గాలివాన బీభత్సం
ABN , Publish Date - May 23 , 2026 | 12:14 AM
Rain at srikakulam జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం ఎండల తీవ్రత, వడగాల్పులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం 6 గంటల తర్వాత వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి.
ఉరుములు మెరుపులతో వర్షం
నేలకొరిగిన చెట్లు
విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఉక్కపోతతో ప్రజలకు అవస్థలు
శ్రీకాకుళం/ ఎల్.ఎన్.పేట/ జి.సిగడాం/ మెళియాపుట్టి, మే 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం ఎండల తీవ్రత, వడగాల్పులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం 6 గంటల తర్వాత వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశం మేఘావృతమై.. ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు మోత మోగించాయి. మరోవైపు ఈదురుగాలులు వీశాయి. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఎల్.ఎన్.పేట, జి.సిగడాం తదితర మండలాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. పలుచోట్ల గాలుల బీభత్సానికి విద్యుత్ వైర్లు, చెట్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం నెలకొంది. జిల్లాకేంద్రంలో సుమారు మూడు గంటలపాటు విద్యుత్ లేకపోవడంతో నగరమంతా అంధకారంలో మగ్గిపోయింది. పగలు ఉక్కపోతతో సతమతమైన జనం.. రాత్రి కరెంటు కోతతో కంటిమీద కునుకులేకుండా గడపాల్సి వచ్చింది. విద్యుత్ సిబ్బంది ఆయా ప్రాంతాలకు చేరుకుని పునరుద్ధరణ పనులు చేపట్టారు.
జి.సిగడాం మండలంలో శుక్రవారం రాత్రి రాజాం- చిలకపాలెం ప్రధాన రహదారిపై చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సంతవురిటి- అనంతపురం గ్రామాల మధ్య చెట్లు నేలకొరిగాయి. అధికారులు సంఘటనా స్ధలానికి చేరుకుని యంత్రాల సహాయంతో చెట్లను తొలగించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.
తప్పిన పెనుప్రమాదం
ఈదురుగాలుల బీభత్సానికి మెళియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురం సమీపాన శుక్రవారం సాయంత్రం ఓ చింతచెట్టు నేలకొరిగింది. అదే సమయంలో చాపర నుంచి గారబంద వైపు ప్రయాణికులతో ఓ ఆటో వెళ్తుండగా.. డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. వెనుకభాగంపై చెట్టు పడడంతో పాక్షికంగా దెబ్బతింది. కానీ, ప్రయాణికులు మాత్రం ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఆటోడ్రైవర్ లక్ష్మణరావును స్థానికులు అభినందించారు. చెట్టు నేలకొరగడంతో ట్రాఫిక్ నిలిచిపోగా.. పోలీసులు క్లియర్ చేశారు.