ప్రజల సంతృప్తే సమర్థ పాలనకు సూచిక
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:25 AM
: ప్రజల సంతృప్తే సమర్థవంతమైన పాలనకు సూచిక అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
- స్వయం సహాయక సంఘా పనితీరులో రాష్ట్రంలో ప్రథమ స్థానం
- ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలి
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ప్రజల సంతృప్తే సమర్థవంతమైన పాలనకు సూచిక అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఆయన జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో, వివిధ సంక్షేమ పథకాల అమలులో జిల్లా యంత్రాంగం ప్రజా సానుకూల దృక్పథం ప్రాతిపదికగా పనిచేయాలని ఆదేశించారు. ప్రతీ అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని కలెక్టర్ వెల్లడించారు. పట్టణ స్వయం సహాయక సంఘాల పనితీరులో జిల్లా 81.5శాతంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. సేవారంగానికి సంబంధించి 96శాతం మార్కులతో ఏప్లస్ గ్రేడ్ సాధించినట్లు తెలిపారు. రెవెన్యూ సేవల విభాగంలో రాష్ట్రంలో 3వ స్థానం, సమగ్ర కేపీఐలో 78/100 స్కోరుతో గ్రేడ్-ఏ కేటగిరీ దక్కించుకున్నట్లు చెప్పారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో 96.4శాతంతో జిల్లా యంత్రాంగం వేగవంతమైన పురోగతి కనబరిచిందన్నారు. ఆరోగ్య భద్రత, పారిశుధ్యం నిర్వహణపై సమీక్షిస్తూ 5,261 నీటి నమూనాలను పరీక్షించగా, నూరుశాతం సురక్షితమైనవిగా తేలాయన్నారు. ఈ వారంలో జీరో మలేరియా కేసులు నమోదవడం ప్రశంసనీయమని అన్నారు. ఉపాధి, వ్యవసాయ విభాగాలకు సంబంధించి ఈ-పంట నమోదును నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. దీపం-2 పథకం కింద ఎల్పీజీ సిలిండర్ల పంపిణీని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పలాస కిడ్నీ ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి సేవలను మరింత వేగవంతం చేయాలని, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల ద్వారా ప్రజలకు అందే సేవలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. రహదారులపై గుంతల పూడ్చివేత పనులను పూర్తి చేయాలని, హౌసింగ్ 1.0 ఇళ్ల నిర్మాణ ప్రక్రియను త్వరగా కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.