Share News

పాలిసెట్‌ ఫలితాల్లో సత్తా

ABN , Publish Date - May 06 , 2026 | 12:26 AM

Best ranks in Polycet పాలిసెట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. పాలిటెక్నికల్‌ కళాశాలల్లో ప్రవేశానికిగానూ జిల్లాలో 42 కేంద్రాల్లో గత నెల 25న పాలిసెట్‌ నిర్వహించారు. బాలురు 6,205 మంది, బాలికలు 5,013 మంది మొత్తంగా 11,218 మంది పరీక్ష రాశారు. మంగళవారం ఫలితాలు విడుదల కాగా.. 10,316 మంది(91.96 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

పాలిసెట్‌ ఫలితాల్లో సత్తా
చిన్నాల లోహిత్‌, ముద్దాడ పవన్‌కుమార్‌, కె.డిల్లేశ్వరి, ఎం.గుణచరణ్‌, హాసిని, జ్యోత్స్న, అనిల్‌ కుమార్‌

  • జిల్లా విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు

  • 91.96 శాతం ఉత్తీర్ణత

  • ఎప్పటిలాగే బాలికలదే పైచేయి..

  • శ్రీకాకుళం/ నరసన్నపేట/ జలుమూరు/ కంచిలి/ పాతపట్నం/ఎచ్చెర్ల/ లావేరు, మే 5(ఆంధ్రజ్యోతి): పాలిసెట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. పాలిటెక్నికల్‌ కళాశాలల్లో ప్రవేశానికిగానూ జిల్లాలో 42 కేంద్రాల్లో గత నెల 25న పాలిసెట్‌ నిర్వహించారు. బాలురు 6,205 మంది, బాలికలు 5,013 మంది మొత్తంగా 11,218 మంది పరీక్ష రాశారు. మంగళవారం ఫలితాలు విడుదల కాగా.. 10,316 మంది(91.96 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 5,614 మంది (90.48 శాతం), బాలికలు 4,702 మంది (93.80శాతం) పాసయ్యారు. బాలుర కన్నా బాలికలు ముందంజలో నిలిచారు. జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు.

  • జలుమూరు మండలం పంగవానిపేట గ్రామానికి చెందిన చిన్నాల లోహిత్‌ 120 మార్కులకు గాను 119 మార్కులు సాధించాడు. రాష్ట్రస్థాయిలో 26వ ర్యాంకు దక్కించుకున్నాడు. లోహిత్‌ చల్లవానిపేట ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్నాడు. 6 నుంచి 10 వరకు ప్రైవేటు స్కూలులో విద్యనభ్యసించాడు. తండ్రి కన్నయ్య రైతు, తల్లి కృష్ణకుమారి టీచరుగా పనిచేస్తున్నారు. పాలిసెట్‌లో ప్రతిభ చూపిన లోహిత్‌ను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.

  • నరసన్నపేట మండలం దూకలపాడు గ్రామానికి చెందిన ముద్దాడ పవన్‌కుమార్‌ 120 మార్కులకుగాను 119 మార్కులు సాధించాడు. రాష్ట్రస్థాయిలో 69వ ర్యాంకు లభించింది. అలాగే రెడ్డికపేటకు(నరసన్నపేట) చెందిన కురిమిని డిల్లేశ్వరి 118 మార్కులతో 102వ ర్యాంకు సాధించింది.

  • పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామానికి చెందిన తూలుగు జ్యోత్స్న రాష్ట్రస్థాయిలో 136వ ర్యాంక్‌ సాధించింది. ఇటీవల పదో తరగతి ఫలితాల్లో కూడా జ్యోత్స్న 593మార్కులు సాధించి నియోజకవర్గస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచింది. తండ్రి గిరిధర్‌ విద్యుత్‌శాఖ ఉద్యోగి కాగా, తల్లి రోజ గృహిణి.

  • సారవకోట మండలం అవలింగి గ్రామానికి చెందిన మాసవరపు గుణచరణ్‌.. 120 మార్కులకుగాను 114 మార్కులు సాధించాడు. రాష్ట్రస్థాయిలో 455వ ర్యాంకు దక్కించుకున్నాడు. బుడితి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి.. 586 మార్కులతో మండల టాపర్‌గా నిలిచాడు. తండ్రి అప్పారావు ఆటో డ్రైవరు కాగా, తల్లి రజని గృహిణి. అలాగే లావేరుకు చెందిన నక్కిన అనిల్‌కుమార్‌ 120 మార్కులకుగాను 115 మార్కులతో రాష్ట్రస్థాయిలో 291వ ర్యాంక్‌ సాదించాడు.

  • కంచిలి మండలం బూరగాం గ్రామానికి చెందిన సింహాద్రి హాసిని 1,293వ ర్యాంకు సాధించినట్లు ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సోమేశ్వరరావు తెలిపారు. హాసిని ఇటీవల పదో తరగతి ఫలితాల్లో సైతం అత్యధికంగా 589 మార్కులు సాధించిందన్నారు. అలాగే పాతపట్నంలోని జర్నలిస్టు కాలనీకి చెందిన కొంచాడ యుగంధర్‌ రాష్ట్రస్థాయిలో 3,306వ ర్యాంక్‌ సాధించాడు.

Updated Date - May 06 , 2026 | 12:27 AM