Share News

రొయ్య.. అధరహో!

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:03 AM

The European market is coming together మొన్నటి వరకు బిక్కచూపులు చూసిన రొయ్యల ధర ప్రస్తుతం ఆశాజనకంగా ఉంది. దీంతో రొయ్యలు సాగుచేస్తున్న రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

రొయ్య.. అధరహో!

  • ఆశాజనకంగా ‘ఆక్వా’ ధరలు

  • కలిసివస్తున్న యూరోపియన్‌ మార్కెట్‌

  • యాంటీ-బయోటిక్స్‌ నిషేధంలో ఫలించిన ఎంపెడా కృషి

  • సంతబొమ్మాళి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): మొన్నటి వరకు బిక్కచూపులు చూసిన రొయ్యల ధర ప్రస్తుతం ఆశాజనకంగా ఉంది. దీంతో రొయ్యలు సాగుచేస్తున్న రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కొన్నాళ్ల కిందట వరుస తుఫాన్‌లు.. ఓ వైపు అనుకూలించని వాతావరణ పరిస్థితులు.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆంక్షలతో ఎగుమతిపై సుంకాల బెడద కారణంగా ఆక్వా రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి యూరోపియన్‌ మార్కెట్‌కు మన దేశ రొయ్యలు ఎగుమతి అయ్యేలా చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి ఒప్పందం కూడా కుదరడంతో.. యూరోపియన్‌ మార్కెట్‌కు రొయ్యల ఎగుమతి ప్రారంభమైంది. ఈ క్రమంలో రొయ్యల ధర పెరగడంతో ఆక్వా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  • జిల్లాలో 11 తీరప్రాంత మండలాల్లో 3,300 హెక్టార్లలో రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో సంతబొమ్మాళి, సోంపేట, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు, పోలాకి, రణస్థలం, ఎచ్చెర్ల, గార తదితర మండలాల్లో రైతులు ఆక్వాసాగుపై ఆసక్తి చూపారు. ప్రధానంగా విదేశీ ఎగుమతికి అవకాశం ఉండే రొయ్యలను సాగు చేస్తున్నారు. గత మూడు నాలుగు నెలల కిందట వరుస తుఫాన్లు, భారీ వర్షాలతో ఆక్వా రంగంపై ప్రభావం పడి రైతులకు నష్టం వాటిల్లింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక రొయ్య ఎదుగుదల సక్రమంగా లేక ధర తగ్గింది. అలాగే జిల్లాలో సాగుచేసే రొయ్యలకు దేశీయంగా కూడా మార్కెట్‌ ఉంది. గతంలో రొయ్యలు అమెరికాకు ఎగుమతి అయ్యేవి. అక్కడ కేవలం 20,30,40 కౌంట్లుకు మాత్రమే మంచి గిరాకీ ఉండేవి. కానీ అమెరికాలో ట్రంప్‌ సుంకాల బెడద కారణంగా రొయ్యల సాగు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కనీసం పెట్టుబడి కూడా రాక ఆక్వా రైతులు ఇబ్బందులు పడ్డారు.

  • గతంలో యాంటీబయోటిక్స్‌ కారణంగా..

  • గతంలో యూరోపియన్‌ మార్కెట్‌కు మన దేశ రొయ్యలు ఎగుమతయ్యేవి. కానీ సాగులో యాంటీ బయోటిక్స్‌ వినియోగం కారణంగా మన రొయ్యల కొనుగోలును యూరోపియన్‌ యూనియన్‌ నిషేధించింది. ఈ నేపఽథ్యంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ(ఎంపెడా).. రొయ్యల సాగులో యాంటీ బయెటిక్స్‌ వాడొద్దని సాగుచేస్తున్న రైతులకు అవగాహన కల్పించింది. దీంతో యాంటీ బయోటిక్స్‌ లేకుండా రొయ్యలసాగు చేస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో యూరోపియన్‌ మార్కెట్‌ మన దేశ రొయ్యలు కొనుగోలుకు ముందుకు రావడంతో ధరలు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ఓవైపు యూరోపియన్‌ మార్కెట్‌కు ఎగుమతితోపాటు చైనా మార్కెట్‌లో కూడా ఎక్కువగా 60 నుంచి 70 కౌంటు మన రొయ్యలు బాగా అమ్ముడుపోతున్నాయని పేర్కొంటున్నారు.

  • ధరలు ఇలా..

  • అరవై రోజుల్లో పంట దిగుబడి వచ్చే వంద కౌంటు రొయ్యల ధర గతంలో రూ.230 ఉండగా.. ప్రస్తుతం రూ.270కి పెరిగింది. టన్నుకు రూ.4లక్షల వరకూ అదనపు ఆదాయం రైతులకు అందుతోంది. ప్రస్తుత మార్కెట్‌లో 60 కౌంటు రూ.350, 50 కౌంటు రూ.370, 40 కౌంటు రూ.400, 30 కౌంటు రూ.500, 25 కౌంటు రొయ్యల ధర రూ.540 పలుకుతోంది. మన రాష్ట్రంతోపాటు ఒడిశా రాష్ట్రం నుంచి కూడా రొయ్యల ఎగుమతి పెరిగింది. దీంతో ఒడిశా వ్యాపారులు జిల్లాకు వచ్చి ఒక్కో కౌంటుపై కేజీకి రూ.10 అదనంగా చెల్లిస్తూ రొయ్యలను కొనుగోలు చేస్తున్నారు.

  • ఆశాజనకంగా సాగు

  • యూరోపియన్‌ మార్కెట్‌తో కేంద్ర ప్రభుత్వానికి కుదిరిన ఒప్పందం వల్ల రొయ్యల సాగు ఆశాజనకంగా ఉంది. గతంలో అమెరికాకు చిన్న కౌంటు ఉన్న రొయ్యలు మాత్రమే ఎగుమతి అయ్యేవి. ఎక్కువ కౌంటు ఉన్న రొయ్యల ఎగుమతికి ఇబ్బందులు ఉండేవి. ప్రస్తుతం ధరలు పెరగడంతో శుభపరిణామం.

  • - పిలక రవికుమార్‌, రొయ్యల సాగు రైతు, సంతబొమ్మాళి

  • యాంటీ-బయోటిక్స్‌ నిషేధం

  • ఎంపెడా కృషితో రొయ్యల సాగులో యాంటీ బయెటిక్స్‌ వాడకం పూర్తిగా నిలిచిపోయింది.ఎంపెడా యాంటీ బయోటిక్స్‌ వాడకం వల్ల ఎగుమతుల్లో వచ్చే ఇబ్బందులు వివరించడంతో రైతులు వారి సూచనలు మేరకు యాంటీ బాయోటిక్స్‌ నిలిపివేశారు.దీంతో రొయ్యల ఎగుమతులు ఇబ్బందులు తొలిగాయి.దీనికి తోడు యూరోపిన్‌ మార్కెట్‌తో ఒప్పందంతో రొయ్యల సాగుకు మంచి రోజులు వచ్చాయి.

  • - ధర్మరాజుపాత్రో, ఎఫ్‌డివో, మత్స్యశాఖ టెక్కలి

Updated Date - Feb 03 , 2026 | 12:03 AM