పసుపు పండుగకు సిద్ధం
ABN , Publish Date - May 26 , 2026 | 11:47 PM
Virtual Mahanadu from today జిల్లాలో తెలుగు తమ్ముళ్ల సందడి మొదలైంది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మహానాడు’ కార్యక్రమానికి జిల్లా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బుధ, గురువారాల్లో పండుగ వాతావరణంలో వర్చువల్ పద్ధతిలో ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు పార్టీశ్రేణులు సన్నద్ధమయ్యాయి.
నేటి నుంచి రెండు రోజులపాటు అట్టహాసంగా ‘వర్చువల్’ మహానాడు
73 క్లస్టర్లలో వేడుకలకు ఏర్పాట్లు
ఒక్కోచోట సుమారు 800 మంది వరకు హాజరు
ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడ నుంచి లైవ్
శ్రీకాకుళం, మే 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తెలుగు తమ్ముళ్ల సందడి మొదలైంది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మహానాడు’ కార్యక్రమానికి జిల్లా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బుధ, గురువారాల్లో పండుగ వాతావరణంలో వర్చువల్ పద్ధతిలో ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు పార్టీశ్రేణులు సన్నద్ధమయ్యాయి. విజయవాడ వేదికగా నిర్వహించే ప్రధాన మహానాడు కార్యక్రమాన్ని ఇక్కడి నాయకులు, కార్యకర్తలు నేరుగా వీక్షించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాటంకంగా ఈ ప్రత్యక్ష ప్రసారం కొనసాగనుంది. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జిల్లాపార్టీ కార్యాలయంలో వర్చువల్ మహానాడు జరగనుంది.
73 క్లస్టర్లు.. ప్రతినిధుల నియామకం..
శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వర్చువల్ మహానాడు కోసం 73 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఆమదాలవలస - 11, టెక్కలి -10, పలాస - 10, నరసన్నపేట - 10, శ్రీకాకుళం -10, ఇచ్ఛాపురం -11, పాతపట్నం -11 క్లస్టర్లు కేటాయించారు. టీడీపీ బూత్, వార్డు కమిటీలు, కుటుంబ సాధికారిత సమితి సభ్యులతోపాటు గ్రామ, మండలస్థాయి నాయకులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఒక్కో క్లస్టర్‌కు సుమారు 500 నుంచి 800 మంది చొప్పున హాజరవుతారని అంచనా. ఎండల తీవ్రత దృష్ట్యా కార్యకర్తలకు ఇబ్బంది కలగకుండా క్టస్టర్ పరిధిలో ఏసీ ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలను ముందస్తుగానే నేతలు బుక్ చేశారు. ఒక్కో క్లస్టర్‌కు పార్టీ తరపున ఒక ప్రతినిధిని నియమించారు. రాష్ట్రపార్టీ కార్యదర్శులు, మునిసిపల్ చైర్మన్లు, కీలక నాయకులకు నియోజకవర్గాలవారీగా బాధ్యతలు అప్పగించారు. మహానాడు కార్యక్రమ పరిశీలకులుగా.. ఇచ్ఛాపురం - చౌదరి అవినాష్ (డీసీఎంఎస్ చైర్మన్), పలాస - కోళ్ల అప్పలనాయుడు (పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి), టెక్కలి - బిడ్డిక పద్మావతి(రాష్ట్ర కార్యదర్శి), పాతపట్నం - డొంకాడ రామకృష్ణ(జిల్లా గ్రంథాలయ చైర్మన్), శ్రీకాకుళం - బొంగు సురేష్(రాష్ట్ర కార్యదర్శి), ఆమదాలవలస - కర్రోతు వెంకట నర్శింగరావు (రాష్ట్ర కార్యదర్శి), నరసన్నపేట - వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్ (రాష్ట్రఆర్గనైజింగ్ కార్యదర్శి) నియమించారు. మహానాడు విజయవంతానికి వీరంతా కృషి చేస్తున్నారు.
నిర్ణయం వెనుక ‘పొదుపు’ మంత్రం..
మహానాడును వర్చువల్‌గా నిర్వహించడం వెనుక బలమైన కారణం ఉంది. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ వాతావరణం లాంటి పరిణామాల నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పొదుపు చర్యలు పాటించాలని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. ఈ మేరకు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ బాధ్యతాయుతంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పొదుపు చర్యల్లో భాగంగానే వర్చువల్ పద్ధతిలో మహానాడు నిర్వహణకు శ్రీకారం చుట్టారు.
రేపు ఎన్టీఆర్ జయంతి వేడుకలు..
మహానాడు రెండో రోజైన 28న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాల్లో జరగనున్నాయి. క్లస్టర్లవారీగా జరిగే ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొని కార్యక్రమాలను పరిశీలిస్తారు.
మంత్రుల పర్యటన ఇలా...
జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు తొలిరోజు బుధవారం విజయవాడలో జరిగే ప్రధాన మహానాడులో పాల్గొంటారు. గురువారం జిల్లాకు చేరుకుని, నియోజకవర్గాల స్థాయిల్లో జరిగే వర్చువల్ మహానాడు, ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.