యువతకు అండగా పీఎం ఇంటర్న్‌షిప్
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:21 AM
Training in companies and industries నిరుద్యోగ యువతకు ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు, పరిశ్రమల్లో శిక్షణ కల్పించేందుకుగానూ.. పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని అమలు చేస్తున్నాయి.
కంపెనీలు, పరిశ్రమల్లో శిక్షణకు అవకాశం
నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడమే లక్ష్యం
అవగాహన లేక.. అంతంతమాత్రమే రిజిస్ట్రేషన్లు
నరసన్నపేట, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు, పరిశ్రమల్లో శిక్షణ కల్పించేందుకుగానూ.. పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని అమలు చేస్తున్నాయి. ఏఐసీటీఈ, స్కిల్ ఇండియా డిజిటల్ వంటి తదితర ప్రభుత్వ రంగ సంస్థలు పది నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, డిప్లొమా విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ల ద్వారా శిక్షణ కల్పించనున్నాయి. ఎన్‌హెచ్‌ఏఐ, జాతీయ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వశాఖ, తులిప్ ఇంటర్నేషనల్, మైక్రోసాప్ట్, ఏరోస్పేస్, గూగుల్, మైటి, అమృత్ స్కీం లాంటి సంస్థలు వివిధ విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌లు అందజేస్తున్నాయి. డేటాసైన్స్, ఏఐ, మిషన్ లెర్నింగ్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఫైథాన్, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, వెబ్ డిజైనింగ్, క్లౌడ్ కంప్యూటీంగ్, సైబర్ సెక్యూరిటీ, స్టాక్ డెవలపర్, ఎథికల్ హ్యాకింగ్‌కు సంబంధించి ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు డేటా సైన్స్ పైథాన్, డేటా అనలిస్టు, యాప్ డెవలప్‌మెంట్, డ్రోన్ టెక్నాలజీ, డిజిటల్ మార్కెటింగ్, హ్యూమన్ రీసోర్స్, రిక్రూటర్ ట్రైనీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లాంటి అనేక రంగాల్లో ఆయా సంస్థలు ఇంటర్న్‌షిప్‌లు అందజేస్తున్నాయి. కొన్ని కంపెనీలు రెండు నెలల నుంచి ఏడాది వరకూ శిక్షణ ఇచ్చి.. స్టైఫండ్ కూడా ఇస్తున్నాయి. కాగా జిల్లాలో ఇంజనీరింగ్, ఎంబీఏ పూర్తిచేసిన విద్యార్థులు మాత్రమే వీటిపై ఆసక్తి చూపుతున్నారు. మిగిలిన కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు అవగాహన లేక ఇంటర్న్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవడం లేదు. డిగ్రీ విద్యార్థులపై దీనిపై అవగాహన కల్పించాల్సి ఉంది.
పలు కంపెనీల్లో అవకాశం
దేశవ్యాప్తంగా 82,211 కంపెనీలు ఇంటర్న్‌షిప్‌లను అందజేస్తున్నాయి. 2026-27లో కోటి మంది విద్యార్థులు, యువతకు ఇంటర్న్‌షిప్‌లు పూర్తిచేసేలా కేంద్రం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. ప్రస్తుతం నేషనల్ ఇంటర్న్‌షిప్ పోర్టల్‌లో 79,51,193 ఇంటర్న్‌షిప్‌లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేటు స్టార్టప్ కంపెనీల్లో ఈ అవకాశాలు ఉండగా, పరిశ్రమ అనుభవం, నైపుణ్యాభివృద్ధిని పెంచడమే లక్ష్యంగా ఇంటర్న్‌షిప్‌లు అందజేస్తున్నాయి. విద్యార్థులు ఈ పోర్టల్‌లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 18 నుంచి 25ఏళ్ల మధ్య వయసు కలిగి.. పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ కోర్సు పూర్తిచేసిన వారు అర్హులు. దూర విద్య చదివే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ ఆధారంగా 6 నెలల నుంచి ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం ఉంటుంది.
యువతకు ఉపయుక్తం
డిగ్రీ విద్యార్థులకు చివర ఏడాదిలో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఇవ్వడంతో యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎంతో దోహదపడుతుంది. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌తో కంపెనీల్లో ప్రత్యక్ష అనుభవం ఏర్పడుతుంది. డిగ్రీ ఉత్తీర్ణత తరువాత ఉపాధి అవకాశాలు పొందవచ్చు. డిగ్రీ ఆరో సెమిస్టర్‌లో ఇంటర్న్‌షిప్ ఉంటుంది.
డా.లత, ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్, నరసన్నపేట