రైతుబజారు చుట్టూ రాజకీయం!
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:24 AM
Rythu Bazaar set up in Palasa పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో రైతుబజారు ఏర్పాటుపై రాజకీయ నీడలు కమ్ముకుంటున్నాయి. దశాబ్దాలుగా రైతుబజారు లేక ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో.. రైతుబజారు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
వైసీపీ హయాంలో నెరవేరని హామీ
రోడ్డుపైనే కూరగాయల విక్రయాలతో ఇబ్బందులు
‘పలాస’లో 20సెంట్లలో ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కృషి
రూ.50 లక్షల నిధులు మంజూరు
క్రెడిట్ చోరీ అంటూ వైసీపీ నేతల విమర్శలు
నగరం నడిబొడ్డున నిర్మించడమే నేరమా అని టీడీపీ శ్రేణుల మండిపాటు
పలాస-కాశీబుగ్గలో శుక్రవారం సంత ఇది. ఇక్కడ రైతుబజారు లేక.. రోడ్డుపైనే ఇలా కూరగాయలు విక్రయిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో రైతులు, మత్స్యకారులు, గిరిజనులు.. వ్యవసాయ, అటవీ ఉత్పత్తులతోపాటు చేపలను సైతం తీసుకొచ్చి ఇక్కడకు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. కాగా.. సరైన మార్కెటింగ్ సదుపాయం లేక.. వీరంతా దళారుల బారిన పడి నష్టపోతున్నారు. మరోవైపు రోడ్డుపైనే విక్రయాల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. (పైనున్న ఒకటో చిత్రం)
కాశీబుగ్గ మూడురోడ్ల జంక్షన్‌లో రైతుబజారు నిర్మాణానికి చదును చేసిన స్థలమిది. మునిసిపాలిటీ పరంగా జోన్-1లో ఉన్న ఈ ప్రదేశంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే మార్కెట్ ధర చదరపు అడుగు రూ.లక్షల్లో ఉంటుంది. అటువంటి ప్రదేశంలో 20సెంట్లు స్థలాన్ని రైతుబజారుకు కేటాయించి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఇటీవల సోమవారం భుమిపూజ చేశారు. వంద రోజుల్లో నిర్మాణం పూర్తిచేసే దిశగా కృషి చేస్తున్నారు. (పైనున్న రెండో చిత్రం)
పలాస, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో రైతుబజారు ఏర్పాటుపై రాజకీయ నీడలు కమ్ముకుంటున్నాయి. దశాబ్దాలుగా రైతుబజారు లేక ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో.. రైతుబజారు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని అప్పటి మంత్రి సీదిరి అప్పలరాజు ఆశలు కల్పించారు. కానీ.. కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతుబజారు ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. కాశీబుగ్గ నడిబొడ్డున మూడురోడ్ల జంక్షన్‌లో 20 సెంట్ల స్థలంలో దీని నిర్మాణానికిగానూ గత నెల 28న స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. రైతుబజారుకు రూ.50లక్షల వరకూ నిధులు కేటాయించడంతో వంద రోజుల్లో పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. దీన్ని వైసీపీ నాయకులు వివాదంలోకి లాగి.. రైతుబజారు అంశాన్ని క్రెడిట్‌చోరీ చేశారంటూ.. కూటమి నేతలను విమర్శిస్తున్నారు. ఈ పరిణామం కూటమి నాయకుల్లో ఆగ్రహం కలిగిస్తోంది.
టీడీపీ ప్రభుత్వ హయాంలోనే..
టీడీపీ ప్రభుత్వ హయాంలో (2014- 2019 మధ్య) రైతుబజారు కోసం రూ.40లక్షలు నిధులు మంజూరు చేశారు. కాశీబుగ్గ కేటీ రోడ్డులో ఉన్న ఎస్సీ హాస్టల్ వద్ద దీన్ని నిర్మించడానికి భూమిపూజ చేశారు. ఫిల్లర్లు కూడా నిర్మించే క్రమంలో.. ఇది తమకు చెందిన భూమి అంటూ కొంతమంది కోర్టులో దావా వేశారు. దీంతో ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ పార్టీ నాయకులు అక్కడ బలవంతంగా బజారు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నా కోర్టు కేసుల కారణంగా ఫలితం లేకపోయింది. తరువాత కాశీబుగ్గ మూడురోడ్ల జంక్షన్‌లో ఉన్న యూపీ పాఠశాల పాడవడం, విద్యార్థులు కూడా లేకపోవడంతో అక్కడ రాజన్న రైతుబజారు పేరుతో తాత్కాలికంగా రైతుబజారు ఏర్పాటు చేశారు. అది కూడా కొద్ది నెలలు నిర్వహించి తరువాత ఎత్తివేశారు. తరువాత రైతుబజారు ఏర్పాటుకు రూ.43 లక్షలు నిధులకు హామీ వచ్చినా స్థలం లేక అదికాస్త చతికిలబడిపోయింది.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుబజారు ఏర్పాటుకు ఎమ్మెల్యే శిరీష తమవంతు ప్రయత్నం చేశారు. పాడైన పాఠశాల ప్రాంతం.. రైతుబజారుకు అనువైన స్థలమని.. దీనిని మంజూరు చేయించాలని కలెక్టర్ స్వప్నిల్‌దినకర్ పుండ్కర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడుకు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లాపరిషత్ నుంచి భూమిని బదలాయించి రైతుబజారుకు 20 సెంట్లు స్థలాన్ని కేటాయించారు. ఆపై కొద్ది కాలంలోనే సంబంధిత ఫైల్‌లో కదలిక వచ్చి మార్కెట్‌కమిటీకి ఆమోదం లభించింది. దీంతో రూ.50 లక్షలు మంజూరు చేసి రైతుబజారుకు మోక్షం కల్పించారు. ఈ వ్యవహారంపై క్రెడిట్‌చోరీ ఎవరిది అవుతుందో విమర్శలు గుప్పిస్తున్న నేతలే సమాధానం చెప్పాల్సి ఉంది.
వాస్తవానికి మార్కెట్‌కమిటీ కార్యాలయం ఆవరణలో ఖాళీ స్థలంలో రైతుబజారు నిర్మాణానికి ఒకానొకదశలో ఆమోదం లభించింది. అయితే పట్టణాలకు దూరంగా ఉన్న కారణంగా ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. రైతుబజారుపై ఇది తమ విజయమని టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వైసీపీ నాయకులు క్రెడిట్‌చోరీ అంటూ ప్రచారం చేయడంతో ప్రస్తుతం హాట్‌టాఫిక్‌గా మారింది.
పట్టణ టీడీపీ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాస్, సీనియర్ నేత దువ్వాడ శ్రీకాంత్, ఎం.నరేంద్ర(చిన్ని) మాట్లాడుతూ రైతుబజారు క్రెడిట్‌చోరీ ఏ విధంగా అవుతుందో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. స్థలం, నిధులు మంజూరు చేసిందే కూటమి ప్రభుత్వమని, ఇందులో ఎమ్మెల్యే గౌతు శిరీష కృషి ప్రశంసనీయమన్నారు. దీనిపై విషప్రచారం చేస్తే సహించబోమని స్పష్టం చేశారు.