Share News

మరో 81

ABN , Publish Date - Feb 17 , 2026 | 11:40 PM

Selection of schools under PMShri ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తయారు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ముందుకెళ్తున్నాయి. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలను ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ (పీఎంశ్రీ) పథకానికి ఎంపిక చేస్తున్నాయి. నూతన విద్యావిధానంలో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాయి.

మరో 81
ఇచ్ఛాపురంలోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల

  • పీఎంశ్రీ పథకంలో పాఠశాలలకు చోటు

  • జిల్లాలో ఇప్పటికే 35 సూళ్లు ఎంపిక

  • అభివృద్ధితోపాటు సమాజ సేవకు దోహదం

  • ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తయారు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ముందుకెళ్తున్నాయి. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలను ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ (పీఎంశ్రీ) పథకానికి ఎంపిక చేస్తున్నాయి. నూతన విద్యావిధానంలో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాయి. ఇప్పటివరకూ ఏడు విడతల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. జిల్లాకు సంబంధించి తొలి విడతలో 32, రెండో విడతలో 3 పాఠశాలలను ఎంపిక చేశారు. కానీ 3, 4, 5, 6 విడతల్లో మాత్రం ఒక్క పాఠశాలనూ ఎంపిక చేయలేదు. తాజాగా ఏడో విడతలో ఏకంగా 81 పాఠశాలలను ఎంపిక చేసి ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపరిచారు.

  • మౌలిక వసతులు..

  • తొలి రెండు విడతల్లో ఎంపికైన 35 పాఠశాలల్లో రూ.4.2 కోట్ల నిధులతో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చొప్పున నిధులు మంజూరు చేశాయి. విద్యార్థులకు చదువుతోపాటు దేశభక్తి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువల పెంపు, సమాజంలో మంచి నడవడిక అలవరచాలన్న లక్ష్యంతో పీఎంశ్రీ పాఠశాలలు ముందుకు సాగుతున్నాయి. ఆయా పాఠశాలల్లో క్రీడాకోర్టులు, రన్నింగ్‌ కోర్టులు, మైదానాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇంకుడుగుంతలు, కిచెన్‌గార్డులు, ఉద్యానాలు, కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. తరగతి గదులకు ర్యాంపుల నిర్మాణం చేపడుతున్నారు. ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, పరికరాలు అందుబాటులోకి తెస్తున్నారు. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఏర్పాటుచేసి ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు భాగస్వామ్యం కల్పిస్తున్నారు.

  • స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌తో..

  • ఉమ్మడి జిల్లాలో 800 మంది వరకూ విద్యార్థులు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో చేరినట్టు తెలుస్తోంది. వారు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటడమే కాకుండా సంరక్షించే బాధ్యతను సైతం తీసుకుంటారు. దేవాలయాల వార్షికోత్సవాలు, వివిధ వేడుకల సమయంలో వచ్చే భక్తులు క్యూలైన్‌లో వెళ్లేలా పర్యవేక్షిస్తారు. తాగునీరు, మజ్జిగ, ప్రసాదాలను పంపిణీ చేస్తారు. స్వాతంత్య్ర దినోత్సవాలు, రిపబ్లిక్‌ డే వేడుకల్లో భాగస్వామ్యులవుతారు. ఆయా సేవా కార్యక్రమాలు విద్యార్థి భవిష్యత్‌కు ఎన్నోరకాలుగా దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మున్ముందు పీఎంశ్రీ పాఠశాలలను విస్తరించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.

  • ఎన్నో ప్రయోజనాలు

  • విద్యార్థుల్లో ప్రాథమికస్థాయి నుంచే సేవా కార్యక్రమాలు అలవరిచేందుకు ఇదో మంచి అవకాశం. నాయకత్వ లక్షణాలు, సేవా గుణం అలవరుతుంది. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో శిక్షణ ఉంటుంది. పాఠశాలల్లో కూడా వసతులు మెరుగుపడతాయి.

  • - కె.అప్పారావు, ఎంఈవో, ఇచ్ఛాపురం

  • పాఠశాలల అభివృద్ధి

  • పీఎంశ్రీ పాఠశాల ఎంపిక కావడం విద్యార్థులకు వరం లాంటిది. పీఎంశ్రీ పాఠశాలలకు మంజూరైన ప్రత్యేక నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు జరగుతాయి. మా పాఠశాలకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ ప్రయోగ శాలలకు సంబంధించి పూర్తి మెటీరియల్స్‌తోపాటు ఒకేషనల్‌ కోర్స్‌(వృత్తివిద్య)లకు ఎలకా్ట్రనిక్స్‌, ఫుడ్‌ ఫ్రొసెసింగ్‌, ఐటీ పరికరాలు రావటంతో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడింది. ప్రాక్టికల్స్‌కు వేర్వేరు గదుల కోసం నిధులు కేటాయించాల్సి ఉంది.

  • - సూర్యారావు, పీఎంశ్రీ జీహెచ్‌ స్కూల్‌ హెచ్‌ఎం

Updated Date - Feb 17 , 2026 | 11:40 PM