సరిహద్దులో పేకాట క్లబ్
ABN , Publish Date - Oct 13 , 2026 | 12:12 AM
72 people taken into poloce custody ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పేకాట క్లబ్‌పై ఒడిశా పోలీసులు దాడి చేశారు. 72 మందిని అదుపులోకి తీసుకుని, రూ. 12.13 లక్షల నగదు, 9 కార్లు, 60 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
దాడిచేసిన ఒడిశా పోలీసులు.. 72 మంది అదుపులోకి
జూదరుల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లా వాసులు
రూ.12.13 లక్షల నగదు, 9 కార్లు, 60 సెల్‌ఫోన్లు స్వాధీనం
మెళియాపుట్టి/శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పేకాట క్లబ్‌పై ఒడిశా పోలీసులు దాడి చేశారు. 72 మందిని అదుపులోకి తీసుకుని, రూ. 12.13 లక్షల నగదు, 9 కార్లు, 60 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు అధికంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రా ప్రాంతమైన వసుంధర గ్రామానికి సుమారు వంద మీటర్ల దూరంలో ఒడిశా రాష్ట్రం దవిడిగాం సమీపాన ఉన్న ఓ కల్యాణ మండపంలో కొంతకాలంగా పేకాట క్లబ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో గజపతి జిల్లా డీఎస్పీ అమితాబ్ పండా, సీఐ ప్రశాంత్ భూషణ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గారబంద, కాశీనగర్, పర్లాకిమిడి పోలీస్‌స్టేషన్ల సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో శ్రీకాకుళం, మెళియాపుట్టి, టెక్కలి, కోటబొమ్మాళి, నరసన్నపేట, పాతపట్నం, హిరమండలం ప్రాంతాలతో పాటు విజయనగరానికి చెందిన కొందరు పట్టుబడినట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన వారిని సోమవారం పర్లాకిమిడి జిల్లా కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
రూ.50 వేల డిపాజిట్?
ఇక్కడ పేకాట ఆడేందుకు వెళ్లేవారు ముందుగా రూ.50 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, అనంతరం వారికి ఆటలో ఉపయోగించే కాయిన్లు ఇచ్చి లోపలికి అనుమతిస్తారని సమాచారం. లోపలికి వెళ్లినవారి నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భోజనం, మద్యం కూడా అందిస్తున్నట్లు సమాచారం. కారు పార్కింగ్‌కు రూ. ఐదు వందల వరకు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు తరచూ ఈ శిబిరానికి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మెళియాపుట్టికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పట్టుబడినట్లు తెలుస్తోంది.
అచ్చనాపురం తోటల్లోనూ పేకాట?
ఆంధ్రా ప్రాంతమైన మెళియాపుట్టి మండలంలోని జాడుపల్లి సమీపంలో అచ్చనాపురం గ్రామం వద్ద ఉన్న మామిడి తోటల్లోనూ కొంతకాలంగా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఒడిశా పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో కొందరు అక్కడికి వచ్చి ఆట ఆడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా రెండు మార్గాల్లో వాహనాలపై వచ్చి, రెండు మూడు గంటలు పేకాట ఆడి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంపై కూడా పోలీసులు నిఘా పెంచాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.