Share News

జాతకం చూడు స్వామీ!

ABN , Publish Date - Oct 29 , 2026 | 12:02 AM

జిల్లాలో ఓ మండలం నుంచి జడ్పీటీసీ బరిలో దిగిన అభ్యర్థి భార్య ఇటీవల జ్యోతిష్యుడి వద్దకు వెళ్లింది.

   జాతకం చూడు స్వామీ!

- సెంటిమెంట్‌కి ప్రాధాన్యమిస్తున్న చాలామంది అభ్యర్థులు

-స్వామీజీలు, జ్యోతిష్యులను ఆశ్రయిస్తున్న వైనం

- డబ్బు ముట్టజెప్పి పూజలు, హోమాలు

శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓ మండలం నుంచి జడ్పీటీసీ బరిలో దిగిన అభ్యర్థి భార్య ఇటీవల జ్యోతిష్యుడి వద్దకు వెళ్లింది. తన భర్త ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, జాతకం ఎలా ఉందో? గ్రహబలం బాగుందో ? లేదో.. ఒకవేళ గ్రహబలం పెరగడానికి ఏమి చేయాలో చెప్పందని అడిగింది. దీంతో జ్యోతిష్యుడు ‘మీ భర్త రాజకీయాల్లో రాణిస్తారని .. మంచి మెజార్టీతో గెలిచేందుకు చిన్నపూజ చేయాలని.. అందుకు రూ.30వేల వరకు ఖర్చువుతుందని’ తెలిపారు. తీరా ఆ అభ్యర్థి పోటీచేసే స్థానాన్ని పొత్తులో భాగంగా మరోక పార్టీకి కేటాయించారు. దీంతో ఆయన జడ్పీటీసీ స్థానం నుంచి తప్పుకున్నారు.

- ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలిచిన ఓ అభ్యర్థి పొరుగు రాష్ట్రం ఒడిశాలోని ఒక స్వామి వద్దకు వెళ్లారు. తాను పోటీ చేస్తున్న వార్డుని మరోపార్టీ వారు కావాలని పట్టుపడుతున్నారని, ఎలాగైనా తనకు సీటు వచ్చేలా చూడాలన్నారు. దీంతో స్వామీజీ.. ‘నీ పేరుమీద హోమం చేస్తా. దీంతో నీ సీటుకు ఢోకా ఉండదు. దానికి రూ.20వేలు ఖర్చువుతుంది.’ అన్నారు. ఖర్చు పెట్టి అభ్యర్థి పూజ చేయించాడు. ఆ సీటు అతడికి కాకుండా మహిళకు కేటాయించారు. ఆయనకు టికెట్‌ రాకుండా పోయింది.

- నరసన్నపేట మండలానికి చెందిన ఓ పార్టీ నాయకుడు ప్రముఖ పురోహితుడిని కలిశాడు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, గెలుపోటములు ఎలా ఉంటాయని అడిగాడు. సదరు పురోహితుడు నీకు గ్రహబలం లేదని, మూడు వారాలు పాటు పూజలు చేయిస్తే నీ పేరుకు బలం వస్తుందని చెప్పాడు. దీంతో ఆ నాయకుడు పూజలు చేయించడం ప్రారంభించాడు. కానీ, ఆ సీటు మహిళ జనరల్‌ కేటాయించారు. సీటు అతడికి కాకుండా ఆయన భార్యకు దక్కింది. ఎలాగో భార్యకు దక్కింది కాబట్టి పూజ ఫలితమే అని చెప్పుకుంటున్నారు.

ఈ ముగ్గురే కాదు ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. స్వామి తమ జాతకం ఎలా ఉందని, ఎప్పుడు నామినేషన్‌ వేయాలని, ఎప్పుడు ప్రచారం ప్రారంభించాలని, ఎటువైపు నుంచి ఓటు అడగాలనే విషయాలను తెలుసుకునేందుకు జ్యోతిష్యులు, స్వామీజల వద్దకు క్యూ కడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే పలాస, ఇచ్ఛాపురం మున్సిపల్‌ స్థానాలకు, అదే విధంగా 30 జడ్పీటీసీ, 542 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో చాలామంది అభ్యర్థులు గెలుపోటములపై ఓటర్లపై కాకుండా జ్యోతిష్యులపై భారం పెడుతున్నారు. తాము ప్రచారం నిర్వహించే రోజుల్లో ఎలా వెళ్లాలి?. ఏ రోజు ఎక్కడ ప్రచారం చేయాలి? ఒక రోజులో ఎన్ని ఇళ్లు తిరిగాలి అనే విషయాలను అడుగుతున్నారు. తమ ప్రత్యర్థి పేర్లను కూడా చెప్పి జాతకాలను లెక్కలేయిస్తున్నారు. పోలింగ్‌ జరిగే రోజు ఇంటి నుంచి బయటకు ఎలా వెళ్లేది? ఓటు వేయడం, కౌటింగ్‌ రోజు ఏజెంట్లగా ఏ పేరు ఉన్న వారిని పెట్టుకోవాలి. ఎంత మంది వెళ్లాలి? అనే విషయాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు.

సెంట్‌మెంట్‌కే ప్రాధాన్యం

ఏఐ యుగంలో కూడా సెంట్‌మెంట్‌కే కొందరు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు ఏ రోజుకారోజు స్వామీజిలను అడిగి మరీ దుస్తులు ధరిస్తున్నారు. ఏ రంగు దుస్తులతో ప్రచారానికి వెళ్తే కలిసి వస్తుంది.. చేతికి ఏ జాతి ఉంగరాలు ధరించాలి అనే విషయాలను కూడా తెలుసుకొని ప్రచారం చేస్తున్నారు. మరికొంతమంది అభ్యర్థులు ఎన్నికల్లో కలిసి వస్తుందనో ఉద్దేశంతో అన్ని వాస్తులతో కూడిన ఇళ్లలోకి సైతం మారారు. మరికొందరు అభ్యర్థులు ప్రతిరోజూ తమ కుటుంబ సభ్యులతో పూజులు చేయిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఓటర్లని ఎంత నమ్ముతున్నారో అంతకు రెట్టింపు స్వామీజీలపై భరోసా పెడుతున్నారు.

Updated Date - Oct 29 , 2026 | 12:02 AM