Share News

జోరుగా పేకాట

ABN , Publish Date - Jan 12 , 2026 | 12:18 AM

Playing cards సంక్రాంతి సమీపిస్తున్న వేళ.. జిల్లాలో జోరుగా పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయి. ఏడాది పొడవునా ఈ ఆటలు కొనసాగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అయితే పేకాటబారిన పడుతున్న కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.

జోరుగా పేకాట

  • జిల్లాలో యథేచ్ఛగా శిబిరాలు

  • సరిహద్దు ప్రాంతాల్లోనే అధికం

  • సంక్రాంతి సమీపిస్తుండడంతో వెలుగులోకి ఘటనలు

  • రణస్థలం, జనవరి 11(ఆంధ్రజ్యోతి):

  • గత డిసెంబరు 20న ఎచ్చెర్ల మండలం కొత్తపేట సమీపాన నీలగిరి తోటలో పేకాడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.38,630 నగదుతోపాటు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

  • ఈ నెల 3న కవిటి మండలం కమలాయిపుట్టుగ సమీపంలో పేకాడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద రూ.1.61,600 నగదును స్వాధీనం చేసుకున్నారు.

  • ఈ నెల 9న రణస్థలం మండలం సీతారాంపురం సమీపంలో పేకాట శిబిరంపై జేఆర్‌ పురం పోలీసులు దాడిచేశారు. ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.95 లక్షల నగదుతోపాటు ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

  • అదే రోజు నరసన్నపేట మండలం కోమర్తి సమీపంలో తోటలో పేకాడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.19వేలు స్వాధీనం చేసుకున్నారు.

  • ఈ నెల 10న రణస్థలం మండలం దేవరాపల్లి సమీపంలోని తోటలో పేకాడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.82,500 నగదు, 5 సెల్‌ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

  • సంక్రాంతి సమీపిస్తున్న వేళ.. జిల్లాలో జోరుగా పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయి. ఏడాది పొడవునా ఈ ఆటలు కొనసాగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అయితే పేకాటబారిన పడుతున్న కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. జిల్లాలో గడిచిన రెండేళ్లలో 607 పేకాట కేసులు నమోదయ్యాయి. ఏకంగా 3,331 మంది అరెస్టయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. వారి నుంచి రూ.1.19కోట్ల నగదుతోపాటు 1093 సెల్‌ఫోన్లు.. 394 ద్విచక్ర వాహనాలు, 13 కార్లు, ఐదు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోనే ఎక్కువగా పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక డెన్‌లు పెట్టి పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారన్నది బహిరంగ రహస్యం.

  • పైడిభీమవరం పారిశ్రామికవాడలో 10 వరకూ లాడ్జీలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాతపట్నం, మెళియాపుట్టి సరిహద్దు ప్రాంతాలకు సైతం జిల్లా నుంచి పేకాటరాయుళ్లు ఎక్కువగా వెళుతుంటారు. వంశధార, నాగావళి నదుల సమీపంలోని తోటలు సైతం పేకాట శిబిరాలకు అడ్డాగా మారుతున్నాయి. పేకాట శిబిరాలకు అనధికార వ్యక్తులకు ప్రవేశం ఉండదు. తెలిసివారు, పరిచయస్థులు ఉంటేనే ప్రవేశం కల్పిస్తారు. ఇక్కడ సభ్యత్వం కావాలంటే రూ.5వేల నుంచి రూ.10 వేల వరకూ కట్టాల్సి ఉంటుంది. అక్కడే భోజనం, మద్యం, ఇతర సదుపాయాలు కల్పిస్తారు. ఇలా పేకాట శిబిరాలు నడుపుతున్నవారు రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. జూదరులు మాత్రం ఆస్తులు కోల్పోయి ఆర్థికంగా నష్టపోతున్నారు. పండుగ వేళ.. పేకాట శిబిరాల నిర్వహణను అడ్డుకునేలా పోలీసులు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

  • జూదరులపై డ్రోన్‌ నిఘా

  • తీరప్రాంత గ్రామాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పేకాట, కోడి పందేలు జరిగే ప్రదేశాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఆదివారం డ్రోన్‌ నిఘా పెట్టారు. అక్కయ్యపాలేం, నారువ, మెంటాడ, కోటపాలేం, చిల్లపేటరాజం, మరువాడ గ్రామాల పరిసర ప్రాంతాల తోటల్లో డ్రోన్‌ ద్వారా పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవితోపాటు పోలీస్‌ బృందం పాల్గొంది.

  • నిఘా పెంచాం..

  • చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. పేకాట డెన్‌లు, జూదం శిబిరాలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా పెంచాం. ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తున్నాం. ఎక్కడైనా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిస్తే 112 టోల్‌ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలి.

    - డీఎస్పీ వివేకానంద, శ్రీకాకుళం

Updated Date - Jan 12 , 2026 | 12:18 AM