Share News

సన్నబియ్యానికి రెక్కలు

ABN , Publish Date - Jul 28 , 2026 | 11:46 PM

Rice Increase of Rs. 700 per quintal మార్కెట్‌లో బియ్యం ధరకు రెక్కలొచ్చాయి. నాణ్యమైన బియ్యం కిలో రూ.60 నుంచి రూ.65 పలుకుతున్నాయి. సన్నబియ్యం ధర క్వింటాల్‌ రూ.6వేలు ఉండగా.. కేవలం మూడు నెలల్లోనే రూ.700 వరకు పెరిగింది. మిగిలిన రకాల బియ్యం ధరలు కూడా అదేస్థాయిలో పెరిగాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సన్నబియ్యానికి రెక్కలు

  • పెరిగిన ధరలు

  • క్వింటాల్‌పై రూ.700 పెంపు

  • సామాన్య, మధ్య తరగతి ప్రజలపై అదనపు భారం

  • కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు

  • నరసన్నపేట, జూలై 28(ఆంధ్రజ్యోతి): మార్కెట్‌లో బియ్యం ధరకు రెక్కలొచ్చాయి. నాణ్యమైన బియ్యం కిలో రూ.60 నుంచి రూ.65 పలుకుతున్నాయి. సన్నబియ్యం ధర క్వింటాల్‌ రూ.6వేలు ఉండగా.. కేవలం మూడు నెలల్లోనే రూ.700 వరకు పెరిగింది. మిగిలిన రకాల బియ్యం ధరలు కూడా అదేస్థాయిలో పెరిగాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి.. బియ్యం ధరలు పెంచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమపై అదనపు భారం తప్పడం లేదని వాపోతున్నారు. ఒకవైపు జిల్లాలో బియ్యం, ధాన్యం నిల్వలు తరిగిపోతున్నాయి. మరోవైపు మిల్లర్లు, కొంతమంది అధికారులు మిలాఖత్‌ అయి ధాన్యాన్ని, బియ్యాన్ని జిల్లా సరిహద్దులు దాటించేస్తున్నారు. జిల్లాలో నెలకు 60వేల టన్నుల బియ్యం అవసరం ఉండగా, ప్రస్తుతం అందులో 25శాతం కూడా మిల్లింగ్‌ జరగడం లేదు. ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో బియ్యం ధరలు పెరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

  • కొరతకు కారణాలెన్నో

  • మిల్లర్లు కస్టమ్‌ మిల్లింగ్‌ విధానంలో క్వింటాల్‌కు 65 శాతం మేరకు బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాలి. మరోవైపు లెవీ కూడా ప్రభుత్వ నిర్ధేశకాలు మేరకు ఇవ్వాలి. కాగా ఇవేవీ సకాలంలో ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి. రైతులు ఈ ఏడాది సన్నాలు సాగు తగ్గించడంతో ఆ బియ్యానికి డిమాండ్‌ పెరిగింది.

  • జిల్లాలో పండిన సన్నాలను వ్యాపారులు తెలంగాణకు తరలిస్తున్నారు. అక్కడ సన్నాలకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ ఇవ్వడంతో జిల్లా నుంచి కొందరు దళారులు ఖమ్మం జిల్లాకు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు.

  • ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సన్నాలు పంట దిగుబడి తగ్గుతుందని ప్రచారం నేపఽథ్యంలో బియ్యం ధరలను పెరుగుదలకు మరో కారణం.

  • గతేడాది సన్నాలను మిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేశారు. సకాలంలో రైతులకు డబ్బులు చెల్లించలేదు. దీంతో ఈ ఏడాది రైతులు ముదుగు రకాలు సాగు చేసి నేరుగా ప్రభుత్వానికి విక్రయించారు.

  • రబీ సీజన్‌లో రైతులు పండించిన సన్నాలను దళారులు భారీస్థాయిలో కొనుగోలు చేసి.. నిల్వ ఉంచి.. ప్రస్తుతం కృతిమ కొరత సృష్టిస్తున్నారు.

  • ప్రభుత్వం రేషన్‌ డిపోల ద్వారా పంపిణీ చేస్తున్న దొడ్డబియ్యం 95శాతం వరకు రీసైక్లింగ్‌ చేసినవే. దీంతో వాటిని తినలేక చాలామంది వ్యాపారులకు విక్రయిస్తున్నారు. సన్నబియ్యం కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సన్నబియ్యం ధరలు మరింత పెరుగుతున్నాయి.

  • ఇటీవల నరసన్నపేట మండలంలో ఒక రైస్‌మిల్లులో సుమారు రూ.9లక్షలు విలువ చేసే రేషన్‌ బియ్యం విజిలెన్స్‌ దాడుల్లో బయటపడ్డాయి. ఇక నరసన్నపేట, శ్రీకాకుళం, మడపాం, బొరిగివలస తదితర ప్రాంతాల్లో నిత్యం రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి తిరిగి సీఎంఆర్‌ విధానంలో ప్రభుత్వానికి పంపిస్తున్నారు.

  • రీసైక్లింగ్‌ కారణం

  • పీడీఎస్‌ బియ్యాన్ని చిన్నచిన్న వ్యాపారుల ద్వారా కొనుగోలు చేస్తున్న మిల్లరు వాటిని రీస్లైకింగ్‌ చేస్తున్నారు. కార్డుదారుల నుంచి చిన్నచిన్న వ్యాపారులు రూ.18 నుంచి రూ.20 వరకు కొనుగోలు చేస్తారు. వీటిని మిల్లర్లుకు రూ.25 వరకు విక్రయిస్తున్నారు. ఈ బియ్యాన్ని మిల్లర్లు రీసైక్లింగ్‌ చేసి నూనెతో పాటుతెల్లగా కనిపించేలా రసాయనాలు వేసి మరపట్టి సీఎంఆర్‌ విధానం ద్వారా పౌరసరఫరా శాఖకు అందజేస్తారు. సీఎంఆర్‌ విధానంలో ప్రభుత్వం అందజేసిన ధాన్యాన్ని ఇతర జిల్లాలకు విక్రయిస్తున్నారు. దీంతో సన్నరకాల బియ్యానికి జిల్లాలో వీపరీతమైన ధర పెరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

  • ఇలా చేస్తే కొంత మేలు

  • ఽధాన్యం, బియ్యం ఎగుమతులను పూర్తిగా నిషేధించాలి. నిఘా వ్యవస్థను పట్టిష్టం చేయాలి. బియ్యంపై పన్నును తగ్గించాలి. అనర్హుల రేషన్‌కార్డులను రద్దు చేయాలి. రేషన్‌ బియ్యాన్ని మార్కెట్‌లో విక్రయించేవారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి. 6ఏ కేసులతో వదిలేయకుండా.. మిల్లులను సీజ్‌ చేయాలి.

  • ధరలపై నియంత్రణ ఉండాలి

  • బియ్యం ధరలపై పూర్తి నియంత్రణ ఉండాలి. రైతులు సన్నరకాలు విక్రయించే సమయంలో తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. రైతులు వద్ద ధాన్యం లేని సమయంలో బియ్యం ధరలు పెంచేస్తున్నారు. జిల్లాలో ధాన్యాన్ని ఇతర జిల్లాలకు ఎగుమతి నిలిపివేయాలి.

    - గొండు సత్యనారాయణ, వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు, నరసన్నపేట

Updated Date - Jul 28 , 2026 | 11:46 PM