పెట్రోల్ పోసి.. నిప్పంటించి..
ABN , Publish Date - Mar 29 , 2026 | 12:16 AM
The worst dispute that led to the clash వారిద్దరూ ఇరుగుపొరుగు వ్యక్తులు. వారిద్దరి మధ్య కొంతకాలంగా స్థలం విషయమై తగాదాలు ఉన్నాయి. తాజాగా చెత్త వివాదం.. ఘర్షణకు దారి తీసింది. తన ఇంటి వద్ద చెత్త చేయవద్దని చెప్పినందుకు క్షణికావేశంలో ఓ వృద్ధుడు.. పొరుగున్న ఉన్న మరో వ్యక్తిపై పెట్రోల్ పోసి.. నిప్పంటించాడు.
ఘర్షణకు దారితీసిన చెత్త వివాదం
క్షణికావేశంలో వ్యక్తిపై వృద్ధుడు దాష్టీకం
మృత్యువుతో పోరాడుతున్న బాధితుడు
సోంపేట రూరల్, మార్చి 28(ఆంధ్రజ్యోతి): వారిద్దరూ ఇరుగుపొరుగు వ్యక్తులు. వారిద్దరి మధ్య కొంతకాలంగా స్థలం విషయమై తగాదాలు ఉన్నాయి. తాజాగా చెత్త వివాదం.. ఘర్షణకు దారి తీసింది. తన ఇంటి వద్ద చెత్త చేయవద్దని చెప్పినందుకు క్షణికావేశంలో ఓ వృద్ధుడు.. పొరుగున్న ఉన్న మరో వ్యక్తిపై పెట్రోల్ పోసి.. నిప్పంటించాడు. కాలిన గాయాలతో తీవ్రంగా బాధపడుతున్న ఆ వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. వివరాల్లోకి వెళితే..
సోంపేట మండలం బేసిరామచంద్రాపురం పెద్దవీధికి చెందిన పొందర మోహన్‌రావు అనే 70 ఏళ్ల వృద్ధుడు, కీళ్ల సీతారాం(50) ఇరుగుపొరుగున నివసిస్తున్నారు. వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా పెరడులో స్థలం విషయమై ఆస్తి తగాదాలు ఉన్నాయి. కాగా.. శనివారం ఉదయం మోహన్‌రావు.. సీతారాం ఇంటి ముందు చెత్త వేశాడు. తన ఇంటిముందు చెత్త ఎందుకు వేశారని సీతారాం ప్రశ్నించాడు. ఇంకెప్పుడు ఇలా చెత్త వేయొద్దని మోహనరావుకు చెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోగా.. మోహనరావు క్షణికావేశంతో తన వద్ద ఉన్న పెట్రోల్‌ను సీతారాంపై చల్లాడు. ఆపై నిప్పుతో తగులబెట్టాడు. దీంతో సీతారాం ఆ మంటల్లో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందజేశారు. కాలిన గాయాలతో బాధపడుతున్న సీతారాంను అంబులెన్స్‌లో బారువ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం టెక్కలిలో జిల్లా కేంద్రాసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ మరింత మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళంలో రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం సీతారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సీతారాం ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బారువ ఎస్‌ఐ హరిబాబునాయుడు తెలిపారు.