కదిలొచ్చారు
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:53 PM
'Aksharam Andaga...Solution as the Agenda' ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆదివారం ఉదయం నరసన్నపేటలో పల్లిపేట జంక్షన్ వద్ద ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
నరసన్నపేటలో సమస్యలపై ప్రజాగళం
‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి విశేష స్పందన
ప్రాధాన్యతా క్రమంలో సమస్యలు పరిష్కరిస్తాం
ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హామీ
నరసన్నపేట, మార్చి 15(ఆంధ్రజ్యోతి):
ఇందిరానగర్, హడ్కోకాలనీ వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి.. తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. ‘పారిశుధ్య కార్మికులు విధుల్లోకి రాకపోవడంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతోంది. రోడ్లు ఛిద్రమయ్యాయి. మందుబాబులు, గంజాయి బ్యాచ్ ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. శ్మశానవాటికకు రోడ్డు మార్గం చూపాలి. ఎర్రన్నాయుడు చిల్డ్రన్ పార్క్‌ను వినియోగంలోకి తీసుకురావాలి. సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తిచేయాలి. ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించాల’ని.. వారు కోరారు. వీటితోపాటు చెరువుల ఆక్రమణకు అడ్డుకట్ట వేయాలని, చెరువుల్లో వ్యర్థాలు తొలగించాలని.. ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. వీటిపై ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సానుకూలంగా స్పందిస్తూ.. ప్రాధాన్యత క్రమంలో సమస్యలను శతశాతం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఇందిరానగర్, హడ్కోకాలనీతోపాటు పట్టణంలో పలు సమస్యలను గుర్తించి.. వాటి పరిష్కారానికి ఈ కార్యక్రమం చక్కని వేదిక అయిందని పేర్కొన్నారు. పట్టణంలో ప్రధానంగా పారిశుధ్య సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ప్రజల్లో కూడా చైతన్యం రావాలని తెలిపారు. తడి, పొడి చెత్తను వేరుచేసి.. పారిశుధ్య నిర్వహణకు సహకరించాలని సూచించారు. సమస్యలపై ఏమన్నారంటే ...
ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పందిస్తూ.. వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ‘వంశధార నగర్ కాలనీలో శిథిలమైన పాఠశాల భవనాన్ని.. వచ్చే విద్యా సంవత్సరం నాటికి కొత్తగా నిర్మిస్తాం. అండర్ డ్రైనేజ్ వ్యవస్థ పనులు 70 శాతం పూర్తయ్యాయి. గత ప్రభుత్వం దీనిని పట్టించుకోకపోవడంతో వ్యర్థాలు బయటకు వస్తున్నాయి. ఈ సమస్యను పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం.
ఇంటింటా తాగునీరు అందించేందుకు కృషి చేస్తాం. దేశవానిపేటలో రక్షితనీటి పథకం పనులు చేపడుతున్నాం. వచ్చే మే నాటికి హడ్కోకాలనీ ఇంటింటా కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. ఇందిరానగర్‌లో బోరుబావులు నిర్మిస్తాం. నీటి ఇబ్బందులు లేకుండా ట్యాంకర్ల ద్వారా కూడా సరఫరా చేస్తాం.
రాజుల చెరువు అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేశాం. గత ప్రభుత్వం దీనిని విస్మరించింది. ప్రస్తుతం చెరువు ముందు భాగంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి.. చెరువును సుందరంగా తీర్చిదిద్దేందుకు డీపీఆర్ సిద్ధం చేశాం. కలెక్టర్ నిర్ణయం మేరకు అంచనాలు సిద్ధం చేసి.. ప్రభుత్వానికి పంపించామని ఎమ్మెల్యే రమణమూర్తి తెలిపారు.
ఎర్రన్నాయుడు చిల్డ్రన్ పార్కు విషయంలో అధికారులు స్పందన లేకపోవడం చాలాసిగ్గుచేటుగా ఉందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ‘గత ప్రభుత్వ హయాంలో ఈ పార్కును కొందరు ధ్వంసం చేసి.. దాని రికార్డులు తారుమారు చేసి కోర్డుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. కోర్టులో రికార్డులను సైతం మాయం చేశారు. దీనిపై అధికారులకు చలనం లేకుండా పోయిందా?. ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి జిల్లా న్యాయస్థానానికి లేఖ కూడా పంపించాం. ధ్వంసం చేసినవారిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. చిల్డ్రన్ పార్కు ఏర్పాటుకు నిధులు మంజూరు చేసి సమస్యకు పరిష్కారానికి కృషి చేస్తా’నని ఎమ్మెల్యే రమణమూర్తి తెలిపారు.
పరిష్కారానికి వేదిక: బగ్గు అర్చన
నరసన్నపేట నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన మాట్లాడుతూ.. ‘సమస్యలను పరిష్కరించేందుకు ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారులు ముంందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. పారిశుధ్యం నిర్వహణపై పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల’ని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్.సత్యనారాయణ, ఎంపీడీవో వెంకటేష్ ప్రసాద్, పంచాయతీ ఈవో పల్లి దాక్షాయణి, పంచాయతీరాజ్ ఏఈ బగ్గు నర్సింగరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ఖగేశ్వరరావు, కాళింగ, పొందరి కురాకుల కార్పొరేషన్ల చైర్మన్లు రోణంకి కృష్ణంనాయుడు, దామోదరం నర్సింహులు, టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలగ ప్రహర్ష, మండల తెలుగు యువత అధ్యక్షుడు రావాడ గణపతిరావు, వార్డు సభ్యులు బతకల సంతోషి, వార్డు మాజీ సభ్యులు బలగ భారతి, ఉద్యోగులు, వ్యాపారులతోపాటు ఆంధ్రజ్యోతి శ్రీకాకుళం బ్రాంచి మేనేజర్ సోమశంకరరావు, ఎడిషన్ ఇన్‌చార్జి పి.బయపరెడ్డి, డీసీఎం అనంతకుమార్, స్టాఫర్ టి.సురేష్‌బాబు, ఏబీఎన్ స్టాఫర్ రమేష్ పాల్గొన్నారు.
అక్షరం కదిలించింది.. వీధుల్లో వెలుగు నింపింది
నరసన్నపేటలోని కుమ్మరివీధిలో రాత్రివేళ విద్యుత్ దీపాలు వెలగడం లేదు. ఈ సమస్యను ఆదివారం ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో స్థానికులు ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఈవో పల్లి దాక్షాయణి స్పందించి.. కుమ్మరివీధిలో విద్యుత్ దీపాలు వెలిగించేలా చర్యలు చేపట్టారు. పట్టణంలోని ఏ ప్రాంతంలోనైనా వీధి దీపాలు వెలగకపోతే.. వెంటనే సమస్య పరిష్కరిస్తామని ఈవో తెలిపారు. ప్రధాన రహదారిలో కూడా విద్యుత్ దీపాలు వెలిగేలా చర్యలు చేపడతామన్నారు.