Share News

ప్లీజ్‌.. ఒక్కసారి రండి

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:35 AM

Sarpanch candidates' phone calls to migrant voters పంచాయతీ పోరులో ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుదారులైన సర్పంచ్‌ అభ్యర్థులు.. వలస ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాకు చెందిన వేలాది మంది విశాఖ, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్‌, చెన్నై తదితర ప్రాంతాల్లో వలసజీవులుగా నివసిస్తున్నారు. మరికొంతమంది మత్స్యకారులు గుజరాత్‌లోని కాండ్లా, పారాదీప్‌, గోవా, అండమాన్‌, ముంబాయి తదితర ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. ఇలా.. ఉపాధి, ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువు తదితర కారణాలతో ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వలస ఓటర్లను స్వగ్రామాలకు రప్పించేందుకు సర్పంచ్‌ అభ్యర్థులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.

ప్లీజ్‌.. ఒక్కసారి రండి

ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించండి

వలస ఓటర్లకు ఫోన్‌లో సర్పంచ్‌ అభ్యర్థుల వేడుకోలు

చార్జీలు, ఖర్చులన్నీ భరిస్తామని హామీ

కోటబొమ్మాళి/ టెక్కలి/ నందిగాం/ జలుమూరు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి):

హలో శంకర్‌ ఎలా ఉన్నావ్‌?. తుఫాన్‌ అంటున్నారు... పనులు చేస్తున్నారా? అంతా బాగున్నారు కదా!. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. మీ నలుగురూ మన ఊరికి రావాలి. ఇక్కడకి వచ్చేందుకు చార్జీలన్నీ మేమే ఇస్తాం. ఖర్చులు కూడా మావే. ఖచ్చితంగా వచ్చి.. నాకు ఓటు వేసి గెలిపించాలి.

- వలస ఓటరుకు ఫోన్‌లో.. ఓ సర్పంచ్‌ అభ్యర్థన ఇది.

పంచాయతీ పోరులో ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుదారులైన సర్పంచ్‌ అభ్యర్థులు.. వలస ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాకు చెందిన వేలాది మంది విశాఖ, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్‌, చెన్నై తదితర ప్రాంతాల్లో వలసజీవులుగా నివసిస్తున్నారు. మరికొంతమంది మత్స్యకారులు గుజరాత్‌లోని కాండ్లా, పారాదీప్‌, గోవా, అండమాన్‌, ముంబాయి తదితర ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. ఇలా.. ఉపాధి, ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువు తదితర కారణాలతో ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వలస ఓటర్లను స్వగ్రామాలకు రప్పించేందుకు సర్పంచ్‌ అభ్యర్థులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థి, పార్టీల వారీగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఏజెన్సీల ద్వారా రవాణా టికెట్లు, వచ్చాక ఖర్చులకు డబ్బులు ఇచ్చేందుకు ఆర్థిక వనరులను సిద్ధం చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కొందరు వలస ఓటర్లు స్వగ్రామాలకు చేరుకుని ఓటుహక్కు వినియోగించుకున్నారు. వారికి టికెట్లు, రవాణా ఖర్చులను సైతం అభ్యర్థులు చెల్లించారు. ఈ నెల 26 నుంచి తొలివిడల పలాస రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఏడు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత 29న మరో 13 మండలాలు, మూడో విడత డిసెంబరు 2న పది మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు కూడా మరోసారి రావాలని సర్పంచ్‌ అభ్యర్థులు.. వలస ఓటర్లను కోరుతున్నారు. ఈ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకం కావడంతో పోన్లు చేసి పిలుస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరికీ మెసేజ్‌లు పంపి విజ్ఞప్తి చేస్తున్నారు.

పుట్టుకొస్తున్న చుట్టరికం

పంచాయతీ ఎన్నికల వేళ.. బంధుత్వాలు, చుట్టరికాలు పుట్టుకొస్తున్నాయి. గతంలో ఎదురుపడ్డా, పక్కనే కూర్చున్నా కనీసం పలుకరించనివారు సైతం ఇప్పుడు కొత్తగా బంధుత్వాలు కలుపుకుని మాట్లాడుతున్నారు. అన్నా, మామా, పిన్నమ్మా అంటూ వరుసలు కలిపేస్తు, ఓట్ల వేట సాగిస్తున్నారు. మరోవైపు వలస ఓటర్లకు ఫోన్‌లు చేసి మామా, అల్లుడు, అన్న, తమ్ముడు అని సంబోధించి నేను బరిలో ఉన్నా.. మీరు ఓటు వేసేందుకు రావాలంటూ పిలుస్తున్నారు. గ్రామాలకు వచ్చేందుకు అయ్యే ఖర్చులు పూర్తిగా తామే భరిస్తామని భరోసా ఇస్తున్నారు. చాలామంది అభ్యర్థులు ముందుగానే వలస ఓటర్లకు డబ్బులు పంపిస్తున్నారు. మరికొందరు పోలింగ్‌ ముందురోజే వారిని స్వగ్రామాలకు తీసుకువచ్చేలా వాహనాలు సమకూర్చుతున్నారు.

Updated Date - Nov 20 , 2026 | 12:35 AM