Share News

శ్రీరాములుగూడలో పూరిళ్లు దగ్ధం

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:41 PM

శ్రీరాములుగూడలో రెండు పూరిళ్లు దగ్ధమై సుమారు రూ.50వేల ఆస్తినష్టం జరిగినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

శ్రీరాములుగూడలో పూరిళ్లు దగ్ధం

కొత్తూరు, పిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): శ్రీరాములుగూడలో రెండు పూరిళ్లు దగ్ధమై సుమారు రూ.50వేల ఆస్తినష్టం జరిగినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగిందన్నారు. వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు పూరిళ్లకు నిప్పు అంటుకుని సవర సూరయ్య, సవర ముఖలింగానికి చెందిన పూర్తిళ్లు కాలిపోయాయన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ధాన్యం బస్తాలు చోరీ

ఎల్‌ఎన్‌ పేట, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): గార్లపాడు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో బుధవారం రాత్రి ఎనిమిది ధాన్యం బస్తాలు చోరీకి గురైనట్టు బాధిత రైతు సురవరపు సింహాచలం గురువారం తెలిపారు. బుధవారం సాయంత్రానికి ఉన్నాయని, గురువారం ఉదయం వెళ్లి చూసేసరికి ఎనిమిది బస్తాల ధాన్యం కనిపించనట్టు గుర్తించానన్నారు. రాత్రి పూట ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని సరుబుజ్జిలి ఎస్‌ఐ బి.హైమావతి తెలిపారు.

13 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

ఆమదాలవలస, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ముద్దాడపేట, దూసిపేట గ్రామా లకు చెందిన 13 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ సనపల బాలరాజు తెలిపారు. గురువారం రెండు గ్రామాల శివారు ప్రాంతాల్లో గడ్డి వాముల చాటున పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సిబ్బంది దాడి చేశారన్నారు. ఈ దాడుల్లో ముద్దాడపేట వద్ద పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.3060, దూసిపేట వద్ద పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.18,210 స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ రెండు దాడుల్లో 13 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాలరాజు చెప్పారు.

Updated Date - Feb 12 , 2026 | 11:41 PM