Share News

ఉన్నత చదువులకు ఊతం పీఎం విద్యాలక్ష్మి

ABN , Publish Date - May 31 , 2026 | 11:59 PM

ఉన్నత విద్య అభ్యసించాలనుకునే చాలామంది విద్యార్థులు డబ్బు కోసం ఆలోచన చేస్తుంటారు.

ఉన్నత చదువులకు ఊతం పీఎం విద్యాలక్ష్మి

- ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు వరం

- బ్యాంకులు నుంచి నేరుగా రుణం

- పోర్టల్‌ ద్వారా దరఖాస్తుకు అవకాశం

- 3శాతం వడ్డీ రాయితీ

నరసన్నపేట, మే 31 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య అభ్యసించాలనుకునే చాలామంది విద్యార్థులు డబ్బు కోసం ఆలోచన చేస్తుంటారు. తగినన్ని నిధులు లేక చదువు మానేసివారు చాలామంది ఉంటారు. కొందరు బ్యాంకు రుణాల కోసం ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం పీఎం విద్యాలక్ష్మి పేరుతో పత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇంటర్‌ పూర్తయ్యాక ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. విద్యారుణాలు కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. పోర్టల్‌లో దరఖాస్తు చేస్తే చాలు బ్యాంకులే నేరుగా రుణాలు మంజూరు చేస్తాయి. ఈఏడాది జిల్లాలో ఇంటర్‌ పూర్తి చేసిన సైన్స్‌, ఓకేషనల్‌ విద్యార్థులు సుమారు 13వేలు మందికి పైగా ఉన్నారు. వీరిలో ఇంజనీరింగ్‌, ఐఐటీ, ఎన్‌ఐటీ కోర్సులో ప్రవేశాలకు పరీక్షలు రాశారు. మరికొందరు ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో చేరేందుకు పరీక్షలు కూడా రాశారు. అలాగే వైద్యవిద్యను అభ్యసించేందుకు సుమారు 2వేలు మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దాదాపు జిల్లా నుంచి 100 నుండి 150 మంది వరకు ఏటా విదేశాల్లో వైద్యవిధ్య అభ్యసిస్తున్నారు. ఇలాంటి వారికి విద్యాలక్ష్మి పథకం వరం లాంటిందని చెప్పవచ్చును.

అర్హతలు ఇవి..

- ఇంజనీరింగ్‌, వైద్యవిద్య, వృత్తివిద్యాకోర్సులు, మేనేజ్‌మెంట్‌ కోర్సులు, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారు అర్హులు.

- మెరిట్‌ ఆధారంగా మంచి విద్యాసంస్ధలో ప్రవేశం పొందాలి.

- మేనేజ్‌మెంట్‌ కోటాలో చేరే వారికి రుణాలు ఇవ్వరు.

- వార్షిక ఆదాయం రూ.8లక్షల వరకు ఉన్నవారికి రూ.10లక్షలలోపు రుణం ఇస్తారు. 3శాతం వరకు వడ్డీ రాయితీ ఇస్తారు. కోర్సు మధ్యలో ఆగిపోయినా, క్రమశిక్షణ కారణాలతో విద్యాసంస్థ నుంచి బహిష్కరణకు గురైనా రుణం ఆపేస్తారు.

దరఖాస్తు విధానం

- పీఎం విద్యాలక్ష్మి వెబ్‌సైట్‌లోకి వెళ్లి స్టూడెంట్‌ లాగిన్‌లో ఖాతా తెరవాలి.

- ఆధార్‌ సాయంతో వివరాలు నమోదు చేయాలి.

- రిజస్ట్రేషన్‌ ఫారంలో విద్యార్థి పేరు, సెల్‌ నెంబరు, ఈమెయిల్‌ ఐడీ నమోదుచేయాలి. ఓటీపీ వస్తుంది. దానిని ధ్రువీకరించి ఒక్కో దశ పూర్తి చేసి రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి.

- అవసరమైన పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి.

- ఏ బ్యాంకు నుంచి రుణం కావాలో ఎంపిక చేసుకోవాలి.

- బ్యాంకు శాఖల్లో సంప్రదించి కూడా విద్యా రుణానికి దరాఖాస్తు చేసే విధానం తెలుసుకోవచ్చు.

కావాల్సిన పత్రాలు...

- ఆధార్‌, పాన్‌కార్డు , ఆదాయ ధ్రువపత్రం

- చిరునామా రుజువుపత్రం.

- ప్రవేశ పరీక్ష ఫలితాల ధ్రువపత్రం.

- కోర్సులో చేరేందుకు విద్యాసంస్థ అందించే లేఖ.

అర్హులెవరంటే...

ఇంజనీరింగ్‌, వైద్యవృత్తి విద్య కోర్సులు, ఆర్కిటెక్చర్‌, చార్టర్డ్‌ అకౌంటెన్సీ, మేనేజ్‌మెంట్‌ ఎంఎస్‌, ఐఐటీ, విమానయాన తదితర ప్రొఫెషనల్‌ కోర్సులతో పాటు డిగ్రీ చదివే విద్యార్థులు రుణం పొందేందుకు అర్హులు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

రుణం ఎంతంటే ..

రూ.4లక్షలు లోపు, రూ.4లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు, రూ.7.5 లక్షలకు మించి ఇలా మూడు విభాగాల్లో రుణాలు మంజూరవుతాయి. కోర్సుల ఫీజులకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. దరఖాస్తుకు గడువు తేదీలేదు. ఒక విద్యార్థికి ఒక్కసారే దరఖాస్తుకు అవకాశం ఉంటుంది.

పూచీకత్తు లేకుండా ..

ఈ పథకం ద్వారా విద్యార్థులకు ఏ మాత్రం పూచీకత్తు లేకుండా విద్యారుణం అందించేలా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. రుణం మొత్తంలో కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే కాకుండా విద్యార్థికి అవసరమైన వసతి, రవాణా తదితర విద్యాసంబంధిత ఖర్చులన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో రుణం మంజూరుపై స్పష్టత ఇస్తారు.

ఆసరాగా నిలుస్తుంది

ఇంటర్‌ తరువాత ఉన్నత చదువులు చదివేందుకు పేద, మధ్యతరగతి వర్గాలకు పీఎం విద్యాలక్ష్మి ఆసరాగా నిలుస్తుంది. వైద్య, ఇంజనీరింగ్‌, వృత్తివిద్యా కోర్సులు చదివేవారికి ఉపయుక్తంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అందించే ఈపథకం సద్వినియోగం చేసుకోవాలి

-ఆర్‌.సురేష్‌కుమార్‌, ఆర్‌ఐవో, శ్రీకాకుళం

Updated Date - May 31 , 2026 | 11:59 PM