Share News

విద్యావ్యవస్థలో సమూల మార్పులు

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:15 AM

School development through parental participation ‘కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేపట్టింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ చేపట్టిన పలు సంస్కరణతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమయ్యాయ’ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

విద్యావ్యవస్థలో సమూల మార్పులు
విద్యార్థి భానుప్రకాష్‌తో ముచ్చటిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దిన్కర్‌ పుండ్కర్‌

తల్లిదండ్రుల భాగస్వామ్యంతోనే పాఠశాలల అభివృద్ధి

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

టెక్కలి, జూలై 24(ఆంధ్రజ్యోతి): ‘కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేపట్టింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ చేపట్టిన పలు సంస్కరణతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమయ్యాయ’ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం కోటబొమ్మాళి మండలం యలమంచిలిలో నిర్వహించిన మెగా పేరెంట్‌ - టీచర్స్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. తల్లిదండ్రుల భాగస్వామ్యంతోనే పాఠశాలల అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ‘గత వైసీపీ ప్రభుత్వం యాప్‌ల పేరిట ఉపాధ్యాయులను హింసించింది. ప్రస్తుతం అవన్నీ తొలగించి ఒక్క లీప్‌ యాప్‌ మాత్రమే కొనసాగిస్తున్నాం. గతంలో విద్యార్థులకు నాశిరకమైన బ్యాగ్‌లు, యూనిఫారాలు, సరిపడని బూట్లు అందించారు. ఈసారి అటువంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నాం. తల్లికి వందనం పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మందికిపైగా తల్లులు ఖాతాల్లో నిధులు జమ చేశాం. మెగా డీఎస్పీ ద్వారా 16వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఘనత మంత్రి లోకేశ్‌కే దక్కింద’ని మంత్రి అచ్చెన్న తెలిపారు. అనంతరం విద్యార్థులకు షైనింగ్‌ స్టార్స్‌ ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అలాగే విద్యార్థులతో కలిసి మంత్రి అచ్చెన్న, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తదితరులు మధ్యాహ్న భోజనం చేశారు. కోటబొమ్మాళిలో అదనపు వసతిగృహాన్ని మంత్రి అచ్చెన్న ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, డీఈవో రవిబాబు, ఏపీసీ పప్పల వేణుగోపాలరావు, డిప్యూటీ డీఈవో విలియమ్స్‌, ప్రధానోపాధ్యాయులు ఎల్‌.సుధీర్‌, ప్రత్యేకాధికారి గడ్డెమ్మ పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2026 | 12:15 AM