ప్లాస్టిక్ నిషేధం.. అమలేదీ?
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:22 AM
జిల్లాలో ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు ప్రధాన పట్టణాల్లో నిషేధిత ప్లాస్టిక్ యథేచ్ఛగా వినియోగిస్తున్నారు.
-పట్టణాల్లో విచ్చలవిడిగా వినియోగం..
-చెత్తలో సింహభాగం ప్లాస్టిక్ వ్యర్థాలే
-జిల్లాలో రోజుకు 155 మెట్రిక్ టన్నుల చెత్త
-అందులో 17.5 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్
-మూడేళ్లలో 285 కేసులు.. రూ.2.86 లక్షల జరిమానా
-నామమాత్రపు తనిఖీలు.. పట్టించుకోని యంత్రాంగం
ఇచ్ఛాపురం, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు ప్రధాన పట్టణాల్లో నిషేధిత ప్లాస్టిక్ యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. నియంత్రణ, నిషేధం పేరుకే పరిమితమవుతున్నాయి. ఆచరణలో మాత్రం మార్పు కనిపించడం లేదు. చిన్న కిరాణా దుకాణం నుంచి పెద్ద రెస్టారెంట్ వరకు ప్లాస్టిక్ వినియోగం సాధారణంగా మారిపోయింది. నిత్యం పోగవుతున్న చెత్తలో గణనీయమైన వాటా ప్లాస్టిక్ వ్యర్థాలదే. గతంలో అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు చేపట్టినా.. ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశారనే విమర్శలున్నాయి. నిషేధం అమలుపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయకపోవడంతో ప్లాస్టిక్ వినియోగానికి అడ్డుకట్ట పడడం లేదు.
చెత్తలోనూ భారీ వాటా
జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస మునిసిపాలిటీలు ఉన్నాయి. ఈ నాలుగు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో రోజుకు మొత్తం 155 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇందులో 17.5 మెట్రిక్ టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
- శ్రీకాకుళం నగరంలో రోజుకు 80 మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతుండగా, అందులో 6.5 మెట్రిక్ టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలే. గత మూడేళ్లలో ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించి 210 కేసులు నమోదు చేసి, రూ.1.59 లక్షల జరిమానా వసూలు చేశారు.
- ఇచ్ఛాపురం మునిసిపాలిటీ పరిధిలో రోజుకు 21 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, 3 మెట్రిక్ టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలే. గత మూడేళ్లలో 41 కేసులు నమోదు చేసి, రూ.25 వేల జరిమానా వసూలు చేశారు.
- పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో రోజుకు 28 మెట్రిక్ టన్నుల చెత్త పోగవు తుండగా, నాలుగు మెట్రిక్ టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలు. ఇక్కడ 20 కేసులు నమోదు చేసి, రూ.80వేల జరిమానా వసూలు చేశారు
- ఆమదాలవలస మునిసిపాలిటీలో రోజుకు 28మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, 4 మెట్రిక్ టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలే. గత మూడేళ్లలో 14 కేసులు నమోదు చేసి, రూ.22 వేల జరిమానా వసూలు చేశారు.
నాలుగేళ్లుగా నిషేధం
కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు 2022 జూలై 1వ తేదీ నుంచి నిర్దిష్ట సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, అమ్మకం, వినియోగంపై నిషేధం అమల్లోకి వచ్చింది. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులతో పాటు ఒకసారి వాడి పారేసే పలు వస్తువులపై ప్రభుత్వం నిషేధం విధించింది.
ప్లాస్టిక్ స్టిక్స్, ఇయర్‌బడ్స్, జెండాలు, ఐస్‌క్రీం పుల్లలు, చెంచాలు, బెలూన్లకు ఉపయోగించే ప్లాస్టిక్ కర్రలు, థర్మకోల్ వస్తువులు, 100 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న పీవీసీ బ్యానర్లు తదితర వస్తువులు నిషేధిత జాబితాలో ఉన్నాయి. అయినప్పటికీ వీటి వినియోగం కొనసాగుతూనే ఉంది. వాడిపారేసిన ప్లాస్టిక్ సంచులు, థర్మకోల్, ప్లాస్టిక్ సీసాలు మురుగు కాలువలు, డంపింగ్ యార్డుల్లో పేరుకుపోతున్నాయి. కాలువల్లో నీరు నిలిచిపోవడంతో దోమలు వృద్ధి చెంది, వ్యాధుల వ్యాప్తికి అవకాశం ఏరఁడుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్నా.. నియంత్రణ చర్యలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు.
ప్రజల భాగస్వామ్యం అవసరం
ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలంటే అధికారుల చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వర్గాలు సూచిస్తున్నాయి. వస్త్రం, జ్యూట్‌తో తయారు చేసిన సంచులను వినియోగించడం ద్వారా ప్లాస్టిక్‌పై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. నిషేధిత వస్తువుల విక్రయాలు, వినియోగంపై అధికారులు నిరంతర తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అమలు చేస్తున్నాం
ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కాగా అమలు చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. కేసులు కూడా నమోదు చేస్తాం. ప్లాస్టిక్‌ను మనకు మనమే నిషేధించుకోవాలి. వస్త్రం, గుడ్డ, జ్యూట్‌తో తయారు చేసిన సంచులను వినియోగించడం మంచిది. లేదంటే ప్లాస్టిక్ ప్రపంచ భవిష్యత్తుకే ముప్పుగా మారుతుంది.
- ఎన్. రమేష్, కమిషనర్, ఇచ్ఛాపురం మునిసిపాలిటీ