‘రథసప్తమి’కి సన్నద్ధం
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:24 AM
అరసవల్లి సూర్యనారాయణ స్వామి జయంతి (రథసప్తమి)ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది.
ఉత్సవాల ప్రచార రథం ప్రారంభం
అబ్బురపరచిన చిన్నారుల యోగా విన్యాసాలు
సూర్యనమస్కారాల్లో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే
అరసవల్లి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణ స్వామి జయంతి (రథసప్తమి)ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ నెల 19 నుంచి 25 వరకు ఏడు రోజుల పాటు జరిగే రథసప్తమి ఉత్సవాలకు సంబంధించిన స్వామివారి ప్రచార రథాన్ని జెండా ఊపి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ శుక్రవారం ప్రారంభించారు. రథసప్తమి ఉత్సవాల పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. ఉత్సవాలకు అంకురార్పణగా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఆదిత్యాలయ ఆవరణలో 200 మంది సాధకులతో సామూహిక సూర్యనమస్కారాల కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన యోగ విన్యాసాలు అబ్బురపరిచాయి. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా అధికారులు, సాధకులతో సూర్యనమస్కారాలను మంత్రపూర్వకంగా చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రథసప్తమి వేడుకల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మికత, చైతన్యం ఉట్టిపడేలా కార్యక్రమాల రూపకల్పన జరిగిందన్నారు. శోభాయాత్ర, హాట్ ఎయిర్ బెలూన్, హెలికాప్టర్ రైడ్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపారు. జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు ఉంటాయన్నారు. ఈ నెల 21న నగరంలోని 80 అడుగుల రోడ్డులో 5వేల మందితో మెగా సూర్యనమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో కూడా సూర్యనమస్కారాలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా అద్భుతంగా యోగసనాలు ప్రదర్శించిన చిన్నారి రాజహంసను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆలయ ఆవరణలో చెట్లు నాటారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ డీఆర్వో లక్ష్మణమూర్తి, ఆర్డీవో సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదనరావు, సుడా ఈఈ పొగిరి సుగుణాకరరావు, ఆయుష్ అధికారి జగదీష్, యోగా గురువులు రామారావు, మురళీ, కొఠారి ఆదినారాయణ, కొల్లి వెంకటరావు, తంగి స్వాతి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు, వివిధ యోగా సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.