Share News

గ్రామాల అభివృద్ధికి ప్రజల మద్దతు: మంత్రి అచ్చెన్న

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:25 PM

గ్రామాభివృద్దికి ప్రజలు మద్దతు తెలిపారని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈమేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

 గ్రామాల అభివృద్ధికి ప్రజల మద్దతు: మంత్రి అచ్చెన్న
కూటమి నాయకులు, కార్యకర్తలతో కలసి కేక్‌ కట్‌చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): గ్రామాభివృద్దికి ప్రజలు మద్దతు తెలిపారని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈమేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెక్కలి నియోకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు సత్తాచాటారు. నియోజకవర్గ పరిధిలోని 136 గ్రామ పంచాయతీలకు గాను 35 చోట్ల టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికై గ్రామాల్లో తమ ఆధిపత్యాన్ని చాటారు. మంత్రి అచ్చెన్నాయుడు నాయకత్వం, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి... సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి ఈ విజయాలు నిదర్శనంగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక నిధులు అభివృద్ధికి అదనపు బలాన్ని ఇవ్వనున్నాయని అన్నారు. ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేసేందుకు అవకాశం కలగనుందన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలచెట్టుకుంటూ... గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఏకగ్రీవ సర్పంచులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులకు ఆయన అభినందనలు తెలిపారు.

పంచాయతీలపై ప్రత్యేక ముద్ర

టెక్కలి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పట్టు నిరూపించుకున్నారు. టెక్కలి నియోజకవర్గంలో 137 గ్రామ పంచాయతీలకు గాను 35 చోట్ల తెలుగుదేశం మద్దతుదారులు సర్పంచ్‌లుగా ఏకగ్రీవం గా ఎన్నిక కావడంలో మంత్రి మార్కు కనిపించింది. ఇప్పటికే ప్రాదేశిక ఎన్నికల్లో నియోజకవర్గంలో 78 ఎంపీటీసీలకు 73 చోట్ల టీడీపీ శ్రేణులు విజయం సాధించి.. రికార్డు సృష్టించారు. అదే స్థాయిలో పంచాయతీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం మద్దతుదారులు దూసుకెళ్లారు. నందిగాం, కోటబొమ్మాళి మండలాల్లో చెరో 11 పంచాయతీలు ఏకగ్రీవం కాగా... టెక్కలి మండలంలో ఆరు, సంతబొమ్మాళి మండలంలో ఏడు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

- టెక్కలి మండలంలో అక్కవరం, నర్సింగపల్లి, గూడేం, రావివలస, భగవాన్‌పురం, సీతాపురం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

- సంతబొమ్మాళి మండలంలో ఆకాశలక్కవరం, హెచ్‌ఎన్‌పేట, సంతబొమ్మాళి, కాకరాపల్లి, ఎస్‌బీకొత్తూరు, లక్కివలస, మర్రిపాడు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

-నందిగాం మండలంలో రాంపురం, పెద్దతామరాపల్లి, కాపుతెంబూరు, సుభద్రాపురం, రథజనబొడ్డపాడు, మొండ్రాయివలస, కల్లాడ, మర్లపాడు, పెద్దలవునిపల్లి, దేవళభద్ర, బెజ్జిపల్లి పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

- కోటబొమ్మాళి మండలంలో నిమ్మాడ, పెద్దబమ్మిడి, చిన్నబమ్మిడి, చిట్టేవలస, వాండ్రాడ, చీపుర్లపాడు, కోటబొమ్మాళి, ఎత్తురాళ్లపాడు, తాటిపర్తి, హరిశ్చంద్రాపురం, రేగులపాడు పంచాయతీలుఉ ఏకగ్రీవమయ్యాయి. ఇవన్నీ మంత్రి అచ్చెన్నాయుడి ప్రణాళికలు, వ్యూహంతోనే కూటమి ఖాతాలో చేరడం గమనార్హం.

Updated Date - Nov 28 , 2026 | 11:25 PM