కొత్తగా 107 పోలింగ్ కేంద్రాలు
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:50 PM
Polling stations Proposals జిల్లాలో కొత్తగా 107 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై సమీక్ష నిర్వహించారు.
ఏర్పాటుకు ప్రతిపాదనలు
సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితా
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 107 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ‘శ్రీకాకుళం నియోజకవర్గంలో 45, ఆమదాలవలసలో 11, ఎచ్చెర్లలో 9, టెక్కలిలో 4, పలాసలో 18, ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 20 పోలింగ్ కేంద్రాలు అదనంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. దీనికి ఎన్నికల సంఘం ఆమోదం లభిస్తే.. జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 2,464కు చేరుకుంటుంది. నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల్లో ఎటువంటి మార్పులు లేవు. పలాస నియోజకవర్గంలో 7 పోలింగ్ స్టేషన్ల పేర్ల మార్పులతోపాటు ఇచ్ఛాపురంలో ఒకటి, పలాసలో ఒకటి, టెక్కలిలో రెండు, ఆముదాలవలసలో రెండు చొప్పున మొత్తం 6 చోట్ల లొకేషన్ల మార్పులు ప్రతిపాదించామ’ని తెలిపారు.
‘జూలై 14 వరకు ఓటర్ల సవరణ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. జూలై 21న ఎలక్టోరల్ డ్రాఫ్ట్ పబ్లికేషన్, ఆగస్టు 20 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. సెప్టెంబరు 22న తుది జాబితాను ప్రకటిస్తాం. సర్ ప్రక్రియ వివిధ రాజకీయ పార్టీల సహకారంతో సజావుగా జరుగుతోంది. బీఎల్‌వోలు ప్రతీ రోజు బీఎల్‌ఏలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలి. ఓటర్లు, ఇళ్లను గుర్తించి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో మరింత చొరవ చూపాలి. ఎన్యూమరేషన్ ప్రతుల పంపిణీ శాతాన్ని పెంచేందుకు రానున్న శని, ఆదివారాల్లో పోలింగ్ బూత్‌స్థాయిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. పార్టీల ప్రతినిధులు ఓటర్ల గుర్తింపు ప్రతులతో కూడిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టకూడద’ని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఈఆర్‌లు బి.పద్మావతి, అప్పలరాజు, ఎం.కృష్ణమూర్తి, ఆర్.వెంకటరామన్, కె.సాయిప్రత్యూష, ఎం.లావణ్య, జి.జయదేవి, కె.వినాయకం, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పీఎంజే బాబు, అర్చన, దాసు, మన్మధరావు, ఐటీ కుమార్, గోవిందరావు, కెఎల్‌ఎస్.ఈశ్వరి, పి.సురేష్‌సింగ్ పాల్గొన్నారు.