పోలవరం టూ వంశధార
ABN , Publish Date - Feb 11 , 2026 | 11:25 PM
సిక్కోలు సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
- ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఊపిరి
- గోదావరి జలాల అనుసంధానానికి పచ్చజెండా
- జీడికి ‘వాల్యూ’.. మామిడికి ‘ధర’ భరోసా
- మత్స్యకారులకు వరాల జల్లు
- గవర్నర్ కీలక ప్రసంగం
- జిల్లా అభివృద్ధిపై కొత్త ఆశలు
శ్రీకాకుళం, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): సిక్కోలు సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా జిల్లా రైతాంగం కలలు కంటున్న గోదావరి జలాలను వంశధార నదికి అనుసంధానించే ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. మంగళవారం అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక ప్రసంగం చేశారు. జిల్లా పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. జిల్లా జీవనాడి అయిన వంశధార ప్రాజెక్టు, ఉద్దాన రైతాంగం, తీరప్రాంత మత్స్యకారుల సంక్షేమంపై గవర్నర్ చేసిన ప్రకటనలు జిల్లా ముఖచిత్రాన్ని మార్చేలా ఉన్నాయి. దీంతో ఉత్తరాంధ్ర, ముఖ్యంగా జిల్లా అభివృద్ధిపై కొత్త ఆశలు చిగురింపజేశాయి.
గోదావరి జలాలతో సస్యశ్యామలం..
పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని స్పష్టమైన గడువు విధించిన గవర్నర్.. ఆ వెంటనే జిల్లా రైతులకు శుభవార్త చెప్పారు. గోదావరి జలాలను పోలవరం నుంచి వంశధార నదికి అనుసంధానించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. అదే జరిగితే జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతుంది. వర్షాభావ పరిస్థితుల్లోనూ వంశధార ఎండిపోకుండా గోదావరి జలాలు ఆదుకుంటాయి.
జీడి, మామిడి రైతుల కోసం..
జిల్లా ఆర్థిక వనరులైన జీడి, మామిడి రైతుల కోసం ప్రభుత్వం రెండు వేర్వేరు వ్యూహాలను ప్రకటించింది. మార్కెట్లో ధరలు పడిపోయినప్పుడు రైతులు నష్టపోకుండా ఉండేందుకు ‘ధరల స్థిరీకరణ’ నిధిని మామిడి పంటకు వర్తింపజేస్తామని ప్రకటించారు. ఏపీఐఐసీ, మార్క్ ఫెడ్ ద్వారా ఈ కొనుగోళ్లు జరుపుతారు. పలాస జీడిపప్పును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా ‘వాల్యూ చైన్’ ప్రోత్సాహకాలను ప్రకటించారు. 2030 నాటికి జీడిపప్పు ప్రాసెసింగ్, ఎగుమతుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని వెల్లడించారు.
మత్స్యకారుల కోసం..
జిల్లాలోని సుదీర్ఘ తీరప్రాంతాన్ని ఉపయోగించుకుని మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేలా వరాలు కురిపించారు. సముద్రపు కలుపు మొక్కల పెంపకం ద్వారా తీరప్రాంత మహిళా సంఘాలకు కొత్త ఆదాయ మార్గాలను చూపనున్నారు. వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రూ.20 వేల వరకు పెంచారు. ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కుల ఏర్పాటు, ఓడరేవుల ఆధారిత ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేశారు. ఇది జిల్లాలో నిర్మాణంలో ఉన్న మూలపేట పోర్టు పరిసరాల అభివృద్ధికి సూచిక. గిరిజన ప్రాంతాల్లో పండించే పంటలకు (పసుపు, అనాస వంటివి) అక్కడే విలువ జోడించే కార్యక్రమాలు చేపడతామని చెప్పడం ద్వారా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని రైతులకు మేలు జరుగుతుంది.
జిల్లాకు దక్కిన సూపర్ ‘సిక్స్’
వంశధార - గోదావరి అనుసంధానం (సాగునీటి భద్రత)
మామిడికి ధరల స్థిరీకరణ (గిట్టుబాటు ధర)
జీడిపప్పుకు ఎగుమతి ప్రోత్సాహకాలు (పారిశ్రామిక ప్రగతి)
మత్స్యకార భృతి రూ. 20 వేలకు పెంపు (సంక్షేమం)
సీవీడ్ సాగుతో మహిళలకు ఉపాధి (సాధికారిత)
గిరిజన ఉత్పత్తులకు వేల్యూ అడిషన్ (మన్యం అభివృద్ధి)