Share News

కరువు తీరేలా..రైతన్న మురిసేలా!

ABN , Publish Date - Sep 26 , 2026 | 11:42 PM

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో జూన్‌ నుంచి ఆగస్టు వరకు కనీస స్థాయిలో కూడా వర్షపాతం నమోదు కాలేదు.

కరువు తీరేలా..రైతన్న మురిసేలా!
నాగావళిలో వరద

- కలిసొచ్చిన తీవ్ర వాయుగుండం

- ప్రాజెక్టులు, చెరువులు, నదులకు జలకళ

- పెరిగిన భూగర్భ జలాలు

- వరి, మొక్కజొన్నకు మేలు

- కొత్తగా అపరాల సాగుకు, ఉద్యానవన పంటలకు అనువు

- సిద్ధంగా విత్తనాలు, ఎరువులు

శ్రీకాకుళం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో జూన్‌ నుంచి ఆగస్టు వరకు కనీస స్థాయిలో కూడా వర్షపాతం నమోదు కాలేదు. ఇక తీవ్ర కరువు తప్పదనుకున్న వేళ తుఫాన్‌ రూపంలో వరుణుడు కరుణించాడు. జిల్లాలో మూడు రోజుల పాటు కరువు తీరా వాన పడింది. దీంతో వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయ నదులు ఉప్పొంగి ప్రవహిస్తోన్నాయి. చెరువులు జలకళను సంతరించుకున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. అడుగంటిన భూగర్భ జలాలు సైతం ఒక్కసారిగా పైకి ఉబికాయి. ఈ వర్షాలు వరి, మొక్కజొన్నకు మేలు చేశాయి. కొత్తగా అపరాలు, ఉద్యానవన పంటలను సాగు చేసేందుకు అనువుగా మారాయి. దీంతో కరువు చాయలు తొలగిపోయి భూములు సస్యశ్యామలం కానున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆలస్యమైనా.. అమృతమే!

వాస్తవానికి ఈ వర్షాలు కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ, జిల్లాలో సాగవుతున్న పంటలకు ఇవి అమృతంలా మారాయి. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 1.69లక్షల హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంటలను రైతులు సాగు చేస్తున్నారు. అయితే, మొన్నటి వరకూ వర్షాలు లేకపోవడంతో సుమారు 1,56,600హెక్టార్లలో వరి, మొక్కజొన్న ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఇలాంటి సమయంలో వానలు కురవడంతో పంటలకు ఎనలేని మేలు జరిగింది. అయితే, వరదల కారణంగా 12,400 హెక్టార్లలో పంటలు నీట మునిగినప్పటికీ.. వాటిలో సగం మేర (సుమారు 6,200 హెక్టార్లలో) కోలుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో పొలాల్లో నీరు తగ్గుముఖం పంటలు పూర్తిగా తేరుకుంటాయి.

ఫ తీవ్ర వర్షాభావంతో నిన్నమొన్నటి వరకు వెలవెలబోయిన జిల్లాలోని సాగునీటి వనరుల పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నదులన్నీ ఉప్పొంగడంతో పాటు చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. భూమిలో తేమ శాతం అమాంతం పెరగడంతో బోర్లలో నీటి మట్టాలు ఆశాజనకంగా పెరిగాయి. దీంతో రాబోయే రబీ సీజన్‌కు కూడా సాగునీటి కష్టాలు తీరినట్లేనని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే అనువైన సమయం

ఇప్పటి వరకూ సరైన వర్షాలు లేక ఖాళీగా వదిలేసిన భూముల్లో ఇప్పుడు కొత్తగా పంటలు వేసుకునేందుకు ఇదే అనువైన సమయం. ఇంకా ఖరీఫ్‌ సీజన్‌ పూర్తి కాకపోవడంతో తక్కువ కాల వ్యవధిలో చేతికొచ్చే(స్వల్పకాలిక) పంటల సాగుకు ఈ వర్షం బ్రహ్మాండంగా కలిసిరానుంది. మొక్కజొన్న, జొన్న, రాగులు, కంది వంటివి సాగు చేసేందుకు ఇది అత్యంత అనుకూలమైన వాతావరణం. తక్కువ కాలంలో చేతికొచ్చి, సులభంగా మార్కెటింగ్‌ చేసుకునే అవకాశం ఉన్న మొక్కజొన్నపై దృష్టి పెడితే రైతులు లభాపడతారు. అయితే, ప్రస్తుత వాతావరణం పెసలు, మినుములు సాగుకు మాత్రం అనుకూలం కాదు. మరోవైపు భూగర్భ జలాలు పెరగడం వల్ల జీడి, మామిడి, కొబ్బరి, బొప్పాయి, కాయగూరల సాగును ఆరంభించుకోవడానికి ఇది చక్కటి సమయమని ఉద్యానవన శాఖ వివరిస్తోంది. కొత్తగా పంటలు వేసే రైతుల కోసం రైతు సేవా కేంద్రాల ద్వారా అవసరమైన విత్తనాలు, ఎరువులను వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంచింది. ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతులు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకుని రాయితీపై విత్తనాలు పొందవచ్చని సూచిస్తోంది.

గండం గట్టెక్కింది.. అప్పుల బాధ తప్పుతుంది : రైతులు

‘ఈ ఏడాది కరువు ఖాయం అనుకున్నాం. పెట్టుబడులు ఎలా వస్తాయోనని భయపడ్డాం. కానీ ఈ వర్షాలతో గండం గట్టెక్కింది. ఎండిపోతున్న వరి పైరుకు ప్రాణం లేచి వచ్చింది. ఇప్పటివరకు పంట వేయని పొలాల్లో కూరగాయలు, మొక్కజొన్న వేయాలని నిర్ణయించుకున్నాం. చేతికందినంత తొందరగా పంట వేస్తే అప్పుల బాధ తప్పుతుంది.’

వ్యవసాయానికి మేలే జరిగింది

వర్షాలతో జిల్లా వ్యవసాయానికి మేలే జరిగింది. ముంపునకు గురైన పంటలకు సంబంధించి నష్టం అంచనా వేయడానికి క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్‌ జరుగుతోంది. రైతులు ఆందోళన చెందవద్దు. ఖాళీ భూముల్లో మొక్కజొన్న, ఇతర అపరాల సాగును వెంటనే చేపట్టి భూమిలోని తేమను సద్వినియోగం చేసుకోవాలి.

- వైవీ మురళీకృష్ణ, జేడీఏ, ఆర్‌వీవీ ప్రసాద్‌, ఏడీహెచ్‌

Updated Date - Sep 26 , 2026 | 11:42 PM