రథసప్తమి వేడుకలు.. భవిష్యత్‌కు మార్గదర్శకం
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:24 AM
Rath Saptami celebrations ఈ ఏడాది నిర్వహిస్తున్న రథసప్తమి వేడుకలు భవిష్యత్‌కు మార్గదర్శకం కావాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం స్థానిక ఓ ప్రైవేటు హోటల్‌లో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
పొరపాట్లకు తావులేకుండా పనిచేయాలి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం, కలెక్టరేట్, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది నిర్వహిస్తున్న రథసప్తమి వేడుకలు భవిష్యత్‌కు మార్గదర్శకం కావాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం స్థానిక ఓ ప్రైవేటు హోటల్‌లో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ‘గతంలో జరిగిన పొరపాట్లు ఎటువంటి పరిస్థితుల్లోను పునరావృతం కారాదు. ఈ ఏడాది మనం అనుసరించే విధానం భవిష్యత్ ఉత్సవాలకు ఆదర్శవంతమైన ప్రామాణికం కావాలి. ప్రతీ సెక్టార్‌కు కేటాయించిన డీఎస్పీలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తమ సిబ్బందితో కలిసి గ్రూపులుగానే విధుల్లోకి రావాలి. బాధ్యతల మార్పిడి సమయంలో ఎటువంటి గ్యాప్ రాకూడదు. ఉచిత లైన్లలో భక్తులకు టీ, కాఫీ, బిస్కెట్లు అందుబాటులో ఉంచాలి. సర్వీసు లైన్లను అత్యవసర సమయాల్లో మాత్రమే వాడాలి. మొబైల్ టాయిలెట్లు వద్ద నిరంతర శుభ్రత ఏర్పాట్లు చేయాలి. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలి. శనివారం అర్ధరాత్రి నుంచి దర్శనాలు కొనసాగుతాయి. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాల’ని ఆదేశించారు.
భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలి
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘ప్రతీ సెక్టార్‌ను ఏఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. భక్తులతో పోలీసులు ఎంతో మర్యాదగా మెలగాలి. ఎక్కడా తోపులాటలు జరుగకుండా అప్రమత్తంగా ఉండాలి. భక్తుల మనోభావాలు గాయపడకుండా ప్రవర్తించాలి. ఎల్‌ఈడీ స్ర్కీన్ల ద్వారా నిరంతర నిఘా ఉంచాల’ని ఆదేశించారు. సమావేశంలో వైద్యారోగ్య, అగ్నిమాపక, రెవెన్యూ, మునిసిపల్, పంచాయతీ తదితర శాఖల అధికారులు, డీఎస్పీలు పాల్గొన్నారు.