఓవర్‌లోడ్‌తో బెంబేలెత్తుతున్న ప్రజలు
శ్రీకాకుళం, జూన్ 4(ఆంధ్రజ్యోతి):
సిక్కోలును ఎండలు మాడ్చేశాయి. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మే నెలలో భానుడు నిప్పులు చెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉదయం 8కే ఎండల తీవ్రత మొదలవడంతో బయటకు రావాలంటేనే హడలిపోయారు. వాతావరణం నిప్పుల కొలిమిని తలపించడం, ఉక్కపోత తీవ్రంగా ఉండటంతో ఉపశమనం కోసం ప్రజలు ఏసీలు, కూలర్లను ఆశ్రయించక తప్పలేదు. నిత్యం ఫ్యాన్లు తిరుగుతూనే ఉండేవి. ఫలితంగా మీటర్ల రీడింగ్ పెరిగి.. జిల్లాలో విద్యుత్ వినియోగం ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరింది. విద్యుత్‌శాఖ తాజాగా వెల్లడించిన గణాంకాలను పరిశీలిస్తే.. గత ఏడాది మే నెలతో పోలిస్తే.. ఈ ఏడాది మే నెలలో కరెంటు వాడకం అనూహ్యంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో గత ఏడాది మే నెలలో మొత్తం 193.804 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ వినియోగించారు. ఈ ఏడాది మే నెలలో అది ఏకంగా 222.706 మిలియన్ యూనిట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఒక్క నెలలోనే అదనంగా 28.902 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ప్రజలు వినియోగించారు. ఒక్క మిలియన్ యూనిట్ అంటే పది లక్షల యూనిట్లతో సమానం. దీన్నిబట్టి గడిచిన నెల విద్యుత్ వాడకం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
శ్రీకాకుళం డివిజన్ టాప్
సబ్‌డివిజన్ల వారీగా విద్యుత్ వినియోగాన్ని పరిశీలిస్తే.. శ్రీకాకుళం డివిజన్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ డివిజన్ పరిధిలో గతేడాది మే నెలలో 120.126 మిలియన్ యూనిట్ల కరెంటు వాడగా.. ఈ ఏడాది మే నెలలో అది 136.546 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. అంటే గత ఏడాదితో పోలిస్తే 16.420 మిలియిన్ యూనిట్ల అదనపు వాడకం నమోదైంది.
టెక్కలి డివిజన్ పరిధిలోనూ కరెంటు వాడకం జోరుగానే సాగింది. గత ఏడాది మే నెలలో ఇక్కడ 41.363 మిలియన్ యూనిట్లు వాడగా, ఈ ఏడాది మే నాటికి అది 52.671 మిలియన్ యూనిట్లకు పెరిగింది. ఇక పలాస డివిజన్‌లో గత ఏడాది మే నెలలో 32.315 ఎంయూలు వాడగా, ఈసారి 33.489 ఎంయూలకు చేరింది.
జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం, తీవ్రమైన వడగాలుల కారణంగా ఇళ్లు, కార్యాలయాలు, దుకాణాలు.. ఇలా ప్రతి చోటా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం తప్పనిసరిగా మారింది. దీనికితోడు.. వేసవికి భూగర్భ జలాలు అడుగంటడంతో వ్యవసాయ బోరు బావుల మోటార్లు సైతం ఎక్కువ సమయం నడపాల్సి రావడం విద్యుత్ వినియోగం అమాంతం పెరగడానికి మరో ప్రధాన కారణం. కరెంటు వాడకం ఒక్కసారిగా పెరగడంతో చాలాప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లపై తీవ్ర ఒత్తిడి పడి ఓవర్‌లోడ్ సమస్యలు తలెత్తుతున్నాయి. మొత్తానికి మే నెల ఎండల తీవ్రత జిల్లా ప్రజలకు, విద్యుత్ శాఖకు గట్టిగానే కరెంట్ ‘షాక్’ ఇచ్చిందనే చెప్పాలి.
శ్రీకాకుళం సర్కిల్‌లో మే నెలలో విద్యుత్ వినియోగం (మిలియన్ యూనిట్లలో)..
------------------------------------------------------------------------------
డివిజన్ గతేడాది ఈ ఏడాది పెరుగుదల
-----------------------------------------------------------------------
శ్రీకాకుళం 120.126 136.546 16.420
టెక్కలి 41.363 52.671 11.308
పలాస 32.315 33.489 1.174
----------------------------------------------------------------------
సర్కిల్ మొత్తం 193.804 222.706 28.902
---------------------------------------------------------------------