భక్తిశ్రద్ధలతో రాజమ్మ సంబరాలు
ABN , Publish Date - Feb 08 , 2026 | 11:40 PM
వత్సవలసలో ప్రసిద్ధ రాజరాజేశ్వరి (రాజమ్మ) సంబరాలు ఆదివారం భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
గార, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): వత్సవలసలో ప్రసిద్ధ రాజరాజేశ్వరి (రాజమ్మ) సంబరాలు ఆదివారం భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి ఏటా ఇక్కడ మాఘ, ఫాల్గుణ మాసాల్లో శని, ఆదివారాల్లో రాజమ్మ సంబరాలు నిర్వహిం చడం ఆనవాయితీ. శనివారం రాత్రికి కొందరు భక్తులు గ్రామానికి చేరుకొని ఆదివారం ఉదయం సమీపం లో ఉన్న సముద్రానికి వెళ్లి పవిత్ర స్నానాలు ఆచరించి భూలోకమ్మ, రాజమ్మలను దర్శించుకొని ముడుపులు, మొక్కులు, తలనీలాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. మైలపల్లి పేరయ్యదాసుడు పీఠంతో పాటు మరి కొన్ని రాజమ్మ పీఠాల్లో కూడా భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించు కున్నారు. సముద్ర స్నానాల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐలు కె.పైడిపునాయుడు, బి.ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎస్‌ఐలు సీహెచ్ గంగరాజు, మహాలక్ష్మి, హరికృష్ణ సిబ్బందితో హెచ్చరికలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకుని వత్సవల సకు చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని ప్రధాన మార్గాలతో పాటు అరసవల్లి, శ్రీకూర్మం గ్రామాల ప్రధాన రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది.