ఓఎల్‌ఎక్స్‌లో బైక్‌లు పెట్టి.. మోసాలకు పాల్పడి
ABN , Publish Date - Apr 03 , 2026 | 11:48 PM
ఆన్‌లైన్ ఫ్లాట్‌పాం ఓఎల్‌ఎక్స్‌లో ద్విచక్ర వాహనాలను అమ్మకానికి పెట్టడం.. కొనుగోలుదారులు డబ్బులు చెల్లించిన తరువాత వారిని మోసం చేస్తున్న తిరుపతి జిల్లాకు చెందిన చల్లా శంకర్ అలియాస్ చరణ్‌ను జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
- ఇద్దరి నుంచి రూ.1.35లక్షలు కాజేసిన వైనం
- నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఇతనిపై మరో రెండు జిల్లాల్లో కేసులు
విజయనగరం కైం, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ ఫ్లాట్‌పాం ఓఎల్‌ఎక్స్‌లో ద్విచక్ర వాహనాలను అమ్మకానికి పెట్టడం.. కొనుగోలుదారులు డబ్బులు చెల్లించిన తరువాత వారిని మోసం చేస్తున్న తిరుపతి జిల్లాకు చెందిన చల్లా శంకర్ అలియాస్ చరణ్‌ను జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను ఎస్పీ దామోదర్ వెల్లడించారు. విజయనగరం పరిధిలోని వుడా కాలనీకి చెందిన దాసరి ఉత్తేజ్ అనే యువకుడు ఓఎల్‌ఎక్స్‌లో ఆర్సీ 200 మోడల్ మోటార్ సైకిల్‌ను చూశాడు. దాని ధర రూ.60వేలు ఉంది. ఓ వ్యక్తి చెప్పిన బ్యాంకు ఖాతాలోకి రూ.60 వేలు పంపించాడు. అయితే, ఆ ద్విచక్ర వాహనం మాత్రం రాలేదు. అదే విధంగా పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన జి.సాయిరామ్ అనే వ్యక్తి ఓఎల్‌ఎక్స్‌లో పల్సర్ 150 సీసీ మోటార్ సైకిల్‌ను చూసి ఓ వ్యక్తి ఖాతాకు రూ.75 వేలు పంపించాడు. ఈ వాహనం కూడా అందలేదు. ఇద్దరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై ఒకటో పట్టణ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, ఫోన్ పే, బ్యాంకు అకౌంట్ల పరిశీలన ద్వారా తిరుపతి జిల్లా తొట్టడంబేడు మండలం కండ్రిగ గ్రామానికి చెందిన చల్లా శంకర్ అలియాస్ చరణ్‌ను నిందితుడిగా గుర్తించారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు చరణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. చరణ్ తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హత్య కేసులో, కృష్ణా జిల్లా పెనుములూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.