Share News

ధరలు పేలుతున్నాయ్‌!

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:43 PM

ఈ ఏడాది బాణసంచా ధరలు సామా న్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.

ధరలు పేలుతున్నాయ్‌!
రణస్థలం పెట్రోల్‌ బంకు సమీపంలో ఏర్పాటు చేసిన బాణసంచా షాపులు

- ఆకాశన్నంటుతున్న బాణసంచా రేట్లు

- కొనుగోలుకు జంకుతున్న ప్రజలు

- ఇష్టారాజ్యంగా దుకాణాల ఏర్పాటు

- భద్రత లేదు.. పర్యవేక్షణ ఉండదు

శ్రీకాకుళం క్రైం/రణస్థలం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది బాణసంచా ధరలు సామా న్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. శాశ్వత, తాత్కాలిక లైసెన్స్‌లు కలిగిన దుకాణాల్లో టపాసుల ధరలు ఆకాశన్నంటుతుండడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. ఏడాదికి ఒక్కసారి వచ్చే పండుగ కావడం, పిల్లలు అడుగుతుండడంతో ధరలు అధికంగా ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతు న్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అనుమతులకు అదనపు వసూళ్లు..

తాత్కాలిక దుకాణాల ఏర్పాటు కోసం వ్యాపారులు పోలీస్‌, జీఎస్టీ, ఫైర్‌, రెవెన్యూ శాఖలకు ఎల్‌ఈ5 దరఖాస్తు చేసుకుంటున్నారు. అగ్నిమాపక శాఖ కార్యాలయంతో పనిలేకుండా వాట్సాప్‌లోనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. దుకాణదారుడి పేరు, దుకాణం ఏర్పాటు చేసే ప్రదేశం చిరునామా, ఫోన్‌ నెంబర్‌, సమీపంలోని అగ్నిమాపక కేంద్రం వివరాలను 9441236448 నెంబర్‌కు వాట్సాప్‌ చేయాలి. అనంతరం రూ.500 చలానా చెల్లిస్తే దరఖాస్తు అందిస్తారు. దానిని దరఖాస్తుదారుడు నేరుగా ఆర్డీవో కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది. ఇదే దరఖాస్తు జీఎస్టీ, పోలీస్‌ అధికారుల వద్దకు అనుమతుల కోసం వెళుతుంది. కానీ అగ్నిమాపక శాఖకు మాత్రం ఎటువంటి ప్రత్యక్ష ప్రమేయం లేకుండా రాష్ట్ర విపత్తుల స్పందన సంస్థ ఉత్తర్వులు జారీచేయడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా దీపావళి సమయంలో జిల్లా వ్యాప్తంగా 80 నుంచి 100 దుకాణాల వరకూ అనుమతులిచ్చేవారు. ఒక్క శ్రీకాకుళం ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో 35 నుంచి 40 దుకాణాలను ఏర్పాటు చేసేవారు. కానీ అనుమతులు సులభతరం చేయడంతో షాపుల ఏర్పాటుకు విపరీతమైన దరఖాస్తులు వస్తున్నాయి. అనుమతులు ఇచ్చేందుకు కొందరు అధికారులు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 60కి పైగా తాత్కాలిక దుకాణాలకు అనుమతులు కల్పించినట్టు సమాచారం.

అక్రమ విక్రయాలపై నిఘా ఏది?

లైసెన్స్‌ పొందిన దుకాణాలకే కాకుండా పట్టణాలు, మండలాలకు సైతం బాణసంచా సామగ్రి చేరుతున్నట్టు సమాచారం. కొందరు వ్యాపారులు శివకాశి నుంచి ఆర్డర్లపై బాణసంచా తెప్పించి పరిచయస్తులకు గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు లేని ప్రాంతాల్లో విక్రయాలు సాగితే అగ్ని ప్రమాదాలు సంబంధించే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల శివకాశి వంటి బ్రాండ్‌ పేరు చెప్పి ధరలను అమాంతం పెంచేసినట్టు తెలుస్తోంది. కాకర పువ్వొత్తుల నుంచి లక్ష్మీబాంబు ధరల వరకూ అమాంతం పెరిగాయి. కనీస నిబంధనలు పాటించకుండా జనవాసాల మధ్య తాత్కాలిక షాపులను ఏర్పాటు చేస్తున్నారు. నీటితో నిండిన డ్రమ్ములు, ఇసుక బకెట్లు, మంటలను అదుపు చేసే అగ్నిమాపక సిలిండర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ, కొందరు వ్యాపారులు ఈ నిబంధనలను పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా యంత్రాంగం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.

పెంట్రోల్‌ బంకు, జనవాసల మధ్య షాపులు..

రణస్థలం మండల కేంద్రంలో పెంట్రోల్‌ బంకు సమీపంలో రెండు బాణసంచాషాపులను ఏర్పాటు చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ షాపులకు కూతవేట దూరంలో అనేక బహుల అంతస్తులు ఉన్నాయి. అదేవిధంగా జాతీయ రహదారి, గొల్లపేట గ్రామానికి మధ్యలో పలు బాణసంచా షాపులు ఏర్పాటు చేశారు. వీటిపై అధికారులు దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

దీపావళి పండుగను ప్రజలందరూ సురక్షితంగా, పర్యావరణహితంగా జరుపుకోవాలి. అనుమతులు లేకుండా బాణసంచా విక్రయాలు, అక్రమ నిల్వలు, తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. మందుగుండు విక్రయాలకు పోలీస్‌శాఖతో పాటు సంబంధిత శాఖల నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలి. నివాస స్థలాలకు దూరంగా షాపులను ఏర్పాటు చేయాలి. దుకాణాల వద్ద తగినంత ఇసుక, నీటితో నిండిన డ్రమ్ములు, అగ్నిమాపక పరికరాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి. ప్రజలు గ్రీన్‌ కాకర్స్‌ మాత్రమే వినియోగించాలి. రాత్రి పది గంటల తర్వాత కాల్చరాదు. అక్రమ విక్రయాలు, నిల్వల సమాచారం తెలిస్తే డయల్‌ 112 లేదా సమీప పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలి.

-మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం

‘రైలులో బాణసంచా తీసుకెళ్లకండి’

పలాస, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): దీపావళి పండుగ వేళ రైలులో ప్రయాణికులు మండే స్వభావం కలిగిన వస్తువులు, పేలుడు పదార్ధాలు, బాణసంచా సామగ్రిని తీసుకువెళ్లవద్దని దక్షిణ కోస్తా రైల్వేశాఖ సీపీఆర్వో వై.బాలాజికిరణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైల్వే చట్టం 1989 ప్రకారం టపాసులు, గ్యాస్‌ సిలిండర్లు, యాసీడ్‌, పెట్రోలు, కిరోసిన్‌ వంటి వస్తువులు తీసుకువెళ్లడం నేరమన్నారు. పట్టుబడితే కనీసం మూడుళ్ల జైలు, భారీ జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఇటువంటి వస్తువుల రవాణాపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని, జీరో టాలరెన్స్‌ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. పార్సిల్‌ వ్యాన్‌లో కూడా లోడు చేసే వస్తువులపై నిఘా పెట్టడంతో పాటు వాటి కదలికలు పరిశీలించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రయాణికులు కూడా అప్రమ త్తంగా ఉండాలని, తోటి ప్రయాణికులు నిషేధిత వస్తువులను తరలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, రైల్వేహెల్ప్‌లైన్‌ 139 కూడా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:43 PM