Share News

ప్రైవేటు ట్రావెల్స్‌ దోపిడీ

ABN , Publish Date - Jan 11 , 2026 | 12:06 AM

Praivate Bus ticket prices double during జిల్లా ప్రజలు చాలామంది హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఉపాధి నిమిత్తం వలస వెళ్లారు. పండుగల సమయాల్లో స్వగ్రామాలకు వస్తుంటారు. ప్రధానంగా సంక్రాంతికి ఎక్కడ ఉన్నా స్వగ్రామాలకు రావడం ఆనవాయితీ. అయితే పండుగ రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు, ట్రైన్లలో ప్రయాణించాలంటే కష్టమే. ఈ నేపథ్యంలో చాలామంది ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు బస్సుల నిర్వాహకులు దందాకు దిగుతున్నారు.

ప్రైవేటు ట్రావెల్స్‌ దోపిడీ

పండుగ వేళ బస్సు టిక్కెట్ల ధర రెట్టింపు

సామాన్య ప్రజలకు తప్పని రవాణా భారం

రణస్థలం, జనవరి 10(ఆంధ్రజ్యోతి):

నేను, నా భార్య, ఇద్దరు పిల్లలు హైదరాబాద్‌ నుంచి రణస్థలం వచ్చేందుకు రూ.10వేలు ఖర్చయింది. అక్కడ భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నాం. సంక్రాంతి పండుగ నిమిత్తం స్వగ్రామానికి వచ్చాం. కానీ, ప్రైవేటు బస్సుల నిర్వాహకులు టిక్కెట్ల ధరలు సాధారణ రోజుల కన్నా భారీగా పెంచేయడంతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం.

- రణస్థలానికి చెందిన శంకర్‌ ఆవేదన ఇది.

............................

మేము ఉపాధి నిమిత్తం మచిలీపట్నం వెళ్లిపోయాం. సంక్రాంతికి స్వగ్రామానికి వచ్చేందుకు ప్రైవేటు బస్సు ఎక్కాం. మా నలుగురి కుటుంబ సభ్యులకు టిక్కెట్‌ చార్జీలు రూ.6వేలు తీసుకున్నారు. సాధారణ రోజుల్లో రూ.800 ఉండగా, పండుగ పేరిట రెట్టింపు చార్జీలు వసూలు చేయడం అన్యాయం.

- రణస్థలానికి చెందిన జగరోతు రామారావు ఆవేదన ఇది

............

జిల్లాలో వేలాదిమంది వలస జీవులది ఇదే పరిస్థితి. జిల్లా ప్రజలు చాలామంది హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఉపాధి నిమిత్తం వలస వెళ్లారు. అక్కడ పరిశ్రమల్లో, భవన నిర్మాణంతోపాటు వివిధ రంగాల్లో కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. పండుగల సమయాల్లో స్వగ్రామాలకు వస్తుంటారు. ప్రధానంగా సంక్రాంతికి ఎక్కడ ఉన్నా స్వగ్రామాలకు రావడం ఆనవాయితీ. అయితే పండుగ రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు, ట్రైన్లలో ప్రయాణించాలంటే కష్టమే. సుదూర ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు కూడా అంతగా లేవు. ఈ నేపథ్యంలో చాలామంది ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు బస్సుల నిర్వాహకులు దందాకు దిగుతున్నారు. టిక్కెట్‌పై సాధారణ రోజుల్లో కన్నా రెట్టింపు వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా నుంచి ట్రావెల్‌ బస్సులు ఎక్కువగా హైదరాబాద్‌, విజయవాడ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌, బలగ, ఆర్ట్స్‌ కాలేజీ రోడ్డు, పాలకొండ రోడ్డులో పదుల సంఖ్యలో ప్రైవేటు బస్సులు కనిపిస్తుంటాయి. ఆయా బస్సుల నిర్వాహకులు టిక్కెట్ల రూపంలో అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌కు స్లీపర్‌ టిక్కెట్‌ ధర రూ.900 నుంచి రూ.1800 వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు రూ.4వేలకు పలుకుతోంది. సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్న అన్ని ప్రైవేటు బస్సుల్లోనూ చార్జీలు పెంచేయడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

ఆర్టీసీ సర్వీసులు ఉన్నా..

జిల్లా నుంచి ఆర్టీసీ సర్వీసులను పెద్ద ఎత్తున నడుతున్నారు. పలాస, టెక్కలి డిపోలతోపాటు శ్రీకాకుళం రెండు డిపోల నుంచి సంక్రాంతికి ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశారు. ఒక్క శ్రీకాకుళం నుంచే విజయవాడకు 8, రాజమండ్రికి 5, అమలాపురానికి 15 సర్వీసులు అదనంగా నడుపుతున్నారు. విశాఖ, ఇచ్ఛాపురం వెళ్లేందుకు ప్రతి 10 నిమిషాలకు ఒక సర్వీసును నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. పైగా ఈసారి ముందస్తుగా బుక్‌ చేసుకున్నవారికి టిక్కెట్‌పై 10 శాతం రాయితీ ఇస్తున్నారు. అయితే ఆర్టీసీ సుదూర ప్రాంతాలకు సర్వీసులు లేకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. అందుకే ఎక్కువమంది ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు.

ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

ఈ నెల 11,12,13 తేదీల్లో హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళం నగరానికి ఏసీ స్లీపర్‌ క్లాస్‌ బస్సులను నడుపుతున్నాం. ఆర్టీసీలో సాధారణ చార్జీలే వసూలు చేస్తున్నాం. ముందస్తుగా బుక్‌ చేసుకునేవారి 10శాతం రాయితీ కూడా అందిస్తున్నాం. ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని పండుగ తిరిగి ప్రయాణాల సమయంలోనూ అదనపు సర్వీసులను తిప్పుతాం. గ్రామీణ సర్వీసులను సైతం పెంచుతాం.

- సీహెచ్‌ అప్పలనారాయణ, డీపీటీవో, శ్రీకాకుళం

Updated Date - Jan 11 , 2026 | 12:06 AM