Share News

‘పది’ పరీక్షలకు సిద్ధం

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:26 AM

Appointment of Chief, DO, ADO పదోతరగతి పరీక్షలు మార్చి 16 నుంచి జరగనున్నాయి. జిల్లాలో 145 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 28,586 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ మేరకు పరీక్షల ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది.

‘పది’ పరీక్షలకు సిద్ధం

చీఫ్‌, డీవో, ఏడీవోల నియామకం

కొందరికి దూరంగా విధులు..

ఇంకొందరికి మినహాయింపు

ఆటోమేషన్‌ విధానంలో ప్రక్రియ

నరసన్నపేట, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): పదోతరగతి పరీక్షలు మార్చి 16 నుంచి జరగనున్నాయి. జిల్లాలో 145 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 28,586 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ మేరకు పరీక్షల ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. పరీక్షల అధికారులు, ఇన్విజలేటర్ల నియామకాన్ని డిజిటల్‌ విధానంలో ఆటోమేషన్‌ పద్ధతిలో కంప్యూటర్‌ ద్వారా చేపట్టడానికి శ్రీకారం చుట్టింది. పరీక్షా కేంద్రాలకు చెందిన చీఫ్‌, డిపార్ట్‌మెంట్‌ అధికారులు(డీవో), అదనపు డిపార్ట్‌మెంట్‌ అధికారులను(ఏడీవో) నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కేంద్రానికి చీఫ్‌, డీవో నియమించగా విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్న కేంద్రాలకు అదనపు డిపార్ట్‌మెంట్‌ అధికారులను నియమించింది. విధుల నుంచి ఎవరికీ మినహాయింపు ఇచ్చేది లేదని ముందుగానే ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏమైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే సర్దుబాటు చేసుకునేందుకు మండలానికి ఇద్దరు చొప్పున రిజర్వులో ఉంచారు. తాము పనిచేస్తున్న పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాయని కేంద్రాలకు వీరిని నియమించారు. కొందరికి అదే మండలంలో, మరికొందరిని పొరుగు మండలాల్లో నియమించారు. ఆటోమేషన్‌ విధానంలో నియామకాల వల్ల కొందరు హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్లను దూరప్రాంతాల్లో కేంద్రాలకు కేటాయించారు.

జిల్లాలో 145 పరీక్ష కేంద్రాలకుగానూ 145 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, 145 మంది డీవోలు, మరో 145 మంది అదనపు డీవోలను నియమించారు. ఇంకా సుమారు 1800 మంది ఇన్విజిలేటర్లు, మరో 12 బృందాలకు పర్యవేక్షకులను నియమించనున్నారు.

వీరికి మినహాయింపు

బాలింతలను, గతంలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన వారికి ప్రోత్సహించిన వారిని, ట్యూషన్లు నిర్వహిస్తున్న వారిని, పదోతరగతికి హాజరవుతున్న పిల్లల తల్లిదండ్రులను, సస్పెన్షన్‌లో ఉన్నవారిని, గర్భిణులను, క్రమశిక్షణ చర్యలు పెండింగ్‌లో ఉన్నవారిని పరీక్షల విధులకు దూరంగా ఉంచారు. క్యాన్సర్‌ బాధితులు, ఓపెన్‌హార్ట్‌ సర్జరీ, స్టంట్‌, అవయవ మార్పిడి, మేజర్‌ న్యూరోసర్జరీ చేయించుకున్నవారు, టీబీ ఉన్నవారు, కిడ్నీ మార్పిడి, వెన్నెముక సర్జరీ చేయించుకున్నవారు, బదిలీల్లో ప్రత్యేక మినహాయింపు ఉన్నవారికి మినహాయించారు. మినహాయింపు పరిఽధిలోకి వచ్చేవారిని పొరపాటున పరీక్షల విధుల్లో నియమిస్తే.. వారు తగు ఆధారాలతో డీఈవోను కలిసి మినహాయింపు పొందాలని ఉత్తర్వల్లో పేర్కొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:26 AM