శాసనాంలో కరెంట్ కష్టాలు
ABN , Publish Date - Aug 08 , 2026 | 11:41 PM
జె.శాసనాంలో విద్యుత్ కష్టాలతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు.
- ఏళ్ల తరబడి మార్చని విద్యుత్ వైర్లు
- నిత్యం సరఫరాకు అంతరాయం
కంచిలి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): జె.శాసనాంలో విద్యుత్ కష్టాలతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో 300 పైబడి ఇళ్లు ఉన్నప్పటికీ ఒకే ఒక్క ట్రాన్స్‌ఫార్మరే ఉంది. దీంతో లోడ్ సమస్య వల్ల నిత్యం విద్యుత్ అంతరాయం కలుగుతుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ తీగలను సంవత్సరాలుగా మార్చకపోవడంతో ఎప్పుడుపడితే అప్పుడు తెగిపోయి సరఫరాకు అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలు సైతం జరుగుతున్నాయని వాపోతున్నారు. రాత్రి వేళల్లో వైర్లు కాలిపోతూ తెగిపడుతున్నాయని, దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరా నిరంతరం లేకపోవడంతో తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుందని మహిళలు వాపోతున్నారు. అధికారులు, పాలకులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి తమ కష్టాలు తీర్చాలని, లేదంటే కంచిలి సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపడతామని గ్రామస్థులు హెచ్చరించారు.