Share News

నేడే పోలింగ్‌

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:35 AM

జిల్లాలో పట్టణ పోరుకు సర్వం సిద్ధమైంది. శ్రీకాకుళం కార్పొరేషన్‌, ఆమదాలవలస మునిసిపాలిటీలో గురువారం ఎన్నికలు జరగనున్నాయి.

 నేడే పోలింగ్‌
శ్రీకాకుళంలో ఎన్నికల సామగ్రి సరిచూసుకుంటున్న సిబ్బంది

-నగర, పుర పోరుకు సర్వం సిద్ధం

- 16 ఏళ్ల తర్వాత శ్రీకాకుళం కార్పొరేషన్‌కు...

- ఎనిమిదేళ్ల తర్వాత ఆమదాలవలస మునిసిపాలిటీకి ఎన్నికలు

-224 కేంద్రాల్లో ఓటు వేయనున్న 1,90,612 మంది ఓటర్లు

- 1,495 మంది పోలింగ్‌ సిబ్బంది కేటాయింపు

- సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట పోలీసు బందోబస్తు

శ్రీకాకుళం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పట్టణ పోరుకు సర్వం సిద్ధమైంది. శ్రీకాకుళం కార్పొరేషన్‌, ఆమదాలవలస మునిసిపాలిటీలో గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం సాయంత్రం పోలింగ్‌ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం ప్రత్యేక వాహనాల్లో వారంతా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఈ రెండు చోట్లా కలిపి మొత్తం 88 స్థానాల్లో (60 డివిజన్లు, 28 వార్డులు) 1,90,612 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం మొత్తం 224 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రిజర్వ్‌తో కలిపి 1,495 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. ఎన్నికల పర్యవేక్షణ, సిబ్బంది తరలింపు కోసం 14 జోన్లు, 27 రూట్‌ మ్యాప్‌లను సిద్ధం చేశారు. 52 అత్యంత సమస్యాత్మక, 45 సమస్యాత్మక, 127 సాధారణ కేంద్రాలుగా గుర్తించి ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

శ్రీకాకుళం కార్పొరేషన్‌లో 180 కేంద్రాలు..

శ్రీకాకుళం కార్పొరేషన్‌ పరిధిలోని 60 డివిజన్లలో 1,57,545 మంది ఓటర్లు ఉండగా, 180 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఒకరు చొప్పున 180 మంది బీఎల్వోలను ఇన్‌చార్జిలుగా నియమించారు. 1,080 మంది ప్రిసైడింగ్‌, ఇతర పోలింగ్‌ అధికారులతో పాటు అదనంగా 100 మంది రిజర్వ్‌ సిబ్బందిని కేటాయించారు. పర్యవేక్షణ కోసం నగరాన్ని 10 జోన్లుగా విభజించి 10 మంది జోనల్‌ అధికారులను, 19 రూట్‌ మ్యాప్‌లకు 19 మంది రూట్‌ అధికారులను నియమించారు. మొత్తం 180 కేంద్రాల్లో 36 అత్యంత సమస్యాత్మక, 38 సమస్యాత్మక, 106 సాధారణ కేంద్రాలుగా గుర్తించి పటిష్ఠ భద్రత కల్పించారు.

ఆమదాలవలస మునిసిపాలిటీలో 44 కేంద్రాలు..

మునిసిపాలిటీలోని 28 వార్డుల పరిధిలో మొత్తం 33,067మంది ఓటర్లు ఉన్నారు. వీరికోసం 44 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 20 శాతం రిజర్వ్‌ సిబ్బందితో కలిపి మొత్తం 315 మంది సిబ్బందిని నియమించారు. 16 కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా, ఏడు కేంద్రాలు సమస్యాత్మకమైవిగా గుర్తించారు. ఆయా కేం ద్రాల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం పోలింగ్‌ కేంద్రాల వద్ద ర్యాంపులు, వీల్‌చైర్లు అందుబాటులో ఉంచారు.

శివాని కళాశాలలో స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌..

పోలింగ్‌ ముగిసిన అనంతరం ఈ రెండు ప్రాంతాల్లోని బ్యాలెట్‌ బాక్సులను చిలకపాలెంలోని శివానీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉన్న స్ర్టాంగ్‌ రూమ్‌కు తరలించనున్నారు. ఈ నెల 30న ఓట్ల లెక్కింపు జరగనుంది. శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు కోసం 90 టేబుళ్లను (వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపునకు 60, మేయర్‌ ఓట్ల లెక్కింపునకు 30) కేటాయించినట్లు కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు. ఆమదాలవలస మున్సిపాలిటీకి సంబంధించి 38 టేబుళ్లను (వార్డు సభ్యులకు 28, చైర్‌పర్సన్‌కు 10) సిద్ధం చేయగా, రిజర్వ్‌ సిబ్బందితో కలిపి 162 మంది కౌంటింగ్‌ అధికారులను కేటాయించినట్లు మున్సిపల్‌ అధికారులు స్పష్టం చేశారు.

మేయర్‌గా ఐదుగురు పోటీ..

నగరపాలక సంస్థ మేయర్‌ అభ్యర్థికి ఐదుగురు పోటీలో నిలిచారు. ఇందులో జనసేన నుంచి దానేటి రాధారాణి, వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, మరొకరు కాంగ్రెస్‌ పార్టీనుంచి.. మిగిలిన ఇద్దరు ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా పోటీకి దిగారు. 60 కార్పొరేటర్‌ స్థానాలకు 173 మంది పోటీలో ఉన్నారు.

చైర్‌పర్సన్‌ రేసులో ముగ్గురు

ఆమదాలవలస మునిసిపాలిటీలో చైర్‌పర్సన్‌ అభ్యర్థులుగా ముగ్గురు పోటీ పడుతున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే కూన రవికుమార్‌ భార్య కూన ప్రమీల, వైసీపీ నుంచి బొడ్డేపల్లి అజంతాకుమారి, కాంగ్రెస్‌ నుంచి లకేనేని కల్యాణి బరిలో నిలిచారు. 28 వార్డులకు సంబంధించి కౌన్సిలర్‌ అభ్యర్థులుగా 65 మంది పోటీలో ఉన్నారు.

‘జనసేన’ నుంచి మేయర్‌ అభ్యర్థిగా రాధారాణి..

శ్రీకాకుళం నగరంలో ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ దానేటి శ్రీధర్‌ రాజకీయాల్లో రాణించాలన్న ఆలోచనతో వైసీపీ నుంచి చాన్నాళ్ల పాటు శ్రమించారు. కానీ, ఆయన సేవలను వినియోగించుకున్నారు కానీ శ్రీధర్‌కు ఎలాంటి ఉపకారం కలగలేదాయె. దీంతో సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన సతీమణి దానేటి రాధారాణి శ్రీకాకుళం కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థిగా కూటమి నుంచి పోటీకి అధిష్టానం దించింది. దీంతో ఆయన కల నెరవేరింది. ఆమె రాజకీయంగా బలపడేలా ఇటు కూటమి నాయకులు తీవ్రంగా ప్రచారం చేపట్టారు. అన్ని డివిజన్లలో ప్రచారం మోతమోగించారు. త్వరలో ఫలితాలు ఆశాజనకంగా లభిస్తాయని నూరు శాతం ఆశతో ఉన్నారు.

వైసీపీ మేయర్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి..

టీడీపీలో సుదీర్ఘకాలం కొనసాగిన మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఇటీవల వైసీపీలో చేరారు. ఇప్పుడు మేయర్‌ అభ్యర్థిగా ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. 2014-2019లో శ్రీకాకుళం ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి ఆమె గెలుపొందారు. 2019లో మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు చేతిలో ఓటమి చెందారు. 2024లో టీడీపీ టికెట్‌ నుంచి లభించలేదు. అప్పటినుంచి అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే మాజీమంత్రి ధర్మాన చొరవతో వైసీపీలో చేరి.. ఇప్పుడు మేయర్‌ అభ్యర్థిగా నగర ప్రజల తీర్పు కోరుతున్నారు.

16 ఏళ్ల తర్వాత ఎన్నికలు

శ్రీకాకుళం నగరపాలక సంస్థకు ఏకంగా 16 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. 2009లో శ్రీకాకుళం మునిసిపాలిటీగా ఉండేది. ఇందులో శ్రీకాకుళం రూరల్‌ మండలం నుంచి 4 పంచాయతీలు, ఎచ్చెర్ల మండలం నుంచి 3 పంచాయతీలను అధికారులు విలీనం చేశారు. దీన్ని ఆయా పంచాయతీలు వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించాయి. అప్పటి నుంచి ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. 2014లో టీడీపీ ప్రభుత్వం శ్రీకాకుళాన్ని కార్పొరేషన్‌ చేసింది. కోర్టులో కేసు ఉండడంతో ఎన్నికలు జరగలేదు. 2019 నుంచి 2024 వరకూ అధికారంలో ఉన్న వైసీపీ కూడా ఎన్నికలు జరిపేందుకు ప్రయత్నం చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లపై దృష్టి సారించింది. వివాదాలను పరిష్కరించి ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంది. దీంతో శ్రీకాకుళం కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి.

-ఆమదాలవలస మునిసిపాలిటీకి కూడా ఎనిమిదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. 2019లో మునిసిపాల్‌ పాలకవర్గం ముగిసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 23 వార్డులతో ఉన్న మునిసిపాలిటీని 28 వార్డులుగా చేసింది. వార్డుల విభజన సక్రమంగా లేదని కొందరు కోర్టు మెట్లు ఎక్కారు. అప్పటి నుంచి ఎన్నికలు జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎన్నికలకు మోక్షం కలిగింది.

Updated Date - Nov 26 , 2026 | 12:35 AM