Share News

‘ఎల్‌నినో’తో.. విద్యుత్‌ లోటు

ABN , Publish Date - Sep 16 , 2026 | 12:36 AM

power cuts in srikakulam జిల్లాలో అప్రకటిత విద్యుత్‌ కోతలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు.. విద్యుత్‌ సరఫరాపైనా ప్రభావం చూపుతున్నాయి. ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ (ఈఎల్‌ఆర్‌)పేరుతో కొద్ది వారాలుగా జిల్లావ్యాప్తంగా విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

‘ఎల్‌నినో’తో.. విద్యుత్‌ లోటు
డొంకలూరులో విద్యుత్‌ సరఫరా లేక నిలిచిన ఆక్వాసాగు ఎయిర్‌ పంఖాలు

  • వర్షాభావ పరిస్థితులతో పెరిగిన వినియోగం

  • జిల్లాలో 420 మెగావాట్ల డిమాండ్‌

  • 340 మెగావాట్ల మాత్రమే సరఫరా

  • ‘ఈఎల్‌ఆర్‌’ పేరిట అప్రకటిత కోతలు

  • ప్రజలకు తప్పని ఇబ్బందులు

  • శ్రీకాకుళం/ సోంపేట రూరల్‌, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అప్రకటిత విద్యుత్‌ కోతలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు.. విద్యుత్‌ సరఫరాపైనా ప్రభావం చూపుతున్నాయి. ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ (ఈఎల్‌ఆర్‌)పేరుతో కొద్ది వారాలుగా జిల్లావ్యాప్తంగా విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అడపాదడపా వర్షాలు, ఈదురుగాలులు వీస్తే చాలు.. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక అయోమయం చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఆశించినస్థాయిలో వర్షాలు కురవడం లేదు. దీంతో లోటు వర్షపాతం వేధిస్తోంది. సాగునీటి కోసం రైతులు మోటార్లపై ఆధారపడాల్సి రావడంతో వ్యవసాయ విద్యుత్‌ వినియోగం అనూహ్యంగా రెట్టింపైంది. మరోవైపు ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తుండటంతో ఉక్కపోత అధికంగా ఉంటోంది. దీని నుంచి ఉపశమనం కోసం నగరాలు, పట్టణాల్లో ఏసీల వినియోగం గతం కంటే భారీగా పెరిగింది. కాగా పెరిగిన వినియోగానికి అనుగుణంగా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో జిల్లాప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు.

  • డిమాండ్‌కు సరిపడా సరఫరా ఏదీ..?

  • జిల్లావ్యాప్తంగా అన్ని రకాల విద్యుత్‌ కనెక్షన్లు కలిపి సుమారు 8 లక్షల వరకు ఉన్నాయి. పరిశ్రమలు, వ్యవసాయ కనెక్షన్లు, గృహ అవసరాలకు కలిపి జిల్లాలో మొత్తం 420 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంది. కానీ జిల్లాకు ప్రస్తుతం 330 నుంచి 340 మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో సుమారు 80 మెగావాట్ల మేర స్పష్టమైన విద్యుత్‌ లోటు ఏర్పడుతోంది. ఓ వైపు విద్యుత్‌ లోడ్‌ పెరిగిపోవడం, మరోవైపు జిల్లాకు సరిపడా విద్యుత్‌ సరఫరా కాకపోవడంతో.. అధికారులు ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌(ఈఎల్‌ఆర్‌)పేరుతో అప్రకటిత కోతలు విధిస్తున్నారు. శ్రీకాకుళం నగరంలోనే వేళాపాలా లేకుండా ఈఎల్‌ఆర్‌ పేరిట కోతలు విధిస్తుంటే.. ఇక మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్‌ కోతలు అమలు చేస్తున్నారు. ఈ కోతల దెబ్బకు ఆక్వా పరిశ్రమల నిర్వాహకులు, రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకెన్నాళ్లు ఈ అవస్థలు పడాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు.

  • కోతలతో ‘ఆక్వా’ కుదేలు

  • గడిచిన వారం రోజులుగా గంటల తరబడి విద్యుత్‌ కోతలు విధిస్తుండడంతో ఆక్వా రైతులు తీ వ్రంగా నష్టపోతున్నారు. చెరువుల్లో ఆక్సిజన్‌ అందక రొయ్యల్లో ఎదుగుదల లేక కన్నీరుమున్నీరవుతున్నారు. సోంపేట మండలం ఉప్పలాం పంచాయతీలో డొంకలూరు, బట్టిగళ్లూరు, నడుమూరు, ఎకువూరు గ్రామాల్లో వంద మందికిపైగా ఆక్వా రైతులు ఉన్నారు. ఆక్వాసాగుకు నిరంతర విద్యుత్‌ సరఫరా అవసరం. ఏరేటర్లు, మోటార్లు 24 గంటలూ నడవాల్సి ఉంటుంది. కానీ గత 15 రోజులుగా రోజూ రా త్రిపూట మూడు గంటలు విద్యుత్‌ కోతలు విధిస్తుండడంతో చెరువుల్లో ఆక్సిజన్‌ శాతం పడిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ లేని సమయంలో డీజిల్‌ జనరేటర్లు నడుపుతున్నారు. లీటరు డీజిల్‌ ధర రూ.105 ఉండడంతో రోజుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు డీజిల్‌కే ఖర్చువుతుందని రైతులు వాపోతున్నారు. దీనికితోడు కిలో నాలుగు వేల విలువైన ఆక్సిజన్‌ గుళికలు కూడా వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు బడే ఈశ్వరరావు, కొమర రాజారావు, గంట లింగరాజు, దుమ్ము వెన్నెలరాజు, బడే సాంబమూర్తి, బడే పాపారావు, మైలపల్లి పోలయ్య, సూరాడ బైరాగి, బట్టి మాధవరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆక్వా చెరువులకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని కోరుతున్నారు.

  • సరఫరా తగ్గింది...

  • వర్షాలు కురవడంలేదు. విద్యుత్‌ వినియోగం పెరిగింది. మన జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి ఉంది. సుమారు 80 మెగావాట్ల సరఫరా లోటు ఉండడంతో ఈఎల్‌ఆర్‌ విధించాల్సి వస్తోంది. ఏసీలు, వ్యవసాయ బోర్ల వాడకం పెరిగింది. అయినప్పటికీ లోటును అధిగమిస్తున్నాం. రెండు రోజుల నుంచి ఈఎల్‌ఆర్‌ లేకుండా చూస్తున్నాం.

  • - జీఎన్‌ ప్రసాద్‌, ఎస్‌ఈ ట్రాన్స్‌కో(ఆపరేషన్స్‌)

Updated Date - Sep 16 , 2026 | 12:36 AM