Share News

అర్హులకు ఓటర్ల జాబితాలో చోటు

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:18 AM

Meticulous execution of the ‘Sir’ process ‘స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారు చేయాలి. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి. అర్హులందరూ ఓటర్ల జాబితాలో ఉండాల’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ స్పష్టం చేశారు.

అర్హులకు ఓటర్ల జాబితాలో చోటు
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

పకడ్బందీగా ‘సర్‌’ ప్రక్రియ

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): ‘స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారు చేయాలి. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి. అర్హులందరూ ఓటర్ల జాబితాలో ఉండాల’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ స్పష్టం చేశారు. గురువారం జడ్పీ సమావేశ మందిరంలో ఈఆర్వోలు, సూపర్‌వైజర్లతో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘బీఎల్‌వోలకు కేటాయించిన గృహాలను సందర్శించి, ఎన్యూమరేషన్‌ ప్రక్రియను విజయవంతంగా చేయాలి. ప్రతీ ఫారానికి అంగీకారపత్రం ఉండాలి. జూలై 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలి. జూలై 14 నాటికి ఇంటింటి సర్వే పూర్తిచేయాలి. జూలై 21 వరకు డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌, జూలై 21నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాల నమోదు, పరిష్కారం చేపట్టాలి. జూలై 21 నుంచి సెప్టెంబరు 18వరకు క్లెయిమ్‌లు, డిస్పోజల్స్‌ ఉంటుంది. తుది జాబితా సెప్టెంబర్‌ 22న విడుదల చేస్తాం. ప్రతీ వారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాల’ని కలెక్టర్‌ ఆదేశించారు. శిక్షణలో డీఆర్వో విశ్వేశ్వరరావు ఓటరు నమోదు, పోస్ట్‌ డ్రాఫ్ట్‌, డిక్లరేషన్‌ ఫారం, క్లెయిమ్‌, అభ్యంతరాలు తదితర అంశాలను క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా మ్యాపింగ్‌ ప్రక్రియలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు ఎలక్ర్టోరల్‌ అధికారులను కలెక్టర్‌ అభినందించారు. సమావేశంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఆర్డీవో కె.సాయిప్రత్యూష, డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, జయదేవి, లక్ష్మణమూర్తి, లావణ్య, కార్పొరేషన్‌ కమిషనర్‌ కూర్మారావు, జడ్పీ సీఈఓ వెంకటరామన్‌, తహసీల్దార్లు, డీటీలు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2026 | 12:18 AM