Share News

జైలులో ప్రణాళిక వేసి.. గంజాయి తరలించి

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:00 AM

పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో ఓ వ్యక్తి గంజాయితో పోలీసులకు పట్టుబడ్డాడు.

 జైలులో ప్రణాళిక వేసి.. గంజాయి తరలించి

- పోలీసులకు పట్టుబడిన వ్యక్తి

- ఆరు కేజీల సరుకు స్వాధీనం

పాతపట్నం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో ఓ వ్యక్తి గంజాయితో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ వివరాలను ఎస్‌ఐ కె.మధుసూదనరావు శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. ఆయన వివరాల మేరకు.. తమిళనాడుకు చెందిన మణికందాస్‌ అనే వ్యక్తికి ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి సమీపంలోని రాణిపేటకు చెందిన సులతాపాణి అలియాస్‌ బేబీ అనే మహిళతో విశాఖపట్నం సెంట్రల్‌ జైల్‌లో పరిచయం ఏర్పడింది. సులువుగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో గంజాయి తరలించేందుకు జైలులో ప్రణాళికలు రూపొందించారు. ఈ నేపథ్యంలో బేబీ నుంచి ఆరు కేజీల గంజాయిని మణికందాస్‌ కొనుగోలు చేశాడు. దీన్ని పొట్లాలుగా చేసి చెన్నైలోని మెరైన్‌ బీచ్‌లో అమ్మకాలు చేయాలని భావించాడు. ఈ మేరకు రాణిపేట నుంచి పాతపట్నం వరకూ స్కూటర్‌పై వచ్చాడు. ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు శుక్రవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో స్థానిక మయూరీ ట్రావెల్స్‌ కార్యాలయం వద్ద టికెట్‌ కొనుగోలు చేసేందుకు నిల్చొన్నాడు. మణికందాస్‌ వద్దఉన్న ప్యాకెట్‌ను చూసి అనుమానించిన ట్రావెల్స్‌ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు రంగప్రవేశం చేసి మణికందాస్‌ను పట్టుకొని ఆరుకేజీల గంజాయితో పాటు స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని స్థానిక జూనియర్‌ సివిల్‌ కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి రిమాండ్‌ విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Feb 21 , 2026 | 12:00 AM