సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
ABN , Publish Date - May 13 , 2026 | 11:32 PM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 16న నరసన్నపేట రానున్నారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
-సభాస్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే
-భద్రతా ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు
నరసన్నపేట, మే 13(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 16న నరసన్నపేట రానున్నారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక జమ్ముజంక్షన్ నుంచి సత్యవరం జంక్షన్ మీదుగా ఎస్‌డబ్ల్యూపీసీ వరకు మెయిన్ రోడ్డును సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. షాపుల్లో తడిచెత్త, పొడిచెత్త వేరుచేయడంపై డీఆర్‌డీఏ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. సుమారు 400 మంది అధికారులు, సిబ్బంది ఏర్పాట్లలో మునిగారు. పోలీసులు పట్టణంలో అడుగుడుగునా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అనుమానితులను గుర్తించి వారి వివరాలను ఆరా తీస్తున్నారు. సీఎం రూట్ మ్యాప్‌ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మానా అహ్మద్‌ఖాన్, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పరిశీలించారు. హెలీప్యాడ్, సీఎం సభాస్థలం, ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించే ఇందిరానగర్, ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో అఽధికారులకు పలు సూచనలు చేశారు. పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనుల బాధ్యతను శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస మున్సిపాలిటీ సిబ్బందికి అప్పగించారు. పోలీసులు, అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. హెలీప్యాడ్ పరిసర ప్రాంతాల భద్రత, వీఐపీల రాకపోకలు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలు రాకపోకలకు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, అత్యవసర సమయంలో స్పందన వ్యవస్థ, రూట్ వెంబడి ఉన్న కూడళ్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ప్రత్యామ్నాయ మార్గాలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా, అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని పూర్తి అప్రమత్తంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఆర్.వెంకట్రామన్, డీపీవో స్వరూపరాణి, టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్, డీఎస్పీ డి.లక్ష్మణరావు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ ఇమ్మూన్యువల్ రాజు, నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐలు గణేష్, జంజిత్ తదితరులు పాల్గొన్నారు.