Share News

28 నుంచి పల్స్‌ పోలియో

ABN , Publish Date - Jun 24 , 2026 | 11:06 PM

జిల్లాలో ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ తెలిపారు.

 28 నుంచి పల్స్‌ పోలియో
మాట్లాడుతున్న జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌

- 1.80 లక్షల మంది చిన్నారులకు చుక్కలు వేయడమే లక్ష్యం

- జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం అధికారులతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జిల్లాలో 1.80 లక్షల మంది చిన్నారులకు పల్స్‌ పోలియో చుక్కలు వేయడమే లక్ష్యమని తెలిపారు. ఆదివారం సెలవు దినం అయినా సరే దేవాలయాలు, చర్చిలు, ఆర్టీసీ కాంప్లెక్స్‌, రైల్వే స్టేషన్లు, తదితర ప్రాంతాల వద్ద 0-5 సంవత్సరాలలోపు పిల్లలను గుర్తించి, వారికి పోలియో చుక్కలు వేయాలన్నారు. ‘స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, మున్సిపల్‌, యూత్‌ కోఆర్డినేటర్‌, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఇతర సంస్థలను కలుపుకొని వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని శతశాతం విజయవంతం చేయాలి. జిల్లాలో 1,80,879 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు గుర్తించాం. మొదటి రోజు నిర్దేశిత బూత్‌లలో వారికి పోలియో చుక్కలు వేస్తారు. ఎవరైనా పిల్లలు మిగిలిపోతే 29, 30 తేదీల్లో వారికి చుక్కలు వేస్తారు. దీనికోసం 1096 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశాం. 84 మొబైల్‌ బృందాలు, 40 రవాణా బూత్‌లను కూడా సిద్ధం చేశాం. వ్యాక్సిన్‌ సామర్థ్యం చెడకుండా 110 డీప్‌ ఫ్రీజర్లు, 110 ఐఎల్‌ఆర్‌లు, 120 కోల్డ్‌ బాక్సులు, 2,100 వ్యాక్సిన్‌ క్యారియర్లు, 1,680 ఐస్‌ ప్యాక్‌లను అందుబాటులో ఉంచాం. జిల్లాలోని 71 పీహెచ్‌సీలు, 13 యూహెచ్‌సీల పరిధిలో 2.90లక్షల డోసుల వ్యాక్సిన్‌ను సిద్ధం చేశాం. ఈ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లతో పాటు మండల కేంద్రాల్లో మైక్‌ల్లో ప్రచారం, డప్పు చాటింపు, ర్యాలీలు నిర్వహించాలి.’ అని అన్నారు. డీఎంహెచ్‌వో కె.అనిత మాట్లాడుతూ.. వలస కార్మికులు, మురికి వాడలు, ఇటుక బట్టీలు, నిర్మాణ స్థలాల ప్రాంతాల్లో ఉన్న 22,734 మంది పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఏడీఎంహెచ్‌వో టి.శ్రీకాంత్‌, డీఐవో రాందాసు, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2026 | 11:06 PM