Share News

పిచ్చికుక్క దాడి

ABN , Publish Date - Jun 26 , 2026 | 11:57 PM

Dog attack... 25 people injured టెక్కలి మేజర్‌ పంచాయతీలో శుక్రవారం సాయంత్రం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఎన్టీఆర్‌ కాలనీ, శ్రీనివాసనగర్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌, పాతజాతీయ రహదారి, కొడాలి జంక్షన్‌, తెంబూరు రోడ్డు జంక్షన్‌.. ఇలా పలు ప్రాంతాల్లో 25 మందిపై దాడి చేసింది.

పిచ్చికుక్క దాడి
కుక్కకాటు బాధితులను పరామర్శిస్తున్న ఆర్డీవో క్రిష్ణమూర్తి

  • టెక్కలిలో 25 మందికి గాయాలు

  • బాధితులకు ఆర్డీవో పరామర్శ

  • టెక్కలి/కోటబొమ్మాళి, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): టెక్కలి మేజర్‌ పంచాయతీలో శుక్రవారం సాయంత్రం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఎన్టీఆర్‌ కాలనీ, శ్రీనివాసనగర్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌, పాతజాతీయ రహదారి, కొడాలి జంక్షన్‌, తెంబూరు రోడ్డు జంక్షన్‌.. ఇలా పలు ప్రాంతాల్లో 25 మందిపై దాడి చేసింది. కుక్కకాటు బాధితుల్లో ఐదుగురు చిన్నారులు కాగా, మిగిలిన వారు పెద్దలు, వృద్ధులు ఉన్నారు. 21 మంది కుక్కకాటు బాధితులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మిగిలిన నలుగురు ప్రైవేట్‌ ఆసుపత్రులకు తరలివెళ్లారు. గాయపడినవారిలో పోలవరం మాజీ సర్పంచ్‌ గురవెల్లి చిన్నమనాయుడు, ఎం.జానకమ్మ, డి.జగన్నాయకులు, హెచ్‌.మోహనరావు, నాగయ్య, డి.కార్తీక్‌, ఆర్‌.భవానీ, టి.సుజాత, పి.ఆనందరావు, పి.స్వప్న, కె.ఉపేంద్ర, ఎన్‌.కమలమ్మ, డి.వేణుగోపాల్‌, కె.శ్రీను, బి.గణపతి, కె.వాసుదేవరావు, ఎస్‌.కార్తీక్‌, ఎ.సుజాత, జె.రోజాతో పాటు మూడేళ్ల కె.రేవంత్‌, మోక్షిత్‌, పావని, ఆర్‌.రామసాయిచరణ్‌, డి.పవిత్ర ఉన్నారు. బాధితులకు డాక్టర్‌ మహరాజ్‌, సిబ్బంది వైద్యసేవలు అందజేశారు. ఆస్పత్రిలో బాధితులను ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. పట్టణ టీడీపీ నాయకులు కోళ్ల లవకుమార్‌, దల్లి ప్రసాద్‌రెడ్డి తదితరులు క్షతగాత్రులకు సేవలు అందించారు.

  • పిచ్చికుక్క స్వైరవిహారంతో టెక్కలివాసులు భయాందోళన చెందారు. ఎప్పుడు ఎవరిపై దాడి చేసి కరుస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడిపారు. పంచాయతీ కార్యదర్శి ఏవీ శ్రీనివాస్‌.. సిబ్బందిని అప్రమత్తం చేశారు. తెంబూరు రోడ్డు జంక్షన్‌లో స్వైరవిహారం చేస్తున్న పిచ్చికుక్కను హతమార్చారు. దీంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

  • మెరుగైన వైద్యం అందించాలి: మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం

  • టెక్కలిలో పిచ్చికుక్క దాడిలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. విషయం తెలిసిన వెంటనే కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తితో ఫోన్‌లో మంత్రి అచ్చెన్న మాట్లాడి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అలాగే వీధికుక్కల బెడదపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపల్‌, పంచాయతీ, పశుసంవర్ధకశాఖ అధికారులు సమన్వయంతో కుక్కల నియంత్రణకు, వ్యాక్సినేషన్‌కు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Updated Date - Jun 26 , 2026 | 11:57 PM