సామాన్య భక్తులకే ప్రాధాన్యత
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:21 AM
అరసవల్లి సూర్యనారాయణ స్వామి జయంతి (రథసప్తమి) ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని, దర్శనాలకు సంబంధించి సామాన్య భక్తులకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ పేర్కొన్నారు.
-రథసప్తమి ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు
- నేటి నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు
-రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్
అరసవల్లి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణ స్వామి జయంతి (రథసప్తమి) ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని, దర్శనాలకు సంబంధించి సామాన్య భక్తులకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ పేర్కొన్నారు. సోమవారం నుంచి ఈ నెల 25వరకు నిర్వహించనున్న రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్, పండుగల ప్రత్యేక అధికారి శోభారాణి, డీఎస్పీ సీహెచ్.వివేకానందతో కలిసి ఆయన ఆదివారం పరిశీలించారు. క్యూలైన్లు, పార్కింగ్, శానిటేషన్, భక్తులకు తాగునీరు, ప్రసాదాల కౌంటర్లు, దివ్యాంగులు, వృద్ధుల దర్శనాలకు ఏర్పాట్లు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గర్భగుడి ఎదుట నాలుగు వరుసల్లో క్యూలైన్లు ఏర్పాటు చేయడం ద్వారా భక్తులు వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తున్నామని తెలిపారు. ‘30వేల వాటర్ బాటిళ్లు సిద్ధం చేస్తున్నాం. సోమవారం నుంచి రూ.300, రూ.100 టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నాం. క్షీరాభిషేకం టిక్కెట్లను రోజుకు 400 చొప్పున ఈ నెల 23 వరకు ఆన్‌లైన్‌లో పెడుతున్నాం. 24న రెండు వేల టిక్కెట్లను జారీ చేస్తున్నాం. ఇంటివద్ద నుంచే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీటెంపుల్స్.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో టిక్కెట్లను బుక్ చేసుకుని శీఘ్రదర్శనం చేసుకోండి. రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి 100 మంది సిబ్బంది, 500 మంది వలంటీర్లను నియమించాం. క్యూలైన్లలో భక్తులకు ఎండ తగలకుండా షేడ్ నెట్లు, చల్లని మజ్జిగ, మంచినీరు పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అధికారులతో నిరంతరం పర్యవేక్షించాలి’. అని ఆదేశించారు. కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం సూపరింటెండెంట్ కంచమూర్తి, అరసవల్లి ఆలయ సూపరింటెండెంట్ వెంకటరమణ, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.