అంతా.. మా ఇష్టం
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:22 AM
Contractor and employees overacting అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రాజకీయ జోక్యం మితిమీరుతోంది. దీంతో కొందరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హుండీలు, టిక్కెట్ల విక్రయాల ద్వారా ఆదిత్యుడి ఆదాయం పెరుగుతున్నా.. అందుకు తగ్గట్టు భక్తులకు సౌకర్యాలు కల్పించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆదిత్యాలయంలో మితిమీరిన రాజకీయ జోక్యం
కాంట్రాక్టర్, కొంతమంది ఉద్యోగుల ఇష్టారాజ్యం
అధికారపార్టీ ముఖ్యనేత అండ ఉందని ప్రచారం
అర్చకులు, అధికారుల మధ్య పెరిగిన దూరం
అరసవల్లి, జూలై 3(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రాజకీయ జోక్యం మితిమీరుతోంది. దీంతో కొందరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హుండీలు, టిక్కెట్ల విక్రయాల ద్వారా ఆదిత్యుడి ఆదాయం పెరుగుతున్నా.. అందుకు తగ్గట్టు భక్తులకు సౌకర్యాలు కల్పించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికారులు, అర్చకుల మధ్య సమన్వయలోపంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాజకీయ అండతో.. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో దినసరి ఉద్యోగులకు సక్రమంగా జీతాలు చెల్లించని దుస్థితి నెలకొంది. అలాగే కొందరు టీడీపీ నాయకులు ఆలయానికి సంబంధించిన ప్రతీ విషయంలోను తలదూర్చుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమ మనుషులను దినసరి వేతన ఉద్యోగులుగా నియమించి, ఆలయంపై పూర్తి పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. ప్రతీ చిన్న విషయానికి నియోజకవర్గ నాయకుడికి ఫిర్యాదు చేస్తామంటూ ఉన్నతాధికారులకు బెదిరింపులు ఎదురవుతుండడంతో ఏమీ చేయలేని స్థితి నెలకొంది.
ఆ కాంట్రాక్టరు అన్నింటికీ అతీతుడు
ఆలయంలో పారిశుధ్య నిర్వహణ, సెక్యూరిటీ ఉద్యోగుల సరఫరా, జీతభత్యాలకు సంబంధించి జీరో లాభంతో అనుమతి పొందిన కాంట్రాక్టరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సెక్యూరిటీ, పారిశుధ్య నిర్వహణ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి నెలనెలా జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు. జీతాల బిల్లులు కూడా సమయానికి కార్యాలయంలో అందజేయడం లేదు. కావలసిన ధ్రువపత్రాలను కూడా సమర్పించడం లేదు. ఈ విషయంలో ఆలయ ఈవో మందలించినా సరే.. ఖాతరు చేయని పరిస్థితి నెలకొంది. అరసవల్లికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడి అండతో ఆ కాంట్రాక్టరు ‘అంతా నా ఇష్టం.. నన్నెవరూ ఏం చేయలేరు’ అంటూ బాహాటంగానే సవాలు చేస్తున్నాడు. అంతే కాకుండా సెక్యూరిటీ సిబ్బంది జీతాల నుంచి నెలకు రూ.2వేలు చొప్పున ఇవ్వాలని ఒత్తిడి చేస్తుండడంతో వారు దిక్కుతోచక విలవిల్లాడిపోతున్నారు.
ఆలయంలో పారిశుధ్య పనులు చేసే ఓ దినసరి ఉద్యోగి.. కీలకంగా వ్యవహరిస్తూ అన్ని విషయాల్లో లావాదేవీలు సాగిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయ ఆవరణలో అక్రమ వసూళ్ల సూత్రధారులు కూడా ఆ వ్యక్తి కనుసన్నల్లోనే పని చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
అధికారం అంతా ఆ ఇద్దరిదేనా...?
ఆలయానికి సంబంధించిన ఎంత చిన్న విషయమైనా సరే ఆ ఇద్దరు సోదరుల కనుసన్నల్లోనే నడవాలి. ఏ విషయంలో తేడా వచ్చినా సరే వెంటనే నియోజకవర్గ ప్రముఖుడికి సమాచారం చేరవేస్తామని అరసవల్లికి చెందిన ఆ అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే కొందరు దినసరి వేతనదారుల ద్వారా ఆలయానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి, ఆలయాధికారులను తమ గుప్పిట్లో పెట్టుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఉద్యోగులపై ఆలయ అధికారికి ఏం పట్టు ఉంటుందని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
ఆలయంలో 47 మంది దినసరి ఉద్యోగులు ఉండగా.. నిత్యం పది మంది మాత్రమే పనులు చేస్తున్నారు. రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన చాలామంది దినసరి ఉద్యోగులు కేవలం జీతం కోసం మాత్రమే కనిపిస్తుంటారు. వారి ప్రైవేటు వ్యాపారాలతో బిజీగా గడిపేస్తున్నారు. పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల సమయంలో మాత్రం పనుల కాంట్రాక్టులు వారే చేస్తుంటారని భక్తులు ఆరోపిస్తున్నారు.
ఆలయ అభివృద్ధికి అర్చకులు, అధికారుల మధ్య సమన్వయం ఎంతో అవసరం. అరసవల్లిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. చాలా విషయాల్లో అధికారులు అర్చకుల అభిప్రాయాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా ప్రవర్తిస్తుండడంతో వారు దూరంగా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి ఆలయంలో పరిస్థితులు చక్కదిద్దాలని భక్తులు కోరుతున్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించం
ఆదిత్యుడి ఆలయంలోని విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అక్రమాలకు పాల్పడినా సహించం. గతంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ.. అక్రమాలకు పాల్పడిన కొంతమంది ఉద్యోగులను తొలగించాం. అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నాం.
- కేఎన్‌వీడీవీ ప్రసాద్, ఈవో, అరసవల్లి