Share News

రేషన్‌, ‘ఉపాధి’కి దూరంగా..

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:54 PM

Ration problems బేసిరామచంద్రాపురంలో కొంతమంది గ్రామస్థులు రేషన్‌ సరుకుల కోసం పాట్లు పడుతున్నారు. మరోవైపు ఉపాధిహామీ పనులకు కూడా అవస్థలు తప్పడం లేదు. రేషన్‌, ఉపాధిహామీ పనుల కోసం మూడు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు.

రేషన్‌, ‘ఉపాధి’కి దూరంగా..
మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న డిపో నుంచి రేషన్‌ సరుకులు తెస్తున్న కార్డుదారులు (ఫైల్‌)

  • ఇంటి ముందే డిపో ఉన్నా అందని సరుకులు

  • మూడు కిలోమీటర్లు వెళితేనే.. ఫలితం

  • జలంత్ర శాసనం పంచాయతీలోని బేసిరామచంద్రాపురం వాసులకు తప్పని ఇక్కట్లు

  • సోంపేట రూరల్‌, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): బేసిరామచంద్రాపురంలో కొంతమంది గ్రామస్థులు రేషన్‌ సరుకుల కోసం పాట్లు పడుతున్నారు. మరోవైపు ఉపాధిహామీ పనులకు కూడా అవస్థలు తప్పడం లేదు. రేషన్‌, ఉపాధిహామీ పనుల కోసం మూడు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలోని కొన్ని వీధులు రెండు పంచాయతీలు.. రెండు మండలాల పరిధిలో ఉండడంతో ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు. దశాబ్దాలుగా తమ బాధలను పట్టించుకున్నవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • కంచిలి మండలం జలంత్ర శాసనంలో 350 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామంలోని పాఠశాల వీధి, బ్రాహ్మణ, హరిజన వీధులు.. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సోంపేట మండలం బేసిరామచంద్రాపురం పంచాయతీలో కొనసాగుతున్నాయి. ఈ మూడు వీధుల్లో సుమారు వంద కుటుంబాల ప్రజలు రెండు గ్రామాల మధ్య నలిగిపోతున్నారు. జలంత్ర శాసనం పరిధిలో నివాసం ఉంటున్న 80 మందికి బేసిరామచంద్రాపురం రేషన్‌ డిపోలో కార్డులు ఉన్నాయి. కాగా సొంత ఊరిలో డిపో ఎదురుగా ఉన్నా.. రేషన్‌ సరుకులు తీసుకోలేకపోతున్నామని పేర్కొంటున్నారు. ఏ చిన్న అవసరానికైనా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బేసిరామచంద్రాపురం వెళ్లాల్సి వస్తోంది. స్థానిక డీలర్‌కు రేషన్‌ సరుకులు అడిగితే కార్డులు తమ పరిధిలో లేవని నిరాకరిస్తున్నారు. దీంతో ప్రతినెలా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న డిపో నుంచి సరుకులు తేవడం కష్టమవుతోందని రెయ్యి సోమేశ్వరరావు, జత్తు కుమారస్వామి, జుత్తు ఎర్రయ్య తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూతవేటు దూరంలో కంచిలి మండలంలోని జలంత్ర శాసనంలో తమ గ్రామాన్ని విలీనం చేయాలని కోరుతున్నారు. లేదంటే బేసిరామచంద్రాపురం రేషన్‌ డిపో డీలర్‌ తమ వద్దకు వచ్చి సరుకులు అందజేయాలని జత్తు మోహనరావు, గొరకల గురుమూర్తి, గొరకల కుమారస్వామి తదితరులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ వంద కుటుంబాలకు ప్రత్యేక రేషన్‌ డిపో మంజూరు చేయడమో.. లేదంటే జలంత్ర శాసనం డిపోలో విలీనం చేయాలని కార్డుదారులు జారు వజ్రం, శ్యామల, లక్ష్మీ, జారు నందిని, ఈశ్వరి కోరుతున్నారు.

  • రెండు పంచాయతీల పరిధిలో ఉండడంలో తమకు రెవెన్యూ, పాలనాపరమైన సమస్యలు మాకు తప్పడం లేదు. ఉపాధి హామీ పథకం పనుల విషయంలో సైతం మూడు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచన చేయాలి. జలంత్ర శాసనం పరిధిలో పనులు కల్పించాలని బేసిరామచంద్రాపురంలోని ఆ వంద కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

  • ఈ విషయమై సోంపేట తహసీల్దార్‌ బి.అప్పలస్వామి వద్ద ప్రస్తావించగా.. ‘ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోర్టబులిటీ విధానం ద్వారా రేషన్‌ సరుకులు ఏ డిపో నుంచి అయినా తీసుకోవచ్చు. ఆ గ్రామంలో డీలరు వద్ద రేషన్‌ సరుకులు పొందవచ్చు. రేషన్‌ డీలర్‌ సరుకులు ఇచ్చేందుకు నిరాకరిస్తే ఫిర్యాదు చేయండి. సమస్య పరిష్కరిస్తాన’ని తెలిపారు.

Updated Date - Apr 25 , 2026 | 11:54 PM