పక్కాగా ఓటర్ల ప్రత్యేక సవరణ
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:12 AM
Voters Final list to be released on September 22 ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పక్కాగా పూర్తి చేస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సెప్టెంబరు 22న తుది జాబితా విడుదల
జిల్లాలో ఎరువుల కొరత రాకుండా చర్యలు
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 3(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పక్కాగా పూర్తి చేస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘గత నెల 15 నుంచి బూత్ స్థాయి అధికారులు(బీఎల్‌వో) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 86.79 శాతం మ్యాపింగ్, 54.53 శాతం డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. ఈ నెల 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తాం. 31 వరకు క్లెయిమ్‌లు, ఫిర్యాదులను స్వీకరిస్తాం. 60 రోజుల నోటీసు సమయం తరువాత సెప్టెంబరు 22న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తాం. పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్లల్లో ఉండేవారి విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. చిరునామా మారిన ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తున్నాం. జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదయ్యేలా చర్యలు తీసుకున్నామ’ని తెలిపారు. జిల్లాలో సచివాలయ సిబ్బంది, బూత్‌స్థాయి అధికారులు వచ్చే 10 రోజులపాటు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. రానున్న శని, ఆదివారాల్లో బీఎల్‌వోలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆయా పోలింగ్ కేంద్రాల్లోనే అందుబాటులో ఉంటారని తెలిపారు. అలాగే ‘‘ఈసీఐ.జీఓవీ.ఇన్’’ వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్ లేదా ఈసేవ ద్వారా ‘బుక్ ఏ కాల్’ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చన్నారు.
ఎరువుల పంపిణీ ప్రణాళిక
‘ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకున్నాం. ఎరువుల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసాం. 50శాతం నిల్వలు ముందుగానే అందుబాటులో ఉంచాం. జిల్లాకు మొత్తం 37,707 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటికే 17,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. 3521 మెట్రిక్ టన్నుల డీఏపీతో పాటుగా ఇతర కాంప్లెక్స్ ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. అక్రమాలు అరికట్టేందుకు ఈ-క్రాప్ సమాచారం ఆధారంగా వేలిముద్రలు, ఆధార్, ఓటీపీ ద్వారానే ఎరువుల పంపిణీ చేస్తాం. సొంతంగా రాలేని వారికోసం కొరియర్ లేదా కుటుంబ సభ్యులకు ఆథరైజేషన్ ఆప్షన్ కూడా ఇచ్చాం. ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొన్నిచోట్ల 6-ఏ కేసులు నమోదు చేశాం. ప్రతీ దుఖాణం వద్ద అధికారుల ఫోన్ నెంబర్లతో కూడిన బోర్డులు ఏర్పాటు చేశాం. రైతులు ఎంఆర్‌పీకే కొనుగోలు చేసి, రశీదులు తీసుకోవాల’ని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి వై.వెంకట మురళీకృష్ణ పాల్గొన్నారు.