Share News

చేదెక్కిన చెరకు

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:35 PM

Reduced sugarcane cultivation area జిల్లాలో చెరకు సాగు పూర్తిగా తగ్గుముఖం పడుతోంది. ప్రతి ఏటా విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. పదేళ్ల కిందట 5,650 హెక్టార్లలో సాగయిన పంట.. నేడు 392 హెక్టార్లకు మాత్రమే పరిమితమైంది.

చేదెక్కిన చెరకు
ఎస్‌.ఎం.పురం సమీపంలో చెరకు పంట

  • జిల్లాలో భారీగా తగ్గిన సాగు విస్తీర్ణం

  • సుగర్‌ ఫ్యాక్టరీ మూతపడడంతో రైతుల అనాసక్తి

  • గిట్టుబాటు ధర లేకపోవడమూ కారణమే

  • ఎచ్చెర్ల, మార్చి 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చెరకు సాగు పూర్తిగా తగ్గుముఖం పడుతోంది. ప్రతి ఏటా విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. పదేళ్ల కిందట 5,650 హెక్టార్లలో సాగయిన పంట.. నేడు 392 హెక్టార్లకు మాత్రమే పరిమితమైంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర గిట్టుబాటు కాకపోవడం.. కూలీల కొరత.. పంటకు సోకుతున్న చీడపీడలు.. వేలాది రూపాయల పెట్టుబడులు.. చక్కెర పరిశ్రమల మూతపడడం తదితర కారణాలతో చెరకు సాగుపై రైతుల ఆసక్తి సన్నగిల్లుతోంది.

  • జిల్లాలో పరిస్థితి..

  • జిల్లాలో ఆమదాలవలస చక్కెర కర్మాగారం ఉన్నప్పుడు రైతులు చెరకును విస్తారంగా సాగు చేసేవారు. అయితే, ఆ ఫ్యాక్టరీ మూతపడిన తరువాత సాగు తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఎచ్చెర్ల, లావేరు, పొందూరు, పోలాకి, నరనసన్నపేట తదితర మండలాల్లో చెరకు సాగు చేస్తున్నారు. వీరంతా ఇప్పుడు విజయనగరం జిల్లాలోని సంకిలి సుగర్‌ ఫ్యాక్టరీకి పంటను పంపిస్తున్నారు. చెరకు కటింగ్‌ ఆర్డర్‌ వరకు ఇబ్బంది లేకపోయినా, ధర గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పదేళ్ల కిందట వరకు చెరుకు సాగు బాగానే జరిగింది. 2015-16లో 5,650 హెక్టార్లలో సాగు కాగా, హెక్టారుకు 80 నుంచి 100 టన్నుల దిగుబడి వచ్చేది. అప్పట్లో 5.60లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యేది. ఈ పదేళ్లలో కారణాలేమైనప్పటికీ సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. 2025-26లో కేవలం 392 హెక్టార్లకు మాత్రమే చెరకు పరిమితమైంది. దిగుబడి కూడా 70-75 టన్నులకు పడిపోయింది.

  • సాగు తగ్గడానికి కారణాలెన్నో..

  • చెరకు సాగు విస్తీర్ణం తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. పంట కోత తర్వాత త్వరగా ప్రొసెస్‌ చేయాలి. లేదంటే పంట ఎండిపోయి పాడైపోతుంది. విత్తనం పంపిణీ, కటింగ్‌, గిట్టుబాటు ధర చెల్లించే విషయంలో తీవ్ర అనిశ్చితి నెలకొనడంతో సాగుపై తీవ్ర ప్రభావం పడుతోంది. అలాగే కూలీల కొరత, పంట కాల వ్యవధి ఎక్కువ కావడం(10 నెలల నుంచి 12 నెలలు), అధిక పెట్టుబడి తదితర కారణాలతో క్రమేణా చెరకు సాగు తగ్గుతూ వస్తోంది. చెరకు ఉత్పత్తిలో ఎక్కువ భాగం సంకిలి సుగర్‌ ఫ్యాక్టరీకి రైతులు పంపిస్తారు. అలాగే సంప్రదాయ బెల్లం తయారీకి వినియోగిస్తున్నారు. ఈ బెల్లం తయారీ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యమైన పరిశ్రమగా కొనసాగుతోంది. చెరకు సాగు ఇబ్బందిగా మారడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి చూపిస్తున్నారు. వరి, మొక్కజొన్న, ఆయిల్‌ఫాం వంటివి సాగు చేస్తున్నారు.

  • గిట్టుబాటు కాని ధర..

  • చెరకు టన్నుకు రూ. 3,300 చెల్లిస్తున్నారు. ఇది ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీల వేతనాలు, కటింగ్‌, రవాణా చార్జీలను రైతులే భరించాలి. అలాగే సుగర్‌ ఫ్యాక్టరీల నుంచి చెల్లింపుల్లో జాప్యంతో రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. సాగు కోసం తీసుకున్న రుణాలను తీర్చలేక, వచ్చే పంటకు పెట్టుబడి పెట్టలేక సతమతమవుతున్నారు. అందుబాటులో లేకపోవడంతో సుగర్‌ ఫ్యాక్టరీలకు చెరకును పంపించడం కూడా రైతులకు సమస్యగానే తయారైంది. చెరకు తరలింపు క్రమంలో పంట బరువు తగ్గి రైతులకు మరింత నష్టం జరుగుతోంది.

  • రైతులను ప్రోత్సహించాలి

  • చెరకుకు సరైన గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులకు కాస్త ఉపశమనం కలుగుతుంది. చెరకు రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సాగు కష్టమైంది. రైతులను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.

    - సంపతిరావు గణపతిరావు, చెరుకు రైతు, ఎస్‌ఎంపురం, ఎచ్చెర్ల మండలం

Updated Date - Mar 09 , 2026 | 11:35 PM