Share News

భూ ఆక్రమణలను అడ్డుకోండి

ABN , Publish Date - May 29 , 2026 | 11:57 PM

Examination of disputed lands ఆరు దశాబ్దాలుగా శ్మశానవాటికగా వినియోగిస్తున్న భూమిని ఓ స్థానికేతరుడు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఆక్రమించేందుకు యత్నిస్తున్నాడు. అడ్డుకోబోయిన స్థానిక యువకులపై కేసులు పెట్టి వేధిస్తున్నాడు. మాకు న్యాయం చేయాలి’ అంటూ పొందూరు మండలం జోగన్నపేటకు చెందిన మహిళలు రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రావూరి సీతారామ్‌ను వేడుకున్నారు.

భూ ఆక్రమణలను అడ్డుకోండి
జోగన్నపేట గ్రామస్థులతో మాట్లాడుతున్న ఎస్సీ కమిషన్‌ సభ్యుడు సీతారామ్‌

  • ఎస్సీ కమిషన్‌ సభ్యుడిని వేడుకున్న జోగన్నపేట వాసులు

  • న్యాయం చేస్తామని సీతారామ్‌ భరోసా

  • వివాదాస్పద భూములు పరిశీలన

  • పొందూరు, మే 29(ఆంధ్రజ్యోతి): ‘ఆరు దశాబ్దాలుగా శ్మశానవాటికగా వినియోగిస్తున్న భూమిని ఓ స్థానికేతరుడు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఆక్రమించేందుకు యత్నిస్తున్నాడు. అడ్డుకోబోయిన స్థానిక యువకులపై కేసులు పెట్టి వేధిస్తున్నాడు. మాకు న్యాయం చేయాలి’ అంటూ పొందూరు మండలం జోగన్నపేటకు చెందిన మహిళలు రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రావూరి సీతారామ్‌ను వేడుకున్నారు. సమస్య పెరిగి మరో లక్ష్మీపేట కాకుండా చూడాలని అభ్యర్థించారు. విశాఖపట్నంలో నివాసం ఉంటున్న ఎన్‌.రవీంద్రబాబు.. జోగన్నపేటలో తమ పూర్వీకుల భూమి సుమారు 6 ఎకరాలను తాను స్వాధీనం చేసుకునేందుకు గ్రామస్థులు కొంతమంది అడ్డుచెబుతున్నారని ఇటీవల ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఐదేళ్లుగా వివాదం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎస్సీ కమిషన్‌ సభ్యుడు సీతారామ్‌ జోగన్నపేటలో విచారణ చేశారు. వివాదాస్పద భూములను పరిశీలించారు. ఆ ఆరు ఎకరాలు తమ పూర్వీకులకు చెందిన భూమి అని ఫిర్యాదుదారుడు రవీంద్రబాబు ధ్రువపత్రాలను ఎస్సీ కమిషన్‌ సభ్యుడు, అధికారులకు చూపించారు. కాగా.. అవి తప్పుడు ధ్రువపత్రాలు అని, శ్మశానవాటిక భూములు ఎలా స్వాధీనం చేసుకుంటారని గ్రామస్థులు, మహిళలు ఫిర్యాదుదారుడిని నిలదీశారు. తప్పుడు ఫిర్యాదుతో తమ పిల్లలను ఇబ్బందులు పెడుతున్నాడని ఎస్సీ కమిషన్‌ సభ్యుడి ముందు వాపోయారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా ఆ భూములపై కోర్టు శాశ్వత ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చిందని, న్యాయపరమైన చిక్కులు పరిష్కరించి, ఇరువర్గాలతో చర్చించి న్యాయం చేస్తామని ఎస్సీ కమిషన్‌ సభ్యుడు సీతారామ్‌ హామీ ఇచ్చారు. కాగా తమకు న్యాయం జరిగే వరకు వెనుదిరిగేది లేదని అధికారుల వాహనాలను గ్రామస్థులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్‌ఐ సత్యనారాయణ గ్రామస్థులతో మాట్లాడి శాంతింపజేశారు.

  • తహసీల్దార్‌ కార్యాలయంలో చర్చిద్దామని సభ్యుడు సీతారామ్‌ చెప్పగా.. కొద్దిసేపటి తర్వాత గ్రామస్థులు అక్కడకు చేరుకున్నారు. కానీ అక్కడ సభ్యులు లేకపోవడంతో గ్రామస్థులు మళ్లీ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు నచ్చజెప్పడంతో గ్రామస్థులు వెనుదిరిగారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆర్‌.వెంకటేష్‌, పీఆర్‌ డీఈ చంద్రశేఖర్‌, ఏఈ దయాసాగర్‌, ఎంపీడీవో వాసుదేవరావు, ఈవో పి.జగదీష్‌ పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2026 | 11:57 PM